
సాక్షి, అమరావతి: మద్యం వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు దిగనున్నారు. మద్యం షాపులు మూసేయడంతోపాటు సరుకును కూడా ఏపీబీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) గోడౌన్ల నుంచి తీసుకెళ్లకుండా నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయల సుబ్బారావు అధ్యక్షతన శనివారం విజయవాడలో ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం సిండికేట్లు హాజరయ్యారు. ఈ నెల 25 నుంచి మద్యం షాపుల బంద్ పాటించేందుకు నిర్ణయించారు. మద్యం వ్యాపారులకు ఇస్తున్న 10 శాతం కమీషన్‌ను 18 శాతానికి పెంచాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రతి మద్యం షాపు నుంచి రూ.5 వేల వంతున వసూలు చేశారు. చివరకు సీఎం కార్యాలయం అధికారులు కూడా జోక్యం చేసుకుని కమీషన్‌ను పెంచాలని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావుకు మెమో జారీ చేశారు.
అయితే గతంలో కమీషన్ 10 శాతానికి మించి ఉండకూడదని జీవో ఉండటంతో 18 శాతానికి పెంచడం సాధ్యం కాదని తేల్చారు. పెంపు ప్రతిపాదనలు నిలిచిపోవడంతో వైన్ డీలర్స్ అసోసియేషన్ గత నెలలో అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు నాలుగు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేసి నిరసన తెలిపింది. మళ్లీ ఈ నెల 25 నుంచి నిరవధిక బంద్ పాటించనున్నారు.
ప్రభుత్వం దిగొస్తుంది.. సహకరించండి: విజయవాడలో సమావేశమైన మద్యం సిండికేట్లు అన్ని జిల్లాల్లో వ్యాపారుల్ని బుజ్జగించే పనిలో ఉన్నారు. వారం రోజులు బంద్ పాటించి నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందని, 18% కమీషన్ పెంచేందుకు అంగీకరిస్తుందని సిండికేట్లు పేర్కొనడం గమనార్హం.
వ్యాపార దృక్పథంతో చూడకుండా అందరూ షాపుల్ని మూసేయాలని సూచించారు. వారంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని అసోసియేషన్ పెద్దలు చెబుతున్నారు. కాగా, మద్యం వ్యాపారులు బంద్ పాటిస్తే ఏర్పడే డిమాండ్‌ను బట్టి ప్రభుత్వమే ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపట్టాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment