
దేవుళ్ల అందరిలోనూ ప్రత్యేక విలక్షణమూర్తి శ్రీకృష్ణుడు!. ఆయన బాల్యం- లీలా మాధుర్యానికి ఆట పట్టు, అనంత దార్శనిక సూత్రాల తేనెపట్టు. ఆయన శృంగార మహత్వం- లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒకరకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు. మరో కోణంలో మహా విషాద నాయకుడు ఇలా ఇద్దరు కృష్ణుడిలో తారసపడతారు. ముఖ్యంగా అరిషడ్వర్గాలను- మోక్షమార్గాలుగానూ, స్వర్గద్వారాలుగానూ అద్భుతంగా నిరూపించాడాయన.
ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం సప్తమ స్కంధంలో నారద మహర్షి విశేషంగా వర్ణించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు తలలతో మన మానస్సు అనే సరోవరాన్ని అను నిత్యం కలవరపరుస్తుంటుంది. అవే మన లోపలి శత్రుకూటమి. దాన్ని సమూలంగా తుద ముట్టించాలంటే, కోపం అనే ఘీంకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకుని గజేంద్ర మోకంలోని గజేంద్రుడిలా భగవంతుణ్ని ఆశ్రయించాలి
కృష్ణుడి ప్రత్యేకత ఏమంటే...
ఆ ఆరింటినీ సాధనాలుగా మార్చు కొని, వాటి సాయంతోనూ తనను పొందవచ్చునని హామీ ఇచ్చాడాయన. కోరిక, కోపం, భయం, భక్తి, అనురక్తి, ఆసక్తి, ద్వేషం, స్నేహం... చివరకు శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుణ్ని తమవాణ్ని చేసుకోని పొందొచ్చ్చని భాగవతం నిరూపించింది. అలా ఎవరెవరు ఏయే మార్గాల్లో ఆయనకు దగ్గరయ్యారో నారదుడు వర్ణించి చెప్పాడు కూడా. దారి ఏదైనా గమ్యం ఒక్కటే అన్నాడాయన ధర్మరాజుతో.
అదెలా అంటే..
మనం చెప్పుకొన్న శత్రువర్గంలో కామం మొదటిది. దాని ద్వారానే గోపికలు హరిని సొంతం చేసుకొన్నారు. కామం అంటే కోరిక ఆసక్తి అనురక్తి... తనకు దక్కాలనే తహతహ. ధర్మా ర్థకామమోక్షాలనే నాలుగు రకాల పురుషార్థాలకు సంబంధించి- కామంలోని నాలుగు కోణాలను భరతముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించాడు. గోపికలది మధురభక్తికి చెందిన కామం. మోక్ష కాంక్షలోంచి ఉప్పొంగిందది. కాబట్టి వారిది 'మోక్ష సంబంధి శృంగారం' అన్నారు పెద్దలు. భరతుడి వివరణలోని మోక్షకామానికి సరైన ఉదాహ రణ గోపికల కామం.
'కోరికతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయాద్వేషాలతో శిశు పాలాదులు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా ముని జనులు శ్రీకృష్ణుడికి చేరువ అయ్యారు' అన్నది నారదమహర్షి విశ్లేషణ. ఇదేవిధంగా ఇ
కృష్ణుడు చెప్పిన మోక్ష మార్గాలు..
ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్దరించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్ర మైనది. కళ్లు తెరిచింది- కటకటాల్లో. ఊపిరి పీల్చింది అపాయాల్లో. బతుకు గడిచింది- గండాల్లో. చివరకు ఆయన చరమదశా- పరమ దారుణం. తన కళ్లముందే తన వారంతా ఒకళ్లనొకళ్లు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే- కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలి బొటనవేలికి వేటగాడి బాణం నాటుకుని బొట్టుబొట్టుగా నెత్తురు స్రవించి మనుగడ కడతేరిపోవడమంటే- ఎంత విషాదకరమైన ముగింపు!. ఏమనాలి ఆయన జీవితాన్ని?.
ఇది అద్భుతమా..!
కృష్ణకథను చెబుతూ వ్యాసమహర్షి 'అద్భుతం' అనే పదాన్ని ప్రయోగించారంటే- ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? కృష్ణుడి పుట్టుక అద్భుతం. ఆయన లీలలు అద్భుతం. ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం. 'ధర్మం' అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు- అద్భుతం అనే భావానికి ప్రాణం పోస్తే- అది కృష్ణుడు. ఎంత చక్కగా ఆయన జీవిత కథ జీవిత పరమార్థాన్ని విశదరపరుస్తుంది.
భగవంతుడు సైతం మనిషిగా పుట్టినప్పుడూ కష్టాలు అనుభవించక తప్పదని, ఉన్నత, పతన స్థితుల కలబోత అనే ఆయనే స్వయంగా అవతారం ఎత్తి చూపించాడు. సో కష్టాలకు కలవరపడొద్దు, ఆ జగన్నాథుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మీద భారం వేసి నిశ్చింతగా జీవించి సుఖమయ జీవితాన్ని పొందుదాం.
(చదవండి: వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?)