అయ్యో ‘బంగారుతల్లి’ | Bangarutalli Name Change Maintimahalaksmi TDP govt | Sakshi
Sakshi News home page

అయ్యో ‘బంగారుతల్లి’

Published Thu, Jan 28 2016 11:41 PM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

Bangarutalli Name Change Maintimahalaksmi TDP govt

‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చి వదిలేసిన ప్రభుత్వం
 2015, జూన్ 14 నుంచి వెలుగు కార్యాలయాల్లో నిలిచిపోయిన నమోదు
  ‘ఐసీడీఎస్’కు పథక నిర్వహణ ఉత్తర్వులతో సరి
  జిల్లాలోని 26 మండలాల్లో 13,668మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమకాని నగదు
 
 శృంగవరపుకోట రూరల్: పుట్టిన ఆడపిల్లకు గ్రాడ్యుయేషన్ వరకు రూ. 1,05,500, ఆ ఆడపిల్లల పెళ్లి సమయంలో రూ.50,000 మొత్తంగా రూ.1,55,500 నేరుగా ‘మా ఇంటి మహా లక్ష్మి’ (‘బంగారుతల్లి’ పేరు మార్పు) పథకంలో నమోదైన ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు దశలవారీగా నగదు జమ చేసే పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం పాతరేస్తోంది. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం ‘బంగారుతల్లి’ పథకం పేరుతో చట్టం చేసి 2013 సంవత్సరం మే 1వ తేదీ నుంచి పుట్టిన ఆడపిల్లల తల్లుల పేరున బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా నగదును జమ చేయడం ప్రారంభించింది.
 
 అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2015 జూన్-14వ తేదీ నుంచి ఆడపిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ నిలిపేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెలుగుశాఖ’ నుంచి ‘బంగారుతల్లి’ పథకం నిర్వహణను ఇక ‘మా ఇంటి మహాలక్ష్మి’ పేరుతో ఐసీడీఎస్‌లు అమలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేశారు. కేవలం ‘బంగారుతల్లి’ పథకాన్ని ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చడంతోనే మిన్నకుండిపోయి పథకంలో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 
  ‘బంగారుతల్లి’ పథకం నిర్వహణ తీరు తెన్నుల చట్టం ఇలా..
 పుట్టిన ఆడపిల్లలను ఏ ఒక్కరూ దరిద్రం గా భావించరాదనే ఉద్దేశ్యంతోనూ, ఆడపిల్లలను బాగా చదివించి వారికి పెళ్లిళ్లు చేసే వరకు లబ్ధిదారులుగా ఉన్న ఆడపిల్లల తల్లుల పేరున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చట్టం చేశారు. ఇందులో భాగంగా 2013వ సంవత్సరం మే 1వ తేదీ నుంచి పుట్టిన ఆడపిల్లలకు ఆస్పత్రుల్లో ప్రసవాలకు గానూ రూ.2500, మొదటి సంవత్సరం టీకాల నిమిత్తం రూ.1000, రెండవ సంవత్సరం రూ.1000, 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఆడపిల్లలకు సంవత్సరానికి రూ.1500ల చొప్పున, 6 నుంచి 10సంవత్సరాల వయసు వరకు రూ.2వేలు, 6, 7, 8 తరగతుల వరకు రూ.2500, 9, 10 తరగతులకు రూ.3వేలు, ఇంటర్మీడియట్ చదువుకు రూ.3500, గ్రాడ్యుయేషన్ కోర్సుకు (నాలుగు సంవత్సరాలు) రూ.4000 చొప్పున అప్పటి వరకు రూ.1,05,000 ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం, ఆ తదుపరి పథకంలో ఉన్న ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం రూ.50వేలు, మొత్తంగా రూ.1,55,500 నగదు జమచేయడం ‘బంగారుతల్లి’ పథకం ఉద్దేశ్యంగా  చేసిన చట్టంలో పేర్కొన్నారు.
 
 26 మండలాల్లోని 13668 మంది లబ్దిదారుల్లో నిరాశ..
 విజయనగరం జిల్లాలోని 26 మండలాల్లో ఎస్.కోట మండలం 596, విజయనగరం 322, వేపాడ 453, బాడంగి 517, బలిజిపేట 484, భోగాపురం 400, బొబ్బిలి 550, బొండపల్లి 525, చీపురుపల్లి 612, దత్తిరాజేరు 428, డెంకాడ 462, గజపతినగరం 522, గంట్యాడ 654, గరివిడి 664, గరుగుబిల్లి 485, గుర్ల 522, జామి 539, కొత్తవలస 552, లక్కవరపుకోట 593, మెంటాడ 334, మెరకముడిదాం 626, నెల్లిమర్ల 515, పూసపాటిరేగ 549చ రామభద్రపురం 385, సీతానగరం 631, తెర్లాం 748 మొత్తంగా 13668మంది లబ్దిదారులకు ‘బంగారుతల్లి’ పథకం ద్వారా 2015 జూన్ నెల వరకు వివిద దశల్లో వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేది. అయితే గత 7 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల వలనే ‘మా ఇంటి మహాలక్ష్మి’ని కూడా నీరు గార్చి నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోందంటూ లబ్ధిదారులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆడపిల్లల కుటుంబాలకు ఎంతో మేలు కలిగించే బృహత్తర మైన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
 
  లబ్ధిదారుల రికార్డులు మా వద్దే..
 ‘బంగారుతల్లి’ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న వారి ఫొటోలతో సహా రికార్డులు మొత్తం వెలుగుశాఖ ఆధీనంలో భద్రంగా ఉన్నాయి. ప్రభుత్వం 2015, జూన్ 14న నగదు జమ నిలిపేసి పథకం పేరును ‘మా ఇంటి మహాలక్ష్మి’గా నామకరణం చేసి పథకం నిర్వహణను ఐసీడీఎస్‌లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
                  - ఎం.జయశ్రీ, ఏరియా కోఆర్డినేటర్, వెలుగుశాఖ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement