మాట్లాడుతున్న రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు
హిందూపురం టౌన్(అనంతపురం జిల్లా): హిందూపురం జిల్లా కేంద్రం అంశాన్ని మూడు గంటల సినిమా అనుకున్నావా అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్యామ్, శ్రీరాములు, శ్రీనివాసులు, మున్నా, రవి మాట్లాడుతూ 1983 నుంచి ఏకధాటిగా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఇలా నందమూరి వంశాన్నే హిందూపురం ప్రజలు గెలుపిస్తున్నా హిందూపురం ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.
చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
హిందూపురం జిల్లా కోసం అవసరమైతే రాజీనామా చేస్తానన్న బాలకృష్ణ ఇంకెప్పుడు చేస్తారని, ఇంకెప్పుడు పోరాడతారని విమర్శించారు. బాలకృష్ణకు సినిమా షూటింగులు తప్ప ఏ మాత్రం హిందూపురం అభివృద్ధి పట్టలేదన్నారు. చుట్టపు చూపుగా తెలంగాణ నుంచి వచ్చి పోయే బాలకృష్ణకు హిందూపురం ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబులు ఎందుకు హిందూపురాన్ని జిల్లా చేయలేకపోయారో చెప్పాలన్నారు.
టీడీపీ పార్టీతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి ద్రోహం చేసి ప్రజలను మోసగించారని విమర్శించారు. హిందూపురంలోని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలను పుట్టపర్తికి తరలిస్తున్నారని, ఈ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు నాగార్జున, మల్లికార్జున, నారాయణ, నాజీమ్ బాషా, హరికుమార్, కలీం, నూర్ మహమ్మద్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment