బీసీ కమిషన్‌ చైర్మన్‌ రాజీనామా | BC Commission chairman was Resigned | Sakshi

బీసీ కమిషన్‌ చైర్మన్‌ రాజీనామా

Mar 24 2018 1:52 AM | Updated on Oct 9 2018 4:20 PM

BC Commission chairman was Resigned - Sakshi

సాక్షి, అమరావతి: బీసీ కమిషన్‌ చైర్మన్‌ కేఎల్‌ మంజునాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. తాను నిర్వర్తించాల్సిన పని పూర్తయినందున పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో పూర్తిగా విసిగిపోయి ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అప్పగించింది.

ఈ కమిషన్‌కు కేఎల్‌ మంజునాథ్‌ను చైర్మన్‌గా నియమించింది. అన్ని జిల్లాల్లోనూ బీసీ కమిషన్‌ పర్యటించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు పరిశీలించి, నివేదికను రూపొందించింది. నివేదికను కమిషన్‌ చైర్మన్‌ అధికారికంగా పంపించకముందే ఇది ముఖ్యమంత్రి చేతుల్లోకి వెళ్లింది. కమిషన్‌ సభ్యుల్లో తమకు అనుకూలురైన కొందరి చేత నివేదిక కాపీని చంద్రబాబు తెప్పించుకున్నారు. బీసీ కమిషన్‌కు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తన ఇష్టప్రకారమే వ్యవహరించారు. దీంతో కమిషన్‌ చైర్మన్‌ మంజునాథ్‌ కినుక వహించారు. అప్పటి నుంచి కార్యాలయానికి కూడా రాలేదు. ముఖ్యమంత్రి నుంచి అవమానాలు ఎదురుకావడంతోపాటు ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషన్‌ సభ్యులు తనను లక్ష్యపెట్టకపోవడంతో మంజునాథ్‌ ఆవేదనకు గురై చివరకు పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. విలువ లేని కమిషన్‌కు చైర్మన్‌గా కొనసాగడం వ్యర్థమని ఆయన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. 

నాకు కొన్ని విలువలు ఉన్నాయి: మంజునాథ్‌ 
పని లేకుండా జీతం తీసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశానని కేఎల్‌ మంజునాథ్‌ చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీ కమిషన్‌ పని డిసెంబర్‌లోనే పూర్తయిందని, అప్పటివరకే జీతం తీసుకున్నానని వెల్లడించారు. రెండేళ్లపాటు విధి నిర్వహణలో ఉన్నట్లు తెలిపారు. నివేదికను ప్రభు త్వానికి ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించగా... తాను మెంబర్‌ సెక్రటరీ కి ఇచ్చానని, అంటే తన పని పూర్తయినట్లేనని పేర్కొన్నారు. కమిషన్‌ సభ్యులు కొనసాగుతారా? వారు కూడా రాజీనామా చేస్తారా? అని అడగ్గా... ఆ విషయం నాకు తెలియదన్నారు. వారు కొనసాగాలనుకుంటే కొనసాగవచ్చని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement