=మావోయిస్టుల బ్యానర్లతో పోలీసుల మండిపాటు
=మద్దిగరువు బస్సు సర్వీసు నిలిపివేత
=నాలుగు నెలలుగా గిరిజనుల నరకయాతన
=200 గ్రామాల గిరిజనులకు అష్టకష్టాలు
పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని పెదబయలు, జి.మాడుగుల, ఒడిశా సరిహ ద్దు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు ఆ ఎర్రబస్సొక్కటే దిక్కు.. ఇప్పు డు అదీ రద్దయి అగచాట్లు పడుతున్న గిరి జనులకు ఆ దేవుడే దిక్కు! మద్దిగరువు బస్సు సర్వీసు లేక గిరిజనులు పడుతున్న అవస్థలు చూస్తే ఈ అభిప్రాయమే కలుగుతుంది. జి.మాడుగుల నుంచి మద్దిగరువు వరకు పక్కా రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ పోలీస్, ఆర్టీసీ అధికారుల మధ్య వివాదంతో బస్సు సర్వీసు నాలుగు నెలల కిందట నిలిచిపోయింది.
సూరిమెట్ట ప్రాంతంలో మిలీషియా సభ్యులు ఆర్టీసీ బస్సుకు మావోయిస్టు బ్యానర్లు కట్టడంతో బస్సు డ్రైవర్, కండక్టర్‌లు ప్రాణభయంతో బొయితిలి నుంచి జి.మాడుగుల వరకు ఈ బస్సును తీసుకువచ్చారు. అయితే మావోయిస్టుల బ్యానర్లు తొలగించకుండా జి.మాడుగుల వరకు ఆర్టీసీ బస్సును తీసుకురావడాన్ని పోలీసులు అప్పట్లో తప్పుబట్టి ఆర్టీసీ సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాంతో ఆర్టీసీ అధికారులు అప్పటి నుంచి మద్దిగరువు ప్రాంతానికి బస్సు సర్వీసును నిలిపేశారు. ఐదారేళ్లుగా బస్సు సౌకర్యం ఉన్న మారుమూల సుమారు 200 గ్రామాల గిరిజనులంతా ఆర్టీసీ అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోజుకు రెండుసార్లు పాడేరు నుంచి జి.మాడుగుల మీదుగా మద్దిగరువుకు ప్రయాణించే ఆర్టీసీ బస్సు సర్వీసు నిలిచిపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో గిరిజనులు ప్రయివేటు జీపులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా జీపుల యజమానులు గిరిజనులను దోచుకుంటున్నారు. బస్సు సర్వీసును పునరుద్ధరించేందుకు పోలీస్, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
బ్యానర్ల దెబ్బకు బస్సు రద్దు!
Published Tue, Dec 17 2013 1:04 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement