ఒంగోలు 44వ డివిజన్‌లో పార్టీ నాయకులతో కలిసి పర్యటిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి, రంగులు మార్చే ఊసరవెల్లి సైతం సిగ్గు పడుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సమర్థించుకుంటున్న చంద్రబాబు తెలంగాణలో అమ్ముడుపోయినటీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం చిత్తుచిత్తుగా ఓడించాలంటూ పిలుపు ఇవ్వడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఒంగోలు నగరం కర్నూల్‌రోడ్డులోని 44వ డివిజన్‌లో శుక్రవారం వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన బాలినేని అనంతరం డివిజన్ పరిధిలోని మారుతీనగర్‌లో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే ప్రజాసంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీచేశారు.
ఈ సందర్భంగా బాలినేని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. నిన్న మొన్నటి వరకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు నేడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీని చివరకు చంద్రబాబు కాంగ్రెస్‌లో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. ఇటువంటి చంద్రబాబు మనకు ముఖ్యమంత్రి కావడం మనం చేసుకున్న దురదృష్టమన్నారు. మరో మారు ఇటువంటి దురదృష్టకర ఘటనకు తావులేకుండా నిత్యం జనం మధ్యన ఉంటూ జనం సమస్యలే ఊపిరిగా జీవిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకునేందుకు ప్రతి అక్కా.. చెల్లెమ్మలు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర «అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, 44వ డివిజన్ అధ్యక్షుడు గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment