
బాలరాజుపై మండిపాటు
- పాడేరులో వైఎస్సార్‌సీపీ నేతల నిరసన
- మంత్రి ఇంటి ఎదుట దిష్టిబొమ్మ దహనం
- వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నాయకులు
- తోపులాటతో ఉద్రిక్తత
పాడేరు, న్యూస్‌లైన్ : శాసనసభలో తెలంగాణకు అనుకూలంగా మంత్రి బాలరాజు వ్యాఖ్యానించి సమైక్యాంధ్ర ద్రోహిగా మారారని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. బాలరాజు వైఖరిని నిరసిస్తూ గురువారం పాడేరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నాయకులంతా పట్టణ వీధుల్లో బాలరాజు దిష్టిబొమ్మను ఊరేగించారు.
రాష్ట్ర విభజన యత్నాన్ని నిరసించాల్సిన మంత్రి తెలంగాణవాదిగా మారడం దారుణమని నినాదాలు చేశారు. సీమాంధ్ర ద్రోహిగా ఆయన మారారని, సమైక్య రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తే మంత్రి వారి అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడారని దుయ్యబట్టారు. అనంతరం మంత్రి ఇంటి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి ఆయన వైఖరిని ఎండగట్టారు. మంత్రి దిష్టిబొమ్మను వైఎస్సార్‌సీపీ నేతలు దహనం చేశారు.
రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు
మంత్రి వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సమయంలో మంత్రి బాలరాజు ఇంటిలోపల ఉన్న కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు వి.గంగులయ్య, ఎం.కన్నాపాత్రుడు తదితరులు బయటకు వచ్చి వైఎస్సార్‌సీపీ అధినేతను దుర్భాషలాడారు. దీనిని వైఎస్సార్‌సీపీ నేతలు గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీపీలు ఎస్.వి.వి.రమణమూర్తి, వి.మత్స్యకొం డంనాయుడు, కూడా సింహాచలం, మత్స్యరాస వెంకటగంగరాజు అడ్డుకున్నారు.
దాంతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేతలు పోలీసులతో కలసి వైఎస్సార్‌సీపీ నేతలను తోసివేశారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మంత్రి ఇంటిముందే బైఠాయించి నినాదాలు చేశారు. పాడేరు ఎస్‌ఐ ధనుంజయ్, సిబ్బంది మంత్రి ఇంటి వద్దకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనను కొనసాగించారు.