ఆంధ్రప్రదేశ్ పునర్య్వస్థీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏపీ ఎన్జీవోలు, టీడీపీ నేతలు కూడా నిరసన కార్యక్రమాలనుచేపట్టారు. బంద్ ప్రభావంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాక్షి, కడప: కడపలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయం నుంచి రోడ్డపై ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలు మూయించారు. కోటిరెడ్డిసర్కిల్‌లో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకుని ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాసీమబాబు, అధికారప్రతినిధి అఫ్జల్‌ఖాన్, హఫీజుల్లా. గ్రంథాలయసంస్థ మాజీ అధ్యక్షుడు అందూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్జీవోలు బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు.
అంబేద్కర్ సర్కిల్‌లో టీడీపీ నేత గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో టైర్లుకాల్చి నిరసన తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యజమానులు, విద్యార్థులు విభజనబిల్లును దహనం చేశారు. గాంధీ విగ్ర హం కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్‌చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూయించారు. కార్యక్రమంలో పోలా శ్రీనివాసరెడ్డి, శరత్‌కుమార్‌రాజు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీవో నేత రమణ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అరెస్టుకు నిరసనగా ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త రాచమల్లు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఉదయం నుంచి పార్టీకార్యకర్తలు పట్టణంలో ర్యాలీచేపట్టి దుకాణాలను మూయించి, వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ర్యాలీలో రాచమల్లుతో పాటు మునిసిపల్ కమిషనర్‌వెంకటకృష్ణ, ఏపీ ఎన్జీవోల సంఘం పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డి సతీమణి లక్ష్మీప్రసన్న, ఈవీ సుధాకరరెడ్డి, గాండ్లనారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. రైల్వేకోడూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, మైనార్టీనాయకుడు అన్వర్‌బాషా ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.
టోల్‌గేట్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బైక్‌లలో తిరిగి దుకాణాలను మూయించారు. జేఏసీ నేతలు ఓబులేసు, బాలకృష్ణంరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. జమ్మలమడుగులో వైఎస్సార్‌పార్టీ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
రూరల్ పరిధిలో మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. మహిళా విభాగం నాయకురాలు అల్లెప్రభావతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కమలాపురంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు రాజుపాళెం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, రైతువిభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.
జేఏసీ నేతలు రాజగోపాల్‌రెడ్డి, సీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో వైఎస్సార్‌కాంగ్రెస్ మునిసిపల్ పరిశీలకుడు వరప్రసాద్, చవ్వాసుదర్శనరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో వైఎస్సార్‌పార్టీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. రాయచోటిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజనవిభాగం స్టీరింగ్ కమిటీ సభ్యుడు మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూయించారు. బద్వేలులో ఎన్జీవోలు, రెవెన్యూఉద్యోగులు, టీడీపీ నేతలు బంద్ నిర్వహించారు.
సంపూర్ణం
Published Fri, Feb 14 2014 2:21 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement