సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు ఓట్ల కోసం పెన్నా –గోదావరి అనుసంధానమంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నానికి దిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన “సాక్షి’ తో మాట్లాడారు. ఎన్నికలు వచ్చాక బాబుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం గుర్తుకు వచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి సాగర్ కాలువకు నీరు తరలిస్తానని చంద్రబాబు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. గడచిన నాలుగేళ్లలో బాబు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేశారా..అని బాలినేని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని రైతాంగాన్ని వంచించేందుకే పెన్నా–గోదావరి అనుసంధానం తెరపైకి తెచ్చారన్నారు. కొత్త ప్రాజెక్టు నీళ్ల సంగతి దేవుడెరుగు సాగర్‌లో ఉన్న నీటిని ప్రభుత్వం ఆయకట్టుకు ఇవ్వడం లేదన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. గత ఏడాది, ఈ ఏడాది సాగర్‌లో నీళ్లున్నా ప్రభుత్వం ఆయకట్టుకు నీళ్లిచ్చిన పాపాన పోలేదన్నారు.
ఈ ఏడాది సగం ఆయకట్టుకు కూడా నీళ్లివ్వని విషయం రైతులతోపాటు అధికార పార్టీ నేతలకు కూడా తెలుసన్నారు. బాబు పాలనలో జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను పట్టించుకోలేదని బాలినేని విమర్శించారు. వెలిగొండ పూర్తిచేసి ఉంటే జిల్లాలో కరువు పరిస్థితులు ఉండేవి కావన్నారు. గుడ్లకమ్మ ప్రాజెక్టు కింద మిగిలి ఉన్న ఐదు శాతం పనులను కూడా ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. వైఎస్ హయాంలో జరిగిన పనులు తప్ప బాబు పాలనలో పనులు ముందుకు సాగలేదన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచుకొన్నారు తప్ప పనులు చేయలేదని బాలినేని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల గోడు పట్టలేదన్నారు. ఈ విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుండా తీరా ఎన్నికల సమయంలో పెన్నా–గోదావరి అనుసంధానం చేసి 2019 నాటికే సాగర్ ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పడం మరోమారు రైతాంగాన్ని వంచించడమేనని బాలినేని ధ్వజమెత్తారు. దశాబ్దాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులను పట్టించుకోని బాబు అసలే మొదలు పెట్టని ప్రాజెక్టు ద్వారా నీళ్లిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 53 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించబోతున్నట్లు చెబుతున్న చింతలపూడి ఎత్తిపోతల ద్వారా చింతలపూడి కింద 4.90 లక్షల ఎకరాలు, సాగర్ కుడికాలువ పరిధిలో 9.6 లక్షల ఎకరాలకు నీటిని ఎలా అందిస్తారని బాలినేని ప్రశ్నించారు. మొత్తం ఆయకట్టుకు నీళ్లివ్వాలంటే కనీసం 130 టీఎంసీల నీరు అవసరమౌతుందన్నారు. ఓట్ల కోసం మరోమారు చంద్రబాబు జనాన్ని వంచించే ప్రయత్నానికి దిగారని బాలినేని విమర్శించారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా జనం నమ్మరన్నారు. జనం మద్దతు వైఎస్సార్ సీపీ కేనన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రాజెక్టులను ఏడాది లోపే పూర్తిచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment