
రూ.9.26 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ : ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈసారి 9లక్షల 26వేల రూపాయలు పలికింది. మాజీ మేయర్, టీకేఆర్ విద్యాసంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి కైవసం చేసుకున్నారు. లడ్డూ సొంతం చేసుకునేందుకు రేసు నరసింహారెడ్డి, టీకేఆర్ విద్యాసంస్థల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. చివరకు రూ.9.26 లక్షలకు లడ్డూను టీకేఆర్ విద్యాసంస్థలు సొంతం చేసుకున్నాయి. గత ఏడాది రూ.7.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది మరో 1.76 లక్షలకు దాటడం విశేషం. 1994 సంవత్సరంలో రూ.450 లకు ప్రారంభమైన లడ్డూ వేలం ఏ ఏటికా ఏడాది పెరుగుతూనే ఉంది.
బాలాపూర్ లడ్డూకి... రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్ని లక్షలు వెచ్చించి అయినా లడ్డూను దక్కించుకోవాలని భక్తులు పోటీపడుతున్నారు. 1984లో బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కాగా 1994 సంవత్సరంలో రూ.450, 2000 సంవత్సరంలో రూ.66వేలు 2010లో రూ.5.35లక్షలు, గతేడాది 7.50 లక్షలు పలికింది.