సాక్షి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంలో వ్యూహం మార్చి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడిషనల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(విజిలెన్స్) మురళీకృష్ణ, చిత్తూరు ఎస్పీ కాంతిరాణటాటా, అర్బన్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, సీఎఫ్‌వో రవికుమార్, ఓఎస్డీ ఉదయ్‌కుమార్ పాల్గొన్న సమా వేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తిరుపతి వైల్డ్‌లైఫ్ సీఎఫ్‌వో కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక నుంచి అడవిలో స్థానిక పోలీ సులు, స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీ శాఖ రేం జర్లు, గార్డుల ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహిస్తారు.
అడవికి వెలుపల జరిగే ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలోనూ, స్మగ్లర్ల పని పట్టడంలోనూ టాస్క్‌ఫోర్స్‌ను చురుకుగా పనిచేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి కూలీలను పంపిస్తున్నదెవరు, వీరి వెనుక ఉన్న బడా వ్యక్తులెవరు, ఎర్రచందనం అమ్ముకుని కోట్లు దండుకుంటున్న అసలు స్మగ్లర్లు ఎవరు అనే దానిపై టాస్క్‌ఫోర్స్ దృష్టి సారించనుంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్, కోలార్ జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వారిపైనా దాడులు చేసేందుకు బృందాలను పంపనున్నారు. టాస్క్‌ఫోర్స్‌కు ఐదు వాహనాలను, కార్యాలయాన్ని, మినిస్టీరియల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులు సూచించారు.
టాస్క్‌ఫోర్స్‌కు అదనపు బలగాలు
ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌లో నలుగురు రేంజర్లు, ఒక డీఎఫ్‌వో, నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు అదనపు ఎస్పీ క్యాడర్‌లోని సీనియర్ డీఎస్పీ ఉదయ్‌కుమార్ నేతృత్వంలో పనిచేస్తున్నారు. వీరికి పనిలో సహకరించేందుకు 25 మంది సాయుధ పోలీసులను తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్ముడు రిజర్వు నుంచి కేటాయించారు. ప్రత్యేకంగా ఆయుధాలు సమకూర్చారు. టాస్క్‌ఫోర్స్‌ను రెండు మూడు బృందాలుగా విడగొట్టి తమిళనాడు, కర్ణాటకలో ఎర్రచందనం స్మగ్లర్ల వేట కొనసాగించేందుకు వీలుగా అదనపు సాయుధ పోలీసులను కేటాయించాలని నిర్ణయించారు. చిత్తూరు, కడప జిల్లాల నుంచి పది మంది చొప్పున సాయుధ పోలీసులను డెప్యూటేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌కు సమకూర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వోలు శ్రీనివాసులు, శ్రీనివాసులురెడ్డి, నాగార్జునరెడ్డి, పవన్‌కుమార్, ఎఫ్‌ఆర్వోలు రామ్లనాయక్, కృష్ణయ్య, ప్రసాద్, స్ట్రయికింగ్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.