రైతు బజార్ల పటిష్టానికి చర్యలు
అనంతపురం అగ్రికల్చర్: రైతు బజార్ల వ్యవస్థ పటిష్టానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పరిటాల సునీత, పౌర సంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌లో బియ్యం విక్రయ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ... తక్కువ ధరలకే నాణ్యమైన కూరగాయలతోపాటు, నిత్యావసర వస్తువులు అందించాలన్న లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుబజార్ నిరుపయోగంగా మారిందన్నారు. జిల్లా కేంద్రంతోపాటు మరో ఏడు మున్సిపాలిటీల్లో సోనామసూరి బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పల్లె మాట్లాడుతూ... వ్యవసాయశాఖ అనుబంధ శాఖలతో పాటు మార్కెటింగ్ అధికారుల సహకారంతో రైతుబజార్ వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. శాసనమండలి సభ్యుడు డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న రైతుబజార్‌ను మేజర్ మార్కెట్‌గా తీర్చిదిద్దడానికి మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్‌కళాశాల అనుబంధంగా ఉన్న వసతిగృహానికి రాయితీపై వంటగ్యాస్ అందించాలని కోరగా ఈ అంశాన్ని పరిశీలించాలని మంత్రి పరిటాల సునీత డీఎస్‌వోను ఆదేశించారు. రైతుబజార్ల సీఈఓ ఎంకే సింగ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న 80 రైతుబజార్లకు పూర్వవైభవం తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. ఓపెన్‌ఎయిర్ జైలులో ఖైదీలు పండించే పండ్లు, కూరగాయల ఉత్పత్తులు కూడా ఇక్కడే అమ్ముకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
బియ్యం నాణ్యతపై
మంత్రి అసంతృప్తి
కౌంటర్ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై మంత్రి సునీత నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మట్టిపెల్లలు, కొంచెం పురుగు పట్టిఉండటాన్ని గమనించారు. నాణ్యతపై రాజీపడవద్దంటూ బియ్యం సరఫరా చేసే రైస్‌మిల్లర్ల అసోసియేషన్, మండీమర్చంట్ అసోసియేషన్ నాయకులకు సూచించారు. సమావేశంలో సివిల్‌సప్ల్సై డీఎం వెంకటేశం, మార్కెటింగ్‌శాఖ ఆర్జేడీ సి.రామాంజినేయులు, ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కె.నీలకంఠరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ ఏడీలు సత్యనారాయణ, బీవీ రమణ, ఆర్డీవో హుస్సేన్, డీఎస్‌వో ఉమామహేశ్వర్‌రావు, తహశీల్దార్ లక్ష్మినారాయణ, సీఎస్‌డీటీలు తదితరులు పాల్గొన్నారు.
రైతు బజార్ అభివృద్ధిపై సమావేశం
రైతు బజార్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ‘ప్రాజెక్టు అనంత’ కార్యాలయంలో మంత్రులు, రైతుబజార్ల సీఈఓ, జేసీ , వ్యవసాయ అనుబంధ శాఖలు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమస్యలపై చర్చించారు.