బంద్ విజయవంతం
- పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళన
- వంతాడపల్లి వద్ద వాహనాల అడ్డగింపు
- చలో ఢిల్లీ ప్రచార పోస్టర్ విడుదల
సాక్షి, విశాఖపట్నం: టి బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు జిల్లాలో బంద్ విజయవంతమైంది. పట్టణాలు,గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉదయం నుంచి రాత్రివరకు దుకాణాలు మూత పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను మూయించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నియోజకవర్గాల్లో పార్టీనేతలతోపాటు ప్రజలు భారీ ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. నక్కపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు ,కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
జాతీయరహదారిపై ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. పాయకరావుపేటలో దుకాణాలు,థియేటర్లు, బ్యాంకులు, విద్యా సంస్థలు మూసివేశారు. మాడుగులలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు ,యువకులు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. మాడుగుల సమన్వయకర్తలు బూడిముత్యాలనాయుడు, పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధించారు. పాడేరులో బంద్ విజయవంతమైంది. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే రోడ్డులో వంతాడపల్లి వద్ద బైఠాయించి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాడేరులో వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం నేతలు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పేరిట ముద్రించిన ఛలో ఢిల్లీ ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. అరకులోయలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. చోడవరంలో వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. యలమంచిలి పట్టణంలో పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి.