బందరురోడ్డు.. ఇక వైఫై జోన్
విజయవాడ : రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న బెజవాడను వైఫై ఫ్రీ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజావసరాల కోసం ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వైఫైకు సంబంధించిన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చేనెల మొదటి వారం నుంచి ఉచిత వైఫై అందుబాటులోకి తీసుకురావటానికి రిలయన్స్ జియో కసరత్తు చేస్తోంది.
బెంజిసర్కిల్ టూ పోలీస్ కంట్రోల్ రూమ్
బందరు రోడ్డులో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈరోడ్డులో వైఫై ఎలైన్‌మెంట్లు ఏర్పాటుచేసి అందరికీ ఉచితంగా సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. బెంజిసర్కిల్ మొదలుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు ఇది అందుబాటులో ఉంటుంది.
40 పోల్ ఎలైన్‌మెంట్లు
వైఫై సిగ్నల్ కోసం రిలయన్స్ జియో సంస్థ నగరపాలక సంస్థకు రూ.11లక్షలు నగదు చెల్లించి 20 రోజుల క్రితం పనులు మొదలుపెట్టింది. ట్రాఫిక్ రద్దీ పగటిపూట అధికంగా ఉండటంతో రాత్రివేళల్లో పనులు నిర్వహిస్తున్నారు. డివైడర్ల మధ్యలో ఉన్న పోల్స్‌కు ఎలైన్‌మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 100 మీటర్లుకు ఒక ఎలైన్‌మెంట్ చొప్పున 40 ఎర్పాటు చేయనున్నారు. అలాగే, వైఫైకు సంబంధించి కేబుల్‌ను రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌లో అమరుస్తున్నారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ బృందం వైఫై పనులను రిలయన్స్ జియో ప్రతినిధులతో కలిసి పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ మొవటి వారానికి పూర్తిస్థాయిలో సిగ్నల్ ఇచ్చి వైఫై సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.