సాక్షి, ఒంగోలు : ఒక పక్క రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు బ్యాంకర్లు మాత్రం రుణాలు చెల్లించకపోతే వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని బ్యాంకులు రుణమాఫీ ప్రక్రియకు కావాల్సిన తతంగం నడుపుతుండగా, సహకార బ్యాంకులతోపాటు ప్రధాన బ్యాంకులు కూడా బంగారం వేలం కోసం నోటీసులు జారీ చేస్తున్నాయి. అయితే ఇందులో వ్యవసాయేతర రుణాల కోసం పెట్టిన బంగారం అంటూ పత్రికల్లో వేలం నోటీసులు కూడా ప్రచురిస్తున్నారు.
ఇప్పటికే వందలాది మంది రైతులకు ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. జిల్లాలో గత ఏడాది ఇచ్చిన పంటరుణాలు రూ.2600 కోట్లు. ఇందులో రైతులు తమ భార్యాబిడ్డల బంగారాన్ని తాకట్టుగా పెట్టి పంట పెట్టుబడులుగా తెచ్చినవి రూ.1200 కోట్ల వరకు ఉన్నాయి. భూముల్ని తాకట్టుపెట్టి తెచ్చినవి రూ.1400 కోట్లు.
ఇవికాకుండా రైతులు నాలుగైదేళ్లుగా చెల్లించకుండా మిగిలిన పాతబకాయిలు రూ.1100 కోట్ల మేర పేరుకుపోయాయి. వీటన్నింటినీ వెంటనే చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులు జారీచేస్తున్నాయి. వడ్డీపై వడ్డీ వేస్తూ తడిసిమోపెడయ్యేలా చేస్తున్నాయి. రుణమాఫీ ప్రకటనల నాటి నుంచి బ్యాంకర్ల ఒత్తిడి మరింత పెరిగిందని బంగారం వేలం వేసేందుకు సైతం వెనుకంజ వేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేలం నోటీసుల వెల్లువ..
యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకటరెడ్డి జిల్లా సహకార బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి గత ఏడాది జనవరి 31వ తేదీన 40 వేల రూపాయల రుణం తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీతో కలిపి 41,200 చెల్లించాలని, లేనిపక్షంలో నగలు వేలం వేసి అప్పు జమ వేసుకుంటామని నోటీసు ఇచ్చారు.
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 1159 మంది రైతులకు నోటీసులు జారీ చేసింది. కందుకూరు, కనిగిరి, టంగుటూరు, వీఆర్‌కోట, పామూరు, పీసీపల్లి, తెట్టు, కామేపల్లి, ఉలవపాడు, సింగరాయకొండ గ్రామాల్లోని రైతులకు వేలం నోటీసులు జారీ చేసింది. శనివారంనాడు వేలంపాట నిర్వహించేందుకు బ్యాంకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో రైతుల బకాయిలన్నీ కలుపుకొని దాదాపు రూ. 160 కోట్లు ఉంటాయని అంచనా. పంట రుణాలు, డ్వాక్రామహిళల రుణాలు, బంగారం రుణాలన్నీ కలుపుకొని నాలుగు మండలాల్లో సుమారు 18 వేల మంది వరకు ఉంటారు. వారిలో ఇప్పటికే చీమకుర్తి ఆంధ్రాబ్యాంక్ గత నెల 16వ తేదీన 119 మంది రైతులకు రూ.80 లక్షల విలువ చేసే రుణాలను చెల్లించాలని నోటీసులిచ్చారు.
కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోనే ఐఓబీ బ్యాంకు 300 మంది రైతులకు, పినాకినీ బ్యాంకు 500 మందికి నోటీసులు జారీ చేసింది. ఇదేవిధంగా దర్శి, పర్చూరు, చీరాల, కందుకూరు, కొండపి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలతోపాటు ఒంగోలు రూరల్ ప్రాంత రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. బాధితులంతా ఈ నోటీసులకు సమాధానం చెప్పలేక, తమ తరఫున భరోసానిచ్చే నాథుడు లేక.. గోదాముల్లో పంటనిల్వలు, బంగారం ఆభరణాలు వేలంలో పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని బెంబేలెత్తుతున్నారు.
రుణమాఫీ..ఆర్భాటమే..!
Published Sat, Aug 23 2014 4:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement