విద్యార్థుల పేరుపై ఖాతాలు తెరిచేందుకు విముఖత
రోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు
అకౌంట్లు లేక అందని రవాణా భత్యం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం మంజూరు చేస్తున్న రవాణా భత్యం పొందడానికి గ్రామీణ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం రవాణా ఖర్చును అందజేస్తోంది. గతంలో ఈ మొత్తాన్ని ఎస్‌ఎంసీ ఖాతాల్లో జమ చేయగా, ప్రధానోపాధ్యాయులు డ్రా చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసేవారు. అయితే ఇందులో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చర్యలు తీసుకున్నారు. రవాణా మొత్తం నేరుగా విద్యార్థికి అందేలా వారిపేరుపై బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. పిల్లలతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలనే ఆదేశాలను చాలా మంది హెచ్‌ఎంలు పట్టించుకోలేదు. ఎస్‌ఎస్‌ఏ అధికారుల ఒత్తిడితో సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు చొరవ తీసుకుని విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని పిలుచుకుని బ్యాంకు వెళ్తే వారు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు సీఆర్పీ సుధారాణి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఝాన్సీ గురువారం ఉదయం 15 విద్యార్థులను వెంటబెట్టుకొని చెన్నేకొత్తపల్లిలోని కెనరా బ్యాంకుకు వచ్చారు. ఖాతాలు ప్రారంభించాలని బ్యాంకు సిబ్బందిని కోరగా వారు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు. చివరకు ఇప్పుడు కుదరదు.. నెల, లేదా మూన్నెల్ల తర్వాత వస్తే పరిశీలిస్తామని సిబ్బంది సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా విద్యార్థుల ఖాతాలు మాత్రం ఓపెన్ కాలేదు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది.
అందని రవాణా భత్యం..
2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి 7737 మంది పిల్లలకు రవాణా భత్యం రూ. 2.29 కోట్లు మార్చి 18న ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్ ఆమోదముద్ర కూడా వేశారు. అయితే విద్యార్థుల పేరిట ఖాతాలు తెరవడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. 7,737 మంది విద్యార్థులకు గాను ఇప్పటి వరకూ 4,152 మంది మాత్రమే ఖాతాలు తెరిచారు. మిగిలిన 3,585 మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో రవాణా భత్యం అందలేదు. మార్చిలో వచ్చిన బడ్జెట్ బ్యాంకులో మూలుగుతోంది. ఇప్పట్లో విద్యార్థులకు అందేలా లేదు. ఇప్పటికైనా విద్యార్థుల ఖాతాలు తెరిచేలా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లల తల్లిదండ్రులు, హెచ్‌ఎంలు కలెక్టర్‌ను కోరుతున్నారు.
బ్యాంకర్ల నిర్లక్ష్యం
Published Fri, May 27 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM
Advertisement
Advertisement