Depyutesan
-
టీటీడీలో డెప్యుటేషన్ల గోల
ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లను తీసుకోవడంపై అసంతృప్తి ప్రమోషన్లు ఆగిపోతాయని ఆలయ ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగుల ఆవేదన ప్రతినెలా టీటీడీకి రూ.లక్షల్లో నష్టం టీటీడీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విభాగంలో ఇంజినీర్ల కొరత లేకున్నా డెప్యుటేషన్‌పై ఎస్పీడీసీఎల్(సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్) నుంచి తీసుకొస్తుండడమే దీనికి కారణం. ఇలా చేస్తే తమకు ప్రమోషన్లు ఆగిపోవడమేగాక టీటీడీ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. సాక్షి: టీటీడీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం కీలకమైంది. ఈ విభాగంలో 55 మంది ఇంజినీర్లు, పెద్ద సంఖ్యలో కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. వీరిని కాదని ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈఈలను డెప్యుటేషన్‌పై తీసుకురావడంపై ఆ శాఖ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్న వారితోనే పని చేయించుకోలేని అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులను తెచ్చుకొని ఏం సాధిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీపై అదనపు భారం తప్పితే లాభమేమీ ఉండదని పలువురు అంటున్నారు. డెప్యుటేషన్‌పై వచ్చిన వారివల్ల ఉన్న వారికి ప్రమోషన్లు ఆగిపోయి గంగదరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్న వాదన వినిపిస్తోంది. సౌరవిద్యుత్ ప్లాంటు నిర్వహణ కోసమే.. టీటీడీ అవసరాల కోసం తంబళ్లపల్లి వద్ద 5.25 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రాన్ని బీవోటీ పద్ధతిలో నిర్మించతలపెట్టింది. దీన్ని ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. 20 సంవత్సరాల తర్వాత విద్యుత్ ప్రాజెక్టును టీటీడీకి అప్పగించేలా ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు ప్రైవేటు కంపెనీనే ఈ ప్రాజెక్టును నిర్వహించాలి. టీటీడీకి ఏ మాత్రమూ సంబంధం ఉండదు. ఈ ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసి సౌరవిద్యుత్ ప్లాంటు కోసం ఎస్పీడీసీఎల్ నుంచి ఇంజినీర్లను డెప్యుటేషన్‌పై తీసుకుంటుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న ఒక డీఈకి కొండపై బాధ్యతలు అప్పగించారు. టీటీడీ ఆధ్వర్యంలోని వేదిక్ యూనివర్సిటీలో డెప్యుటేషన్‌పై వచ్చిన ఏఈఈకి బాధ్యతలు అప్పగించింది. ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లకు టీటీడీ ఇంజినీర్ల కన్నా పది శాతం జీతాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రతినెలా టీటీడీకి లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. ఈవోను తప్పుదోవ పట్టిస్తున్నారా..? టీటీడీలోని ఇంజినీరింగ్ ఉద్యోగుల సామర్థ్యం సరిగాలేదంటూ ఉన్నతాధికారులు ఈవో సాంబశివరావును తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆ ఉన్నతాధికారుల వల్లనే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డెప్యుటేషన్‌పై ఇంజినీరింగ్ విభాగంలోకి ఎక్కు వ మంది వస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాంటి సామర్థ్యమూ లేకుండానే పది మెగావాట్ల విండ్పవర్ను ఉత్పత్తి చేస్తున్నామా అని ప్రశ్నిస్తున్నారు. ప్రమోషన్లు ఆగిపోతాయి.. డెప్యుటేషన్‌పై ఎక్కువ మంది అధికారులను అరువు తెచ్చుకోవడం వల్ల ఇక్కడ ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని టీటీడీ ఇంజినీర్లు వాపోతున్నారు. సాధార ణ పనికి కూడా ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లను తెచ్చుకోవడం వల్ల తమకు ఉద్యోగోన్నతులు ఆగిపోతాయని అంటున్నారు. దీనిపై ఈవో ఆలోచించాలని కోరుతున్నారు. -
ఏడుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు
చిత్తూరు: జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉట్టిపడుతున్నా ఆ పాఠశాలలో మాత్రం దాదాపు విద్యార్థుల సంఖ్యకు సమానంగా టీచర్లను నియమిస్తుంటారు. అందరికీ తెలిస్తే బాగుండదని అందులో కొందర్ని డెప్యుటేషన్‌పై అదే మండలంలోని ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తుంటారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది ఎక్కడ.. ఎందుకు అనుకుంటున్నారా?.. అయితే మీరే చదవండి..! కలకడ మండలం కె.దొడ్డిపల్లెలో మొత్తం 60 కుటుంబాలుంటాయి. ఇందులో బడికి వెళ్లే వారు 25 మందిదాకా ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలకు ఏడుగురే హాజరవుతున్నారు. రికార్డుల ప్రకారం 1వ తరగతిలో నలుగురు, 2వ తరగతిలో నలుగురు, 3వ తరగతిలో-1, 5వ తరగతిలో-2, 6వ తరగతిలో-2, 7వ తరగతిలో 4 ఉన్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏడుగురికి ఐదుగురు ఉపాధ్యాయులు ప్రస్తుతం పాఠశాలకు హాజరవుతున్న ఏడుగురి విద్యార్థులకు ఐదుగురు టీచర్లను నియమించారు. మంగళవారం మొత్తం ఎనిమిది మంది హాజరుకాగా అందులో ఓ విద్యార్థి అంగన్వాడీకి చెందింది కావడం గమనార్హం. దుస్థితిలో పాఠశాల భవనం పాఠశాల భవనం దుస్థితికి చేరింది. చినుకుపడితే గొడలు నెమ్మెక్కుతుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపడం మానేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆరుగుర్ని ప్రయివేటు పాఠశాలకు పంపుతున్నట్టు తెలిసింది. మొదట్నుంచీ అంతే నాలుగేళ్లుగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్నట్టు సమాచారం. గత ఏడాది 14 మంది విద్యార్థులకు గాను ఏడుగురు ఉపాధ్యాయుల్ని నియమించారు. వీరిలో కొందర్ని డెప్యూటేషన్‌పై పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఐదుగురు ఉపాధ్యాయుల్ని నియమించి, అందులో ఇద్దర్ని ఇతర పాఠశాలకు పంపాల్సి వచ్చింది. విద్యార్థుల సంఖ్య పెరగకుంటే పాఠశాల మూసివేస్తామని విద్యాధికారులు చెబుతున్నట్టు సమాచారం. విద్యార్థుల సంఖ్య పెంచుతాం పాఠశాలలో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. అలాగే మరో పది మందిని చేర్పించేందుకు తల్లిదండ్రులతో చర్చలు జరుపుతున్నాం. బడిపిలుస్తోంది కార్యక్రమం ముగిసేలోపు మరింత మందిని చేర్పిస్తాం. - శ్రీనివాసులురెడ్డి, ప్రధానోపాధ్యాయుడు. -
వైద్య సేవలకు ఆటంకమైన ‘కోడ్’
డెప్యూటేషన్ సిబ్బందితో నెట్టుకొస్తున్న పొన్నెకల్లు ఆరోగ్య కేంద్రం తాడికొండ : మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు అందరూ డెప్యూటేషన్లపై వచ్చిన వైద్య సిబ్బంది కావటంతో రోగులకు సేవలు కరువయ్యాయి. ఐదేళ్ళ క్రితం తుళ్ళూరు పీహెచ్సీలో పని చేసిన వైద్య సిబ్బందితో పొన్నెకల్లులో నూతనంగా ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేశారు.ఎక్కువమంది ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బందిని డెప్యూటేషన్‌పై ఇక్కడ నియమించారు. దీంతో వైద్య సిబ్బంది పొరుగు ప్రాంతాల నుంచి విధులకు హాజరు కావట్లేదు. ఇది రోగులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటివరకు మెడికల్ అధికారి పోస్టు భర్తీ కాలేదు. డెప్యూటేషన్‌పై డాక్టర్ ఎన్. దివ్యశ్రీ రోజూ ఆస్పత్రిలో ఓపీ చూసుకుంటూ అదనంగా 104 వాహనం ద్వారా సేవలు అందించేందుకు ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. ఇలా రెండు వైపులా విధులు నిర్వహించటం ఇబ్బందిగా మారింది. అలాగే, సీహెచ్‌వో, ఫార్మసిస్ట్‌లు కూడా డెప్యూటేషన్లపై వచ్చి ఇక్కడ సేవలందిస్తున్నారు. డీడీవో కోడ్ రాకపోవటంతో.. ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేసి ఐదేళ్ళు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి డీడీవో (డిస్పర్స్‌మెంట్ డ్రాయింగ్ ఆఫీసర్) కోడ్ రాలేదు. దీంతో అందరూ డెప్యూటేషన్పైనే వచ్చిన వారు కావటంతో సకాలంలో సేవలు అందించలేకపోతున్నారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకున్నా సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. కొన్నాళ్లుగా తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డ్రాయింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీడీఓ కోడ్ అమల్లోకి తెస్తే పోస్టులు భర్తీ చేసి మండల ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందుతాయని పలువురు భావిస్తున్నారు. -
తమిళనాడు, కర్ణాటకలో టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్లు
సాక్షి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంలో వ్యూహం మార్చి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడిషనల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(విజిలెన్స్) మురళీకృష్ణ, చిత్తూరు ఎస్పీ కాంతిరాణటాటా, అర్బన్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, సీఎఫ్‌వో రవికుమార్, ఓఎస్డీ ఉదయ్‌కుమార్ పాల్గొన్న సమా వేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తిరుపతి వైల్డ్‌లైఫ్ సీఎఫ్‌వో కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక నుంచి అడవిలో స్థానిక పోలీ సులు, స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీ శాఖ రేం జర్లు, గార్డుల ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహిస్తారు. అడవికి వెలుపల జరిగే ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలోనూ, స్మగ్లర్ల పని పట్టడంలోనూ టాస్క్‌ఫోర్స్‌ను చురుకుగా పనిచేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి కూలీలను పంపిస్తున్నదెవరు, వీరి వెనుక ఉన్న బడా వ్యక్తులెవరు, ఎర్రచందనం అమ్ముకుని కోట్లు దండుకుంటున్న అసలు స్మగ్లర్లు ఎవరు అనే దానిపై టాస్క్‌ఫోర్స్ దృష్టి సారించనుంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్, కోలార్ జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వారిపైనా దాడులు చేసేందుకు బృందాలను పంపనున్నారు. టాస్క్‌ఫోర్స్‌కు ఐదు వాహనాలను, కార్యాలయాన్ని, మినిస్టీరియల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులు సూచించారు. టాస్క్‌ఫోర్స్‌కు అదనపు బలగాలు ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌లో నలుగురు రేంజర్లు, ఒక డీఎఫ్‌వో, నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు అదనపు ఎస్పీ క్యాడర్లోని సీనియర్ డీఎస్పీ ఉదయ్‌కుమార్ నేతృత్వంలో పనిచేస్తున్నారు. వీరికి పనిలో సహకరించేందుకు 25 మంది సాయుధ పోలీసులను తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్ముడు రిజర్వు నుంచి కేటాయించారు. ప్రత్యేకంగా ఆయుధాలు సమకూర్చారు. టాస్క్‌ఫోర్స్‌ను రెండు మూడు బృందాలుగా విడగొట్టి తమిళనాడు, కర్ణాటకలో ఎర్రచందనం స్మగ్లర్ల వేట కొనసాగించేందుకు వీలుగా అదనపు సాయుధ పోలీసులను కేటాయించాలని నిర్ణయించారు. చిత్తూరు, కడప జిల్లాల నుంచి పది మంది చొప్పున సాయుధ పోలీసులను డెప్యూటేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌కు సమకూర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వోలు శ్రీనివాసులు, శ్రీనివాసులురెడ్డి, నాగార్జునరెడ్డి, పవన్‌కుమార్, ఎఫ్ఆర్వోలు రామ్లనాయక్, కృష్ణయ్య, ప్రసాద్, స్ట్రయికింగ్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.