విజయవాడలో ఉద్రిక్తత..
♦ బందరు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం
♦ హఠాత్తుగా పోరంకిలో భవనాల తొలగింపు
♦ ప్రతిఘటించిన బాధితులు
♦ భారీగా పోలీసుల మోహరింపు
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామ పరిధిలో జాతీయ రహదారి బందరు రోడ్డు విస్తరణ పనులు శనివారం హఠాత్తుగా చేపట్టారు. ఉదయాన్నే రెవెన్యూ, పోలీసులు ఎన్‌హెచ్‌ఐ, ఇతర శాఖల అధికారులు పెద్ద ఎత్తున వచ్చి పది పొక్లెయిన్‌లతో బందరు రోడ్డు పక్కన ఉన్న బహుళ అంతస్తు భవనాలు, హోటళ్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశారు. అయితే ఈ చర్యలను భూ, భవన యజమానులు తీవ్రంగా ప్రతిఘటించటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విజయవాడ:
పెనమలూరు మండలంలో బందరు రోడ్డు కానూరు, పోరంకి, గంగూరు, గోసాల గ్రామాల్లో విస్తరించి ఉంది. అయితే పోరంకి గ్రామం మినహా ఇతర గ్రామాల్లో బందరు రోడ్డు విస్తరణకు లైన్ క్లీయర్ అయింది. పోరంకి గ్రామంలో మాత్రం నష్టపహారం విషయంలో భూ, భవన యజమానులకు అధికారులకు ఏకాభిప్రాయం కుదరక పోవటంతో వివాదంలో ఉంది. ఈ వివాదం కొససాగుతున్న సమయంలో అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగి కట్టడాలను నేలమట్టం చేశారు.
నాలుగు రోజుల సెలవు చూసుకుని..
భూ, భవన యజమానులకు, అధికారులకు పరిహారం విషయంలో రాజీ కుదరక పోవటంతో విస్తరణకు ఆటంకంగా ఉంది. దీంతో శని, ఆది, సోమ, మంగళవారాలు సెలవు దినాలు కావటంతో అధికారులు ఈ అవకాశం చూసుకుని బందరు రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగించారు. బాధితులు ఎవ్వరు కోర్టు స్టేకు వెళ్లకుండా అధికారులు పక్కా ప్రణాళికతో భవనాలు తొలగింపు చేపట్టి చాలా కాలంగా వివాదంగా ఉన్న సమస్యకు తెరదించారు.
పోరంకిలో తొలగించనున్న 90 నిర్మాణలు..
పోరంకి గ్రామంలో బందరు రోడ్డు విస్తరణకు 90 నిర్మాణాలు తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు 150 మంది బాధితులు ముందుకు వచ్చి తమ సహకారం తెలిపారు. మరో 102 మంది రోడ్డు పరిహారం తీసుకోవటానికి ముందుకు రాక పోవడంతో అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.