కామయ్యతోపు ప్రాంతంలో దుకాణాల వద్ద కొలతలు వేస్తున్న సీఆర్‌డీఏ అధికారులు
కృష్ణాజిల్లా, పెనమలూరు : విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి బందరు రోడ్డును పాత చెక్ పోస్టు నుంచి సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ వరకు 120 అడుగులు విస్తరించాలని చేపట్టిన సర్వే పూర్తి అయ్యింది. సీఆర్‌డీఏ అధికారులు పాత చెక్ పోస్టు నుంచి కాలేజీ వరకు 120 అడుగుల విస్తరణకు మార్కింగ్ ఇచ్చారు. బందరు రోడ్డు ఈ ప్రాంతంలో ప్రస్తుతం 80 అడుగులే ఎన్‌హెచ్‌ఐ అ«ధికారులు విస్తరించారు. అయితే ఇది ట్రాఫిక్ అవసరాలకు చాలదని సీఆర్‌డీఏ అధికారులు రంగంలోకి దిగారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం బందరు రోడ్డును 120 అడుగులు విస్తరించాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఉన్న 80 అడుగుల రోడ్డును 120 అడుగులుగా విస్తరించనున్నారు. దీనికి అయ్యే ఖర్చు సీఆర్‌డీఏ భరించనుంది.
సర్వే చేపట్టిన సీఆర్‌డీఏ అధికారులు..
పాత చెక్‌పోస్టు నుంచి సిద్దార్థ కాలేజీ వరకు బందరు రోడ్డును 120 అడుగులుగా విస్తరిస్తే ఎన్ని భవనాలు తొలగించాలి, భూమి ఎంతవరకు తీసుకోవాలనే విషయమే సీఆర్‌డీఏ కొద్ది రోజులుగా చేపట్టిన సర్వే ప్రక్రియ పూర్తయింది. బందరు రోడ్డుకు ఇరుపక్కల 10 అడుగుల నుంచి 15 అడుగుల వరకు భూమి అవసరం ఉంది. అలాగే 120 అడుగుల లోపు ఉన్న భవనాల జాబితా కూడా సిద్ధం చేశారు. 120 అడుగుల వరకు మార్కింగ్ ఇచ్చి అక్కడ వరకు ఉన్న ఆ భవనాలను తొలగిస్తారు. సీఆర్‌డీఏ అధికారులు దీనికై కొలతలు కొలిచి మార్కింగ్ కూడా ఇచ్చారు..
యజమానులకు బాండ్లు జారీ..
బందరు రోడ్డు విస్తరణకు భూ సేకరణ లేకుండా బాండ్లు ఇవ్వటానికి సీఆర్‌డీఏ రంగం సిద్ధం చేస్తోంది. భూ, భవన యజమానులకు 1 : 4 నిష్పత్తి లెక్కన ఒక గజం భూమికి నాలుగు గజాల విలువ చేసే బాండ్లు జారీ చేయనుంది. గతంతో పోలిస్తే బాండ్ల నిష్పత్తి పెంచారు. దీంతో భూ, భవన యజమానులను ఆకర్షించి వివాదాలు లేకుండా రోడ్డు విస్తరణ చేయాలని ఆలోచనలో సీఆర్‌డీఏ ఉంది.
నేడు సమావేశం..
కాగా భూ, భవన యజమానులతో సీఆర్‌డీఏ కమిషనర్ గురువారం సమావేశం నిర్వహించనున్నారు. భూ, భవన యజమానులు కొంత అసంతృప్తిగా ఉండటంతో వారితో సమావేశం నిర్వహించి బాండ్ల వివరాలు తెలిపి సహకరించాలని సీఆర్‌డీఏ అధికారులు కోరనున్నారు. కాగా పటమట పరిధిలో బందరు రోడ్డు విస్తరణ పనులకు కార్పొరేషన్ త్వరలో సన్నాహాలు చేపట్టనుంది.
యజమానులు సహకరించాలి..
బందరు రోడ్డు సిద్దార్థ కాలేజీ వరకు 150 అడుగులు విస్తరించారు. కాలేజీ నుంచి చెక్‌పోస్టు వరకు రోడ్డు 80 అడుగులే ఉంది. ట్రాఫిక్ సమస్యలు వస్తాయని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 అడుగులు విస్తరించనున్నాం. భూ, భవన యజమానులు సహకరించాలి.– గుమ్మడి ప్రసాద్, టీపీవో
Comments
Please login to add a commentAdd a comment