డెప్యూటేషన్ సిబ్బందితో నెట్టుకొస్తున్న
పొన్నెకల్లు ఆరోగ్య కేంద్రం
తాడికొండ :
మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు అందరూ డెప్యూటేషన్లపై వచ్చిన వైద్య సిబ్బంది కావటంతో రోగులకు సేవలు కరువయ్యాయి. ఐదేళ్ళ క్రితం తుళ్ళూరు పీహెచ్‌సీలో పని చేసిన వైద్య సిబ్బందితో పొన్నెకల్లులో నూతనంగా ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేశారు.ఎక్కువమంది ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బందిని డెప్యూటేషన్‌పై ఇక్కడ నియమించారు. దీంతో వైద్య సిబ్బంది పొరుగు ప్రాంతాల నుంచి విధులకు హాజరు కావట్లేదు. ఇది రోగులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటివరకు మెడికల్ అధికారి పోస్టు భర్తీ కాలేదు. డెప్యూటేషన్‌పై డాక్టర్ ఎన్. దివ్యశ్రీ రోజూ ఆస్పత్రిలో ఓపీ చూసుకుంటూ అదనంగా 104 వాహనం ద్వారా సేవలు అందించేందుకు ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. ఇలా రెండు వైపులా విధులు నిర్వహించటం ఇబ్బందిగా మారింది. అలాగే, సీహెచ్‌వో, ఫార్మసిస్ట్‌లు కూడా డెప్యూటేషన్లపై వచ్చి ఇక్కడ సేవలందిస్తున్నారు.
డీడీవో కోడ్ రాకపోవటంతో..
ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేసి ఐదేళ్ళు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి డీడీవో (డిస్పర్స్‌మెంట్ డ్రాయింగ్ ఆఫీసర్) కోడ్ రాలేదు. దీంతో అందరూ డెప్యూటేషన్‌పైనే వచ్చిన వారు కావటంతో సకాలంలో సేవలు అందించలేకపోతున్నారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకున్నా సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. కొన్నాళ్లుగా తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డ్రాయింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీడీఓ కోడ్ అమల్లోకి తెస్తే పోస్టులు భర్తీ చేసి మండల ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందుతాయని పలువురు భావిస్తున్నారు.
వైద్య సేవలకు ఆటంకమైన ‘కోడ్’
Published Thu, Jan 14 2016 12:19 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement