
బాలయ్య ఇలాకాలోలో టెన్షన్..టెన్షన్
టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉంటున్న హిందూపురంలో ‘తమ్ముళ్ల’ మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది.
► హిందూపురంలో మిన్నంటిన ‘అసమ్మతి’ రాగం
► ఎమ్మెల్యే పీఏను సాగనంపేందుకు
ప్రత్యర్థి వర్గం తీవ్ర ప్రయత్నాలు
► ఉనికిని కాపాడుకునేందుకు పీఏ శేఖర్ పాట్లు
హిందూపురం : టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉంటున్న హిందూపురంలో ‘తమ్ముళ్ల’ మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఒకవైపు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ వర్గీయులు, మరోవైపు అసమ్మతిని లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ వర్గీయులు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు, బలనిరూపణలతో ‘పురం’ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వీరి కుమ్ములాటలతో పార్టీ కంచుకోటకు బీటలు కూడా వారాయి. ‘చూడు ఒక వైపే చూడు.. రెండో వైపు చూడొద్దు.. తట్టుకోలేవు’ అని సినిమా డైలాగులతో హూంకరించే ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ వైపు చూస్తారోనన్న ఆసక్తి నెలకొంది.
నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక్కడి పెత్తనమంతా పీఏ శేఖర్‌కు అప్పగించారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన అవినీతికి తెరలేపారని, భారీఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. పీఏను ఇక్కడి నుంచి పంపించకపోతే తాము రాజీనామా చేస్తామని అల్టివేటం ఇచ్చారు. అందులో భాగంగానే చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ శనివారం రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా అసమ్మతినేతలు చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి నాయకులను కూడగడుతున్నారు.
పోటాపోటీగా బలప్రదర్శన ర్యాలీలు.. అసమ్మతి నాయకులు నాలుగురోజులుగా చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ర్యాలీలు చేపట్టారు. ర్యాలీలు, సమావేశాలు చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదని, సస్పెండ్ చేస్తుందని హెచ్చరిస్తూ వచ్చిన పీఏశేఖర్ వర్గీయులు కూడా తమకు బలం ఉందని నిరూపించుకోవడానికి శుక్రవారం లేపాక్షి మండలకేంద్రంలో ర్యాలీ చేపట్టారు. అయితే.. వందమంది కూడా లేక అభాసుపాలయ్యారు. కొన్ని గ్రామాలకు వాహనాలు పంపినా కార్యకర్తలు రాలేదని సమాచారం. లేపాక్షి నంది విగ్రహం నుంచి మొదలైన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పీఏ శేఖర్, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరుకు చెందిన కొందరు నాయకులు మాత్రమే పాల్గొన్నారు.
చిలమత్తూరులో హైటెన్షన్.. చిలమత్తూరులో ఆదివారం భారీ ర్యాలీతో పాటు సమావేశం నిర్వహించి తీరుతామని అసమ్మతి నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, సీసీవెంకటరాముడు తదితరులు చెబుతున్నారు. అవసరమైతే కర్ణాటక సరిహద్దులో చేస్తామంటున్నారు. పోలీసులతో అడ్డుకుంటే నిరాహారదీక్షలు చేస్తామని, అరెస్టులు చేస్తే జైలులో కూడా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే.. సమావేశం ఎలా జరుగుతుందో చూస్తామని ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులు సవాల్ చేస్తున్నారు. కాగా.. చిలమత్తూరులో భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. 144సెక్షన్‌తో పాటు 30యాక్ట్ అమలు చేశారు. సభలు, సమావేశాలు చేయరాదని నిషేధాజ్ఞలు జారీ చేశారు.
అసమ్మతి నేతలతో బీకే, కాలవ చర్చలు
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్‌కు వ్యతిరేకంగా అసమ్మతి లేవనెత్తిన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు చర్చలు జరిపారు. పరిగి జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ కుమారుడి వివాహం శనివారం రాత్రి సోమందేపల్లిలో జరిగింది. ఈ వేడుకకు హాజరైన బీకే, కాలవ స్థానిక వెంకటేశ్వర కల్యాణ మంటపంలో అసమ్మతి నేతలతో అరగంట పాటు చర్చించారు. అయితే.. పీఏ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది.