bandar road
-
తప్పుడు పేర్లు చెప్పిన వారిపై మరో కేసు!
సాక్షి, అమరావతి బ్యూరో: అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు పేర్లు, చిరునామాలు ఇచ్చిన వారిని గుర్తించే పనిలో విజయవాడ పోలీసులు పడ్డారు. వారిపై సెక్షన్ 42 సీఆర్పీసీ ప్రకారం మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గత శుక్రవారం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ మహిళా కార్యకర్తలు విజయవాడ బందరు రోడ్డులో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. నగరంలో 144 సీఆర్పీసీ, సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని చెప్పినా వినకుండా గుంపులుగుంపులుగా కలసి వచ్చారు. చట్టాలను ఉల్లంఘించారు. ట్రాఫిక్‌కు అవాంతరం కలిగించారు. పోలీసులపై దౌర్జన్యం చేశారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారు. చివరకు వారి వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో రోడ్డుపై బైఠాయించిన మహిళల్ని అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఐపీసీ 143, 188, 341, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అందరి వివరాలు అడగ్గానే ఆక్రోశంతో ఊగిపోయారు. కొందరు మహిళలు తమ పేర్లు, చిరునామాలు చెప్పేందుకు నిరాకరించారు. మరికొందరు నాపేరు జయసుధ, జయప్రద అంటూ.. చివరకు సీఎం వైఎస్ జగన్ తల్లి, సోదరి, సతీమణి పేర్లు సైతం చెప్పారు. అలాగే తప్పుడు చిరునామాలు ఇచ్చారు. ఇలా చేసిన వారిని గుర్తించి మరో కేసు నమోదు చేయాలని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు పోలీసులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ర్యాలీకి అనుమతి లేదన్నా వినకుండా గత శుక్రవారం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం నేరం. అందుకే 479 మందిపై కేసు నమోదు చేసి వారినందరినీ పోలీసుస్టేషన్లకు తరలించాం. సెక్షన్ 42 సీఆర్పీసీ ప్రకారం పోలీసు అధికారులు అడిగినప్పుడు ఎవరైనా తమ పేర్లు, చిరునామాలు పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనకు ఎవరూ అతీతులు కారు. కాదని మొండికేస్తే కోర్టులో ప్రవేశపెడతాం. – ద్వారకా తిరుమలరావు, సీపీ, విజయవాడ -
లాడ్జిలో పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, విజయవాడ: విజయవాడ బందర్ రోడ్డులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. సిద్దార్థ మహిళా కళాశాల సమీపంలోని ఓ లాడ్జిలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ లాడ్జిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. -
విజయవాడలో ఉద్రిక్తత..
♦ బందరు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం ♦ హఠాత్తుగా పోరంకిలో భవనాల తొలగింపు ♦ ప్రతిఘటించిన బాధితులు ♦ భారీగా పోలీసుల మోహరింపు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామ పరిధిలో జాతీయ రహదారి బందరు రోడ్డు విస్తరణ పనులు శనివారం హఠాత్తుగా చేపట్టారు. ఉదయాన్నే రెవెన్యూ, పోలీసులు ఎన్హెచ్ఐ, ఇతర శాఖల అధికారులు పెద్ద ఎత్తున వచ్చి పది పొక్లెయిన్లతో బందరు రోడ్డు పక్కన ఉన్న బహుళ అంతస్తు భవనాలు, హోటళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశారు. అయితే ఈ చర్యలను భూ, భవన యజమానులు తీవ్రంగా ప్రతిఘటించటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ: పెనమలూరు మండలంలో బందరు రోడ్డు కానూరు, పోరంకి, గంగూరు, గోసాల గ్రామాల్లో విస్తరించి ఉంది. అయితే పోరంకి గ్రామం మినహా ఇతర గ్రామాల్లో బందరు రోడ్డు విస్తరణకు లైన్ క్లీయర్ అయింది. పోరంకి గ్రామంలో మాత్రం నష్టపహారం విషయంలో భూ, భవన యజమానులకు అధికారులకు ఏకాభిప్రాయం కుదరక పోవటంతో వివాదంలో ఉంది. ఈ వివాదం కొససాగుతున్న సమయంలో అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగి కట్టడాలను నేలమట్టం చేశారు. నాలుగు రోజుల సెలవు చూసుకుని.. భూ, భవన యజమానులకు, అధికారులకు పరిహారం విషయంలో రాజీ కుదరక పోవటంతో విస్తరణకు ఆటంకంగా ఉంది. దీంతో శని, ఆది, సోమ, మంగళవారాలు సెలవు దినాలు కావటంతో అధికారులు ఈ అవకాశం చూసుకుని బందరు రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగించారు. బాధితులు ఎవ్వరు కోర్టు స్టేకు వెళ్లకుండా అధికారులు పక్కా ప్రణాళికతో భవనాలు తొలగింపు చేపట్టి చాలా కాలంగా వివాదంగా ఉన్న సమస్యకు తెరదించారు. పోరంకిలో తొలగించనున్న 90 నిర్మాణలు.. పోరంకి గ్రామంలో బందరు రోడ్డు విస్తరణకు 90 నిర్మాణాలు తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు 150 మంది బాధితులు ముందుకు వచ్చి తమ సహకారం తెలిపారు. మరో 102 మంది రోడ్డు పరిహారం తీసుకోవటానికి ముందుకు రాక పోవడంతో అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విజయవాడలో హ్యాపీ సండే!
-
రాంగ్ రూట్... ఉసురు తీసింది
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం విజయవాడ (సూర్యారావుపేట) : మహాత్మాగాంధీ రోడ్డులో సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. సూర్యారావుపేట పోలీసుల కథనం మేరకు... కృష్ణలంక గీతానగర్, కోటినగర్ ప్రాంతానికి చెందిన గూడపాటి ఉదయ్‌కుమార్ కుమారుడు నోయల్‌కుమార్ (17) పాలిటెక్నిక్, పూర్ణచంద్రనగర్ పోలీస్ క్వార్టర్స్‌లో నివసించే గొర్లె శ్రీనివాసరావు కుమారుడు గొర్లె జగదీష్‌చంద్ర (13) 9వ తరగతి చదువుతున్నారు. వారిద్దరు ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై మహాత్మాగాంధీ రోడ్డులో రాఘవయ్యపార్కు వైపు నుంచి వస్తూ రైతుబజార్ వద్ద యూటర్న్ తీసుకొని పెట్రోల్‌బంకు వైపు బయలుదేరారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్న కృష్ణలంక రాజయ్యవీధికి చెందిన అద్దేపల్లి నోయిన్కుమార్(27) తన ద్విచక్రవాహనానికి బాపు మ్యూజియం ఎదురున ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించి, పెట్రోల్ బంకుకు ఎదురుగా వాహనాన్ని నడిపించుకొని డివైడర్ పక్కకు వచ్చి వన్‌వే రాంగ్రూట్లో వెళ్తుండగా గూడపాటి నోయల్ కుమార్ అద్దేపల్లి నోయిన్కుమార్ ఢీకొట్టారు. దీంతో రెండు వాహనాలపై ఉన్న ముగ్గురు కింద పడిపోగా, ఆ సమయంలో అటుగా వస్తున్న గవర్నర్‌పేట–2 డిపోకు చెందిన సిటీ బస్సు వారిపై నుంచి వెళ్లింది. క్షణకాలంలో బైకులు పడిపోవడాన్ని బస్సు డ్రైవర్ చూసి బ్రేకులు వేసేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. బస్సు చక్రాల కింద నలిగిన ఇద్దరు విద్యార్థులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలాలరు. అద్దేపల్లి నోయిన్కుమార్ తీవ్రగాయాలు కావడంలో ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నోయిన్కుమార్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసిన సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి బస్సును పీఎస్‌కు తరలించారు. -
బందరురోడ్డు.. ఇక వైఫై జోన్
విజయవాడ : రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న బెజవాడను వైఫై ఫ్రీ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజావసరాల కోసం ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వైఫైకు సంబంధించిన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చేనెల మొదటి వారం నుంచి ఉచిత వైఫై అందుబాటులోకి తీసుకురావటానికి రిలయన్స్ జియో కసరత్తు చేస్తోంది. బెంజిసర్కిల్ టూ పోలీస్ కంట్రోల్ రూమ్ బందరు రోడ్డులో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈరోడ్డులో వైఫై ఎలైన్మెంట్లు ఏర్పాటుచేసి అందరికీ ఉచితంగా సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. బెంజిసర్కిల్ మొదలుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు ఇది అందుబాటులో ఉంటుంది. 40 పోల్ ఎలైన్మెంట్లు వైఫై సిగ్నల్ కోసం రిలయన్స్ జియో సంస్థ నగరపాలక సంస్థకు రూ.11లక్షలు నగదు చెల్లించి 20 రోజుల క్రితం పనులు మొదలుపెట్టింది. ట్రాఫిక్ రద్దీ పగటిపూట అధికంగా ఉండటంతో రాత్రివేళల్లో పనులు నిర్వహిస్తున్నారు. డివైడర్ల మధ్యలో ఉన్న పోల్స్‌కు ఎలైన్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 100 మీటర్లుకు ఒక ఎలైన్మెంట్ చొప్పున 40 ఎర్పాటు చేయనున్నారు. అలాగే, వైఫైకు సంబంధించి కేబుల్‌ను రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌లో అమరుస్తున్నారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ బృందం వైఫై పనులను రిలయన్స్ జియో ప్రతినిధులతో కలిసి పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ మొవటి వారానికి పూర్తిస్థాయిలో సిగ్నల్ ఇచ్చి వైఫై సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. -
బందరు రోడ్డులో విజయమ్మ సమరభేరీ దీక్ష
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 19వ తేదీన విజయవాడలో చేపట్టనున్న ఆమరణ దీక్షకు వేదిక ఖరారు అయింది. బందరు రోడ్డులోని పీవీపీ కాంప్లెక్స్ ఎదురుగా వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపడతారని ఆ పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్‌ఖాన్, గౌతమ్‌రెడ్డిలు శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ విజయమ్మ సమరభేరీ దీక్ష చేపట్టనున్నారని వారు తెలిపారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి, సీమాంధ్ర ప్రజలకు చులకనగా చూస్తోందని వారు ఆరోపించారు. సీమాంధ్రుడిగా చంద్రబాబుకు పౌరుషం ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో చంద్రబాబు పాల్గొనాలని వారు సూచించారు. తెలుగుదేశం నుంచి వలసలు నిరోధించి, పార్టీని కాపాడేందుకే బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలు ఉదయభాను, జలీల్‌ఖాన్, గౌతమ్‌రెడ్డిలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.