టీటీడీలో డెప్యుటేషన్‌ల గోల
ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లను తీసుకోవడంపై అసంతృప్తి
ప్రమోషన్లు ఆగిపోతాయని ఆలయ ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగుల ఆవేదన
ప్రతినెలా టీటీడీకి రూ.లక్షల్లో నష్టం
టీటీడీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విభాగంలో ఇంజినీర్ల కొరత లేకున్నా డెప్యుటేషన్‌పై ఎస్పీడీసీఎల్(సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్) నుంచి తీసుకొస్తుండడమే దీనికి కారణం. ఇలా చేస్తే తమకు ప్రమోషన్లు ఆగిపోవడమేగాక టీటీడీ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు.
సాక్షి: టీటీడీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం కీలకమైంది. ఈ విభాగంలో 55 మంది ఇంజినీర్లు, పెద్ద సంఖ్యలో కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. వీరిని కాదని ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈఈలను డెప్యుటేషన్‌పై తీసుకురావడంపై ఆ శాఖ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్న వారితోనే పని చేయించుకోలేని అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులను తెచ్చుకొని ఏం సాధిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీపై అదనపు భారం తప్పితే లాభమేమీ ఉండదని పలువురు అంటున్నారు. డెప్యుటేషన్‌పై వచ్చిన వారివల్ల ఉన్న వారికి ప్రమోషన్లు ఆగిపోయి గంగదరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్న వాదన వినిపిస్తోంది.
సౌరవిద్యుత్ ప్లాంటు నిర్వహణ కోసమే..
టీటీడీ అవసరాల కోసం తంబళ్లపల్లి వద్ద 5.25 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రాన్ని బీవోటీ పద్ధతిలో నిర్మించతలపెట్టింది. దీన్ని ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. 20 సంవత్సరాల తర్వాత విద్యుత్ ప్రాజెక్టును టీటీడీకి అప్పగించేలా ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు ప్రైవేటు కంపెనీనే ఈ ప్రాజెక్టును నిర్వహించాలి. టీటీడీకి ఏ మాత్రమూ సంబంధం ఉండదు. ఈ ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసి సౌరవిద్యుత్ ప్లాంటు కోసం ఎస్పీడీసీఎల్ నుంచి ఇంజినీర్లను డెప్యుటేషన్‌పై తీసుకుంటుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న ఒక డీఈకి కొండపై బాధ్యతలు అప్పగించారు. టీటీడీ ఆధ్వర్యంలోని వేదిక్ యూనివర్సిటీలో డెప్యుటేషన్‌పై వచ్చిన ఏఈఈకి బాధ్యతలు అప్పగించింది. ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లకు టీటీడీ ఇంజినీర్ల కన్నా పది శాతం జీతాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రతినెలా టీటీడీకి లక్షల్లో నష్టం వాటిల్లుతోంది.
ఈవోను తప్పుదోవ పట్టిస్తున్నారా..?
టీటీడీలోని ఇంజినీరింగ్ ఉద్యోగుల సామర్థ్యం సరిగాలేదంటూ ఉన్నతాధికారులు ఈవో సాంబశివరావును తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆ ఉన్నతాధికారుల వల్లనే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డెప్యుటేషన్‌పై ఇంజినీరింగ్ విభాగంలోకి ఎక్కు వ మంది వస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఎలాంటి సామర్థ్యమూ లేకుండానే పది మెగావాట్ల విండ్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తున్నామా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రమోషన్లు ఆగిపోతాయి..
డెప్యుటేషన్‌పై ఎక్కువ మంది అధికారులను అరువు తెచ్చుకోవడం వల్ల ఇక్కడ ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని టీటీడీ ఇంజినీర్లు వాపోతున్నారు. సాధార ణ పనికి కూడా ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లను తెచ్చుకోవడం వల్ల తమకు ఉద్యోగోన్నతులు ఆగిపోతాయని అంటున్నారు. దీనిపై ఈవో ఆలోచించాలని కోరుతున్నారు.