బ్యాంక్‌పై స్కెచ్... మేనేజర్ ఇంట్లో చోరీ | Bank on the sketch ... Manager home theft | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌పై స్కెచ్... మేనేజర్ ఇంట్లో చోరీ

Published Tue, Feb 4 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

బ్యాంక్‌పై స్కెచ్... మేనేజర్ ఇంట్లో చోరీ

బ్యాంక్‌పై స్కెచ్... మేనేజర్ ఇంట్లో చోరీ

  •      కెనరా బ్యాంక్ చోరీకి విఫలయత్నం
  •      మేనేజర్ ఇంట్లో బైక్, ల్యాప్‌టాప్ చోరీ
  •  అరకులోయ/అరకు రూరల్, న్యూస్‌లైన్:  బ్యాంకు చోరీకి విఫలయత్నం చేసిన దొంగలు... ఆ కోపాన్ని మేనేజర్ ఇంటిపై ప్రదర్శించారు. మోటార్ బైక్‌ను, ల్యాప్‌టాప్‌ను అపహరించుకుపోయారు. సినీఫక్కీలో జరిగిన ఈ చోరీపై పోలీసుల వివరాలివి. యండపల్లివలస కెనరా బ్యాంక్‌లో తాత్కాలికంగా ఏటీఎం ఏర్పాటు చేశారు.

    బ్యాంకులో ఆదివారం రాత్రి దొంగలు ప్రవేశించి ఏటీఎంను ధ్వంసం చేశారు. లోపలున్న లాకర్‌ను తీసేందుకు ఎంత ప్రయత్నించినా వీలవక వదిలేసి వెళ్లిపోయారు. అక్కడినుంచి అరకులోయ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్న కెనరా బ్యాంక్ మేనేజర్ ఎం.వెంకటకుమార్ ఇంట్లో చొరబడ్డారు. ఆదివారం సెలవు కావడంతో మేనేజర్ స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి బయట పెట్టిన హీరో హోండా, ఇంట్లో మంచంపై ఉంచిన లాప్‌టాప్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు.
     
    సోమవారం ఉదయం 9.15 గంటలకు స్వీపర్ గుజ్జెలి సువర్ణ బ్యాంక్ తాళాలు తీయబోయేసరికి గేటు, తలుపుల తాళాలు పగులగొట్టి ఉండటం చూసి అవాక్కయింది. వెంటనే బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్‌లో సమాచారం అందించింది. హుటాహుటిన మేనేజర్ ఎం.వెంకటకుమార్ బ్యాంక్‌కు చేరుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు సిద్ధమవుతుండగా, ఆయన  ఇంట్లో చోరీ జరిగినట్టు అదే కాలనీవాసి ఫోన్‌లో తెలిపారు. ఒకేసారి రెండు సంఘటనలు జరగడంతో ఆందోళన చెందిన బ్యాంకు మేనేజర్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మూడు నెలల క్రితం కొన్న బైక్ ఖరీదు రూ. 65 వేలు, నెలరోజుల క్రితం కొన్న లాప్‌టాప్ ఖరీదు రూ.40  వేలుంటుందని మేనేజర్ కుమార్ తెలిపారు.
     
     రక్షణ ఏర్పాట్లు లేని బ్యాంకు
     అరకులోయ సీఐ మురళీరావు, ఎస్‌ఐ జి.నారాయణరావు బ్యాంకును తనిఖీ చేసి లాకర్లను పరిశీలించారు. పైసా కూడా దొంగలు ఎత్తుకెళ్లలేదని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంక్‌ను అద్దె ఇంట్లో నిర్వహిస్తుండటం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడమే చోరీకి ఆస్కారమిచ్చిందని తెలుస్తోంది. సాయంత్రం క్లూస్ టీం బ్యాంక్‌కు చేరుకొని ఆధారాలు సేకరించాయి. వెంటనే వాచ్‌మన్‌ను నియమించుకోవాలని బ్యాంక్ అధికారులకు నోటీసు జారీ చేశామని సీఐ మురళీరావు విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement