Bangarutalli
-
అయ్యో ‘బంగారుతల్లి’
‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చి వదిలేసిన ప్రభుత్వం 2015, జూన్ 14 నుంచి వెలుగు కార్యాలయాల్లో నిలిచిపోయిన నమోదు ‘ఐసీడీఎస్’కు పథక నిర్వహణ ఉత్తర్వులతో సరి జిల్లాలోని 26 మండలాల్లో 13,668మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమకాని నగదు శృంగవరపుకోట రూరల్: పుట్టిన ఆడపిల్లకు గ్రాడ్యుయేషన్ వరకు రూ. 1,05,500, ఆ ఆడపిల్లల పెళ్లి సమయంలో రూ.50,000 మొత్తంగా రూ.1,55,500 నేరుగా ‘మా ఇంటి మహా లక్ష్మి’ (‘బంగారుతల్లి’ పేరు మార్పు) పథకంలో నమోదైన ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు దశలవారీగా నగదు జమ చేసే పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం పాతరేస్తోంది. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం ‘బంగారుతల్లి’ పథకం పేరుతో చట్టం చేసి 2013 సంవత్సరం మే 1వ తేదీ నుంచి పుట్టిన ఆడపిల్లల తల్లుల పేరున బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా నగదును జమ చేయడం ప్రారంభించింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2015 జూన్-14వ తేదీ నుంచి ఆడపిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ నిలిపేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెలుగుశాఖ’ నుంచి ‘బంగారుతల్లి’ పథకం నిర్వహణను ఇక ‘మా ఇంటి మహాలక్ష్మి’ పేరుతో ఐసీడీఎస్‌లు అమలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేశారు. కేవలం ‘బంగారుతల్లి’ పథకాన్ని ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చడంతోనే మిన్నకుండిపోయి పథకంలో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బంగారుతల్లి’ పథకం నిర్వహణ తీరు తెన్నుల చట్టం ఇలా.. పుట్టిన ఆడపిల్లలను ఏ ఒక్కరూ దరిద్రం గా భావించరాదనే ఉద్దేశ్యంతోనూ, ఆడపిల్లలను బాగా చదివించి వారికి పెళ్లిళ్లు చేసే వరకు లబ్ధిదారులుగా ఉన్న ఆడపిల్లల తల్లుల పేరున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చట్టం చేశారు. ఇందులో భాగంగా 2013వ సంవత్సరం మే 1వ తేదీ నుంచి పుట్టిన ఆడపిల్లలకు ఆస్పత్రుల్లో ప్రసవాలకు గానూ రూ.2500, మొదటి సంవత్సరం టీకాల నిమిత్తం రూ.1000, రెండవ సంవత్సరం రూ.1000, 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఆడపిల్లలకు సంవత్సరానికి రూ.1500ల చొప్పున, 6 నుంచి 10సంవత్సరాల వయసు వరకు రూ.2వేలు, 6, 7, 8 తరగతుల వరకు రూ.2500, 9, 10 తరగతులకు రూ.3వేలు, ఇంటర్మీడియట్ చదువుకు రూ.3500, గ్రాడ్యుయేషన్ కోర్సుకు (నాలుగు సంవత్సరాలు) రూ.4000 చొప్పున అప్పటి వరకు రూ.1,05,000 ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం, ఆ తదుపరి పథకంలో ఉన్న ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం రూ.50వేలు, మొత్తంగా రూ.1,55,500 నగదు జమచేయడం ‘బంగారుతల్లి’ పథకం ఉద్దేశ్యంగా చేసిన చట్టంలో పేర్కొన్నారు. 26 మండలాల్లోని 13668 మంది లబ్దిదారుల్లో నిరాశ.. విజయనగరం జిల్లాలోని 26 మండలాల్లో ఎస్.కోట మండలం 596, విజయనగరం 322, వేపాడ 453, బాడంగి 517, బలిజిపేట 484, భోగాపురం 400, బొబ్బిలి 550, బొండపల్లి 525, చీపురుపల్లి 612, దత్తిరాజేరు 428, డెంకాడ 462, గజపతినగరం 522, గంట్యాడ 654, గరివిడి 664, గరుగుబిల్లి 485, గుర్ల 522, జామి 539, కొత్తవలస 552, లక్కవరపుకోట 593, మెంటాడ 334, మెరకముడిదాం 626, నెల్లిమర్ల 515, పూసపాటిరేగ 549చ రామభద్రపురం 385, సీతానగరం 631, తెర్లాం 748 మొత్తంగా 13668మంది లబ్దిదారులకు ‘బంగారుతల్లి’ పథకం ద్వారా 2015 జూన్ నెల వరకు వివిద దశల్లో వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేది. అయితే గత 7 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల వలనే ‘మా ఇంటి మహాలక్ష్మి’ని కూడా నీరు గార్చి నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోందంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆడపిల్లల కుటుంబాలకు ఎంతో మేలు కలిగించే బృహత్తర మైన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. లబ్ధిదారుల రికార్డులు మా వద్దే.. ‘బంగారుతల్లి’ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న వారి ఫొటోలతో సహా రికార్డులు మొత్తం వెలుగుశాఖ ఆధీనంలో భద్రంగా ఉన్నాయి. ప్రభుత్వం 2015, జూన్ 14న నగదు జమ నిలిపేసి పథకం పేరును ‘మా ఇంటి మహాలక్ష్మి’గా నామకరణం చేసి పథకం నిర్వహణను ఐసీడీఎస్‌లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. - ఎం.జయశ్రీ, ఏరియా కోఆర్డినేటర్, వెలుగుశాఖ -
ఓడిపోతున్న అమ్మతనం
వంశోద్ధారకుడు కావాలన్న ఆరాటం.. ఆడపిల్లను సాకలేమన్న నిస్సహాయత.. ఏదైతేనేమీ.. జిల్లాలో శిశు విక్రయాల దుష్ట సంప్రదాయం కొనసాగుతుండడం దురదృష్టకరం. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం తండాలను వీడడం లేదు. ఇక..ఆధునికతకు పేరొందిన పట్టణ ప్రాంతాల్లో ‘కని’కరం లేకుండా ఆడశిశువులను రోడ్డు పక్కన, చెత్తకుప్పల్లో.. మురుగు కాల్వల్లో వేస్తున్న సంఘటనలు అనేకం.. ఆడశిశువులను ‘కని’కరం లేకుండా వదిలించుకుంటున్న విషాదాలకు జిల్లాలో ఇక.. ముగింపు లేదా...? విషసర్పాలైన పాములు కూడ గత్యంతర లేని పరిస్థితుల్లో మాత్రమే తాము కన్న పిల్లలను వధిస్తాయని తెలిసిందే. పేదరికం, అధిక సంతానం మనుషులను కూడ కర్కోటకులుగా మారుస్తోంది. నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి సైతం ప్రేమను త్వజించి పేగు తెంచుకుపుట్టిన పసిగుడ్డును పాషాణంగా వదిలేస్తోంది. ⇒ పసిగుడ్డులను పడేస్తున్న కొందరు.. ⇒ దత్తత పేరుతో విక్రయిస్తున్న మరికొందరు ⇒ జిల్లాలో ఇంకా కొనసాగుతున్న దుష్ట సంప్రదాయం నల్లగొండ అర్బన్: రోజులు, నెలలు, సంవత్సరాలతోపాటు క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ అడశిశువులను వదిలించుకునే అనాచారం నుంచి గిరి‘జనం’ బయటపడలేకపోతోంది. ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినా, బంగారుతల్లి, కల్యాణ లక్ష్మి తదితర పథకాలను ప్రవేశపెట్టినా ఈ దుష్ట సంప్రదాయాన్ని నిలువరించలేకపోతున్నారు. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం గిరిజన తండాలను వీడడం లేదు. శిశు విక్రయాలతో దశాబ్దన్నర క్రితమే పత్రికల్లో పతాక శీర్షికల్లోకెక్కిన దేవరకొండ ప్రాంతంలో తరచు ఇలాంటి అనాచారపు ఆనవాళ్లు మెదలుతూనే ఉండగా, దుష్ట సంస్కృతి తాజాగా జిల్లా కేంద్రమూ మినహాయింపుకాదనే సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు వెళ్లేదారిలో అవాంఛిత మృతశిశువు ఉదంతం వెలుగులోకిచ్చి పదిరోజులైనా కాకముందే దత్తత ముసుగులో శిశు విక్రయ సంఘటన కలకలం రేపడం చర్చనీయాంశమైంది. వదిలించుకుంటున్న శిశువులు రోజుల వయస్సు వారు కావడంతో తల్లిపాలు పొందడం, తల్లిదండ్రుల వద్ద సహజ వాతావరణంలో పెరగడంలాంటి ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారు. 1999 నుంచి.. 1999 మార్చిలో దేవరకొండ మండలం కొండమల్లేపల్లి శివారు గౌరికుంట తండాలో ఇంద్రావత్ మంగ్లి అనే గిరిజన మహిళ 3 నెలల పసికందును భర్తకు తెలియకుండా అమ్మిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో దాదాపు 75 మంది శిశు విక్రయాలు జరిగాయని పరిశోధనల్లో తెలింది. ‘‘ఆడశిశువులను అమ్ముకుంటే ఎంతో కొంతలాభం...లేకుంటే పెంచి పెద్దచేసి పెళ్లిచేస్తే లక్షలవుతది. అందుకే అమ్ముకుంటున్నాం’’ అని పలువురు గిరిజన మహిళలు పేర్కొనడం వారి పరిస్థితులకు అద్దంపట్టింది. అత్యధికంగా చందంపేట మండలంలో ఆ తర్వాత డిండి, చింతపల్లి, పీఏపల్లి మండలాల్లో విక్రయాలు జరిగినట్లు తేలాయి. ప్రత్యేక ప్యాకేజీ అనంతరం కొంతమేర తగ్గడం, ఆతర్వాత ‘ఊయల’ పేరుతో శిశుగృహలకు తరలించే ఏర్పాటు చేయడంతో మరికాస్త చైతన్యం వచ్చినా, దత్తత పేరుతో అడపాదడపా శిశు విక్రయాల ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సాటుమాటుగా కొనసాగుతున్న విక్రయాలు.. పెంపకానికనో, దత్తత ఇచ్చామనే సాకులతో శిశు విక్రయాలు సాటుమాటుగా కొనసాగుతూనే ఉన్నాయి. వెలుగుచూసేవి కొన్నైతే...వెలుగులోకి రానివి ఇంకొన్ని. చందంపేట మండలం పోలేపల్లి శివారు ఫకీర్‌నాయక్ తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానమైన నెలవయస్సు దాటని ఆడశిశువును మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రూ. 15వేలకు కొండమల్లేపల్లి విద్ద విక్రయించారు. విషయం పోలీసులకు తెలియడంతో శిశువును స్వాధీనం చేసుకుని దేవరకొండలోని శిశు గృహకు తరలించిన సంఘటన తెలిసిందే. తాజాగా హాలియా మండలంలోని రంగుండ్ల తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానంలో జన్మిం చిన ఆడశిశువును మునుగోడు మండలానికి చెందిన ఓవ్యక్తి అప్పగించడం.. నల్లగొండలో జరిగిన వాగ్వివాదంతో విషయం అధికారుల దాకా వెళ్లి పాపను శిశుగృహకు తరలించారు. ఒకప్పుడు గొంతులో వడ్లగింజవేసి అక్కడిక్కడే అవాంఛిత శిశువుల ఉసురు తీసిన సంఘటనల నుంచి శిశు విక్రయాలు, దత్తత ముసుగులో వ్యాపారాలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ‘కల్యాణలక్ష్మి’తోనైనా ఆగేనా... ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ఏటా కొంత నగదును ఇస్తూ మొత్తంగా రూ.2.16లక్షలను అందజేయడం ఈ పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఈ పథకం కొనసాగింపు అస్పష్టంగానే ఉంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారానైనా ఆడపిల్లల జీవితాలకు భరోసా కలగాలని ఆశిద్దాం. ఆడశిశువైతే వీడాల్సిందే...! వంశోద్ధారకుడు కావాలనే తాపత్రయంతో రెండు, మూడు కాన్పుల వరకు చూసి ఆపై కూడ ఆడ సంతానమే కలిగితే వదిలించుకుంటున్న సంఘటనలే ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఆస్తి, యాజమాన్యత, దారిద్య్రం, లింగవివక్షలు, వరకట్న సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్న విపత్కర పరిస్థితుల ప్రేరేపణతో నవమాసాలు మోస్ఙికన్న’ ఆ పేగే బరువైపోతోంది. ఈ అనాచారం విశృంఖలంగా మారి పరిస్థితి ఘోరంగా తయారవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ మొదలు అసెంబ్లీ కమిటీల వరకు గిరిజన తండాల్లో పర్యటించి శిశు విక్రయ నిరోధానికి సలహాలు, సూచనలిచ్చాయి. రూ.26 కోట్ల ప్యాకేజీతో కొంతతగ్గినా... శిశు విక్రయాల సంఘటనలను తీవ్రంగా పరిగణించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ 2001లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటన తర్వాత..దాని నివేదిక ప్రకారం 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గానికి 26 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పేదరికంలో మగ్గుతున్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి మరికొంత ఆర్థిక సాయం అందించింది. దీంతో కొన్నాళ్లపాటు ఈ అనాచార, ఉదంతాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత యథాతధమయ్యాయి. -
సిమెంట్ తొట్టిలో ‘బంగారుతల్లి’
మానవత్వం మాయమైందా..! - వికారాబాద్ పాతగంజ్‌లో పసికందు లభ్యం - తాండూరులోని శిశుగృహకు తరలింపు అనంతగిరి: మానవత్వం మాయమైపోయింది. ‘మాతృత్వం’ బరువైంది. లోకం పోకడ తెలియని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ఓ సిమెంట్ తొట్టిలో వదిలేసి పోయారు. ‘బంగారు తల్లి’ ఆ తల్లిదండ్రులకు బరువైందో.. లేక మరి ఇంకేదైన కారణమో..! నెలరోజుల వయసు కూడా లేని పసికందు గుక్కపట్టి ఏడ్వడంతో పలువురు ఆయ్యో ‘పాపం' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి ఒడిలో కంటినిండా నిద్రించాల్సిన చిన్నారి రోడ్డుపాలైంది. ఈ హృదయ విదారక సంఘటన వికారాబాద్‌లోని పాతగంజ్‌లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతగంజ్‌లో ఇళ్ల మధ్య ఓ సిమెంట్ తొట్టి ఉంది. అందులో కాలనీవాసులు చెత్తచెదారం పడేస్తుంటారు. ఇదిలా ఉండగా.. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తొట్టిలోంచి పసికందు రోదనలు వినిపించాయి. స్థానికురాలు చంద్రకళ అక్కడికి వెళ్లి చూడగా ఓ ఆడబిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. దీంతో ఆమె చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి దుస్తులు వేసింది. స్థానికులు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. తాపీగా ఐసీడీఎస్ అధికారులు సాయంత్రం 4:30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పసికందును సిమెంట్ తొట్టిలో వదిలేసి వెళ్లి ఉంటారని స్థానికులు అధికారులకు తెలిపారు. ఈ ‘పాప'ం ఎవరిదో అని స్థానికులు నిందించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుష్మ పోలీసుల సాయంతో ‘బంగారు తల్లి’ని తాండూరులోని శిశుగృహకు తరలించారు. -
మూడు నెలల చిన్నారి ప్రాణాలు తీసిన రచ్చబండ
రచ్చబండ కార్యక్రమం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. బంగారుతల్లి పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసేందుకు తల్లిదండ్రులు తీసుకొచ్చిన మూడు నెలల మోక్ష అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి చర్చబండ కార్యక్రమంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలకేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తీవ్రంగా తోపులాట జరగడంతో మూడు నెలల మోక్ష తీవ్ర అస్వస్థతకు గురైంది. రచ్చబండ నిర్వహిస్తుండగా అకస్మికంగా తోపులాట జరగడంతో ఊపిరాడక చిన్నారి మోక్ష తీవ్ర అనారోగ్యానికి లోనైంది. ఆ చిన్నారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. బంగారుతల్లి పథకం ద్వారా చెక్కు తీసుకోడానికి మాచారెడ్డి మండలంలోని భవానీపేట తండాకు చెందిన చిన్నారి మోక్షను వారి తల్లిదండ్రులు మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి తీసుకువచ్చారు. రచ్చబండలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఆ చిన్నారి చివరకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇలాంటి విషాదకర సంఘటన చోటుచేసుకోవడం పట్ల కార్యక్రమానికి వచ్చిన పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలుత అందరూ చిన్నారి మోక్షను బంగారుతల్లి లబ్ధిదారుగా భావించారు. అయితే, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాత్రం ఆమె లబ్ధిదారు కాదని, పథకానికి దరఖాస్తు చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చి ఉంటారని ఆయన చెప్పారు. అలాగే మాచారెడ్డిలో ఏర్పాట్లు కూడా పూర్తిగానే చేశామని కలెక్టర్ తెలిపారు. అయితే, దరఖాస్తు తీసుకోడానికే తాము అక్కడకు వచ్చినట్లు చిన్నారి మోక్ష తల్లి రేణుక 'సాక్షి'కి తెలిపారు. -
బంగారుతల్లి పథకంపై అవగాహన పొందాలి
శాయంపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న బంగారుతల్లి పథకంపై తల్లులు అవగాహన పొందాలని డీఆర్డీఏ ఐకేపీ ప్రాజెక్టు డెరైక్టర్ సముద్రాల విజయగోపాల్ అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రంలో గురువారం కంప్యూటర్ ఆపరేటర్లకు బంగారు తల్లి డాటా అప్లోడింగ్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ విజయ్‌గోపాల్ మాట్లాడుతూ బంగారు తల్లి డాటా అప్లోడింగ్ అనుకున్నంత స్థాయిలో జరగడం లేదన్నారు. పథ కంపై అవగాహన లేకపోవడంతో ఆడపిల్లల తల్లులు అందించే మ్యాన్డేటరి డ్యాక్యుమెం ట్లు, పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్ సకాలంలో అందించకపోవడంతో ఆలస్యమవుతున్నాయని ఆయన చెప్పా రు. బంగారు తల్లి పథకం మే 1వ తేదీ నుంచి పుట్టిన పిల్లలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. పథకంలో పేరు నమోదు చేసుకున్న ఆడపిల్లలకు 19 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రభుత్వం విడతల వారీగా పారితోషికం అందజేస్తుందని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలో పుట్టిన బంగారు తల్లులకు మొదటి విడతగా రూ.2,500 అందజేస్తామన్నారు. బంగారు తల్లుల ఎంపిక బాధ్యత పూర్తి గా ఏపీఎంలదేనని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు పథకం డాటాను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీని వాస్, సీసీలు పాల్గొన్నారు.