
బాలయ్య ఇలాకాలో ముసలం
► ఆపరేషన్ పీఏ
► వివాదాస్పదమవుతున్న ఎమ్మెల్యే పీఏ తీరు
► సొంత పార్టీలోనే అసంతృప్తి
► హిందూపురం నుంచి సాగనంపేందుకు సీసీ, అంబికా యత్నాలు
► మండలాల్లో రహస్య సమావేశాలు
హిందూపురం అర్బన్ : సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ‘తమ్ముళ్ల’ మధ్య తగువులాట మొదలైంది. మరీముఖ్యంగా నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహరిస్తున్న బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శేఖర్ తీరు వివాదాస్పదంగా మారింది.
బాలకృష్ణ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చిపోతుండడంతో ఇక్కడ పీఏ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పనులు మొదలుకుని పార్టీ వ్యవహారాల దాకా అన్నింట్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఈయన మితిమీరిన జోక్యాన్ని సొంత పార్టీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు. శేఖర్‌ను హిందూపురం నుంచి ఎలాగైనా సాగనంపాలన్న ఉద్దేశంతో నియోజకవర్గంలోని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల అసంతృప్తులందరూ ఏకమవుతున్నారు. ఈ నెల 25న చిలమత్తూరు మండలం కోడూరులో జరిగిన జాతర సందర్భంగా వీరంతా కలసి మాజీ సర్పంచ్ సోమశేఖర్ ఇంట్లో సమావేశమై ‘ఆపరేషన్ పీఏ’ కార్యక్రమానికి బీజం వేశారు.
దీనికి మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ నాయకత్వం వహిస్తున్నారు. తర్వాత పట్టణంలో కొందరు సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. అలాగే 29వ తేదీన రాత్రి హిందూపురం మండలం అప్పలకుంటలోని డీసీ ఆంజనేయులు తోటలో రెండో రహస్య సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి హిందూపురంలోని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు నివాసంలో నాయకులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.అలాగే సోమవారం లేపాక్షి మండల కేంద్రంలోని సత్తార్‌తోటలో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సమావేశాల్లో ప్రధానంగా పీఏ శేఖర్ వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కొక్కరు ఏకరువు పెడుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం పీఏ ముందు నిలబడాల్సి వస్తోందని, ఏపనికైనా పైకం ఇవ్వాల్సివస్తోందని వారు అంటున్నారు.
‘గంట’కట్టేదెవరు?
పీఏ శేఖర్‌ను హిందూపురం నుంచి సాగనంపడం కోసం సీనియర్ నాయకులందరూ కంకణం కట్టుకున్నా.. ఆయనపై బాలకృష్ణకు ఫిర్యాదు చేసేదెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పీఏ ఏది చెబితే అది చేయడం బాలకృష్ణకు అలవాటు. ఇలాంటి పరిస్థితుల్లో పీఏపై ఫిర్యాదు చేయడమంటే సులవైన పనికాదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే.. ఈ బాధ్యతను ఓ సీనియర్ నాయకుడిపై పెడుతున్నట్లు తెలుస్తోంది. వారు అనుకున్నట్లు ‘ఆపరేషన్ పీఏ’ కార్యక్రమం విఫలమైతే మరో రాజకీయ ఎత్తుగడకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.