చిత్తూరు: జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉట్టిపడుతున్నా ఆ పాఠశాలలో మాత్రం దాదాపు విద్యార్థుల సంఖ్యకు సమానంగా టీచర్లను నియమిస్తుంటారు. అందరికీ తెలిస్తే బాగుండదని అందులో కొందర్ని డెప్యుటేషన్‌పై అదే మండలంలోని ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తుంటారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది ఎక్కడ.. ఎందుకు అనుకుంటున్నారా?.. అయితే మీరే చదవండి..!
కలకడ మండలం కె.దొడ్డిపల్లెలో మొత్తం 60 కుటుంబాలుంటాయి. ఇందులో బడికి వెళ్లే వారు 25 మందిదాకా ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలకు ఏడుగురే హాజరవుతున్నారు. రికార్డుల ప్రకారం 1వ తరగతిలో నలుగురు, 2వ తరగతిలో నలుగురు, 3వ తరగతిలో-1, 5వ తరగతిలో-2, 6వ తరగతిలో-2, 7వ తరగతిలో 4 ఉన్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఏడుగురికి ఐదుగురు ఉపాధ్యాయులు
ప్రస్తుతం పాఠశాలకు హాజరవుతున్న ఏడుగురి విద్యార్థులకు ఐదుగురు టీచర్లను నియమించారు. మంగళవారం మొత్తం ఎనిమిది మంది హాజరుకాగా అందులో ఓ విద్యార్థి అంగన్‌వాడీకి చెందింది కావడం గమనార్హం.
దుస్థితిలో పాఠశాల భవనం
పాఠశాల భవనం దుస్థితికి చేరింది. చినుకుపడితే గొడలు నెమ్మెక్కుతుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపడం మానేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆరుగుర్ని ప్రయివేటు పాఠశాలకు పంపుతున్నట్టు తెలిసింది.
మొదట్నుంచీ అంతే
నాలుగేళ్లుగా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్నట్టు సమాచారం. గత ఏడాది 14 మంది విద్యార్థులకు గాను ఏడుగురు ఉపాధ్యాయుల్ని నియమించారు. వీరిలో కొందర్ని డెప్యూటేషన్‌పై పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఐదుగురు ఉపాధ్యాయుల్ని నియమించి, అందులో ఇద్దర్ని ఇతర పాఠశాలకు పంపాల్సి వచ్చింది. విద్యార్థుల సంఖ్య పెరగకుంటే పాఠశాల మూసివేస్తామని విద్యాధికారులు చెబుతున్నట్టు సమాచారం.
విద్యార్థుల సంఖ్య పెంచుతాం
పాఠశాలలో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. అలాగే మరో పది మందిని చేర్పించేందుకు తల్లిదండ్రులతో చర్చలు జరుపుతున్నాం. బడిపిలుస్తోంది కార్యక్రమం ముగిసేలోపు మరింత మందిని చేర్పిస్తాం. - శ్రీనివాసులురెడ్డి, ప్రధానోపాధ్యాయుడు.