శ్రీకృష్ణ జన్మాష్టమి.. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకగా చేసుకునే పండుగ. ఈ ఏడాది ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను చేసుకోనున్నారు. భారతదేశమంతటా ఈ పండుగ వేళ భక్తులలో ఆనందం వెల్లివిరుస్తుంది. జన్మాష్టమి వేడుకలు కేవలం మధుర-బృందావనంలోనే కాకుండా గుజరాత్, ముంబై, కేరళలో కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.
మధుర- బృందావనం (ఉత్తర ప్రదేశ్)
బృందావనం శ్రీకృష్ణుని జన్మస్థలం. అందుకే జన్మాష్టమి వేళ ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బృందావనంలో జన్మాష్టమి వేడుకలు 10 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇక్కడి ఆలయాలను వివిధ రకాల అందమైన పూలతో అలంకరిస్తారు. రోజంతా భక్తులు భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఇక్కడి వాతావరణమంతా భక్తితో నిండిపోతుంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో నివసించే వారు జన్మాష్టమి నాడు మధుర, బృందావనాలను సందర్శిస్తుంటారు.
ద్వారక (గుజరాత్)
గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుని పురాతన ఆలయం ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఏడాది పొడవునా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే జన్మాష్టమి సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు తరలివస్తుంటారు.
పూరి (ఒడిశా)
ఒడిశాలోని పూరీలో కూడా మధుర-బృందావనంలో మాదిరిగానే వారం రోజుల ముందుగానే జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుని జీవితం ఆధారంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సాయంత్రం వేళ శ్రీకృష్ణునికి ఇచ్చే హారతిని చూసేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.
ముంబై (మహారాష్ట్ర)
జన్మాష్టమి సందర్భంగా ముంబైలో నిర్వహించే దహీ-హండీ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదర్, వర్లీ, థానే, లాల్‌బాగ్‌లలో నిర్వహించే దహీ హండీని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.
గురువాయూర్(కేరళ)
గురువాయూర్ దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తారు. ఈ ఆలయాన్ని బృహస్పతి, వాయుదేవుడు నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి గురువాయూర్ దేవాలయం అని పేరు వచ్చిందంటారు. ఇక్కడ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment