
బాలయ్యకు షాకిచ్చిన తమ్ముళ్లు
అనంతపురం: ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో అసమ్మతి పోరు తీవ్రమైంది. బాలకృష్ణ పీఏ శేఖర్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపిస్తూ నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు, లేపాక్షి జెడ్పీటీసీలు రాజీనామా చేశారు. అలాగే ఆదివారం హిందూపురంలో టీడీపీ అసంతృప్త నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
బాలకృష్ణకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా ఉన్న చంద్రశేఖర్ (శేఖర్) నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సైతం లంచాలు తీసుకుని అవినీతిలో కూరుకుపోయాడని ఆరోపిస్తూ, లంచగొండి పీఏను తరిమికొట్టాలని స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు.. శేఖర్ మితిమీరిన జోక్యానికి చెక్‌పెట్టేలా చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ ప్రాంతాల్లో అసమ్మతి సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారోనని స్థానిక నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంబంధిత వార్తలు చదవండి
బాలయ్య పీఏ vs టీడీపీ నేతలు
బాలకృష్ణ పీఏను తరిమేద్దాం