రాంగ్ రూట్... ఉసురు తీసింది
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
విజయవాడ (సూర్యారావుపేట) : మహాత్మాగాంధీ రోడ్డులో సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. సూర్యారావుపేట పోలీసుల కథనం మేరకు... కృష్ణలంక గీతానగర్, కోటినగర్ ప్రాంతానికి చెందిన గూడపాటి ఉదయ్‌కుమార్ కుమారుడు నోయల్‌కుమార్ (17) పాలిటెక్నిక్, పూర్ణచంద్రనగర్ పోలీస్ క్వార్టర్స్‌లో నివసించే గొర్లె శ్రీనివాసరావు కుమారుడు గొర్లె జగదీష్‌చంద్ర (13) 9వ తరగతి చదువుతున్నారు.
వారిద్దరు ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై మహాత్మాగాంధీ రోడ్డులో రాఘవయ్యపార్కు వైపు నుంచి వస్తూ రైతుబజార్ వద్ద యూటర్న్ తీసుకొని పెట్రోల్‌బంకు వైపు బయలుదేరారు. పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్న కృష్ణలంక రాజయ్యవీధికి చెందిన అద్దేపల్లి నోయిన్‌కుమార్(27) తన ద్విచక్రవాహనానికి బాపు మ్యూజియం ఎదురున ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించి, పెట్రోల్ బంకుకు ఎదురుగా వాహనాన్ని నడిపించుకొని డివైడర్ పక్కకు వచ్చి వన్‌వే రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా గూడపాటి నోయల్ కుమార్ అద్దేపల్లి నోయిన్‌కుమార్ ఢీకొట్టారు.
దీంతో రెండు వాహనాలపై ఉన్న ముగ్గురు కింద పడిపోగా, ఆ సమయంలో అటుగా వస్తున్న గవర్నర్‌పేట–2 డిపోకు చెందిన సిటీ బస్సు వారిపై నుంచి వెళ్లింది. క్షణకాలంలో బైకులు పడిపోవడాన్ని బస్సు డ్రైవర్ చూసి బ్రేకులు వేసేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. బస్సు చక్రాల కింద నలిగిన ఇద్దరు విద్యార్థులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలాలరు. అద్దేపల్లి నోయిన్‌కుమార్ తీవ్రగాయాలు కావడంలో ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నోయిన్‌కుమార్ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి బస్సును పీఎస్‌కు తరలించారు.