మూడు నెలల చిన్నారి ప్రాణాలు తీసిన రచ్చబండ
రచ్చబండ కార్యక్రమం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. బంగారుతల్లి పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసేందుకు తల్లిదండ్రులు తీసుకొచ్చిన మూడు నెలల మోక్ష అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి చర్చబండ కార్యక్రమంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలకేంద్రంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తీవ్రంగా తోపులాట జరగడంతో మూడు నెలల మోక్ష తీవ్ర అస్వస్థతకు గురైంది. రచ్చబండ నిర్వహిస్తుండగా అకస్మికంగా తోపులాట జరగడంతో ఊపిరాడక చిన్నారి మోక్ష తీవ్ర అనారోగ్యానికి లోనైంది. ఆ చిన్నారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.
బంగారుతల్లి పథకం ద్వారా చెక్కు తీసుకోడానికి మాచారెడ్డి మండలంలోని భవానీపేట తండాకు చెందిన చిన్నారి మోక్షను వారి తల్లిదండ్రులు మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి తీసుకువచ్చారు. రచ్చబండలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఆ చిన్నారి చివరకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇలాంటి విషాదకర సంఘటన చోటుచేసుకోవడం పట్ల కార్యక్రమానికి వచ్చిన పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
తొలుత అందరూ చిన్నారి మోక్షను బంగారుతల్లి లబ్ధిదారుగా భావించారు. అయితే, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాత్రం ఆమె లబ్ధిదారు కాదని, పథకానికి దరఖాస్తు చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చి ఉంటారని ఆయన చెప్పారు. అలాగే మాచారెడ్డిలో ఏర్పాట్లు కూడా పూర్తిగానే చేశామని కలెక్టర్ తెలిపారు. అయితే, దరఖాస్తు తీసుకోడానికే తాము అక్కడకు వచ్చినట్లు చిన్నారి మోక్ష తల్లి రేణుక 'సాక్షి'కి తెలిపారు.