మంజునాథా.. విను మా గాథ
-
బీసీ రిజర్వేషన్ల కమిషన్ ఎదుట వాదనలు వినిపించిన బీసీలు, కాపులు
-
అడుగడుగునా ఆందోళనలు.. ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ
ఏలూరు (మెట్రో) :
తమను బీసీ జాబితాలో చేర్చి, తమ కులస్తులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కాపులు, వారిని బీసీ జాబితాలో చేర్చడానికి వీల్లేదని బీసీలు రాష్ట్ర బీసీ కమిషన్ ఎదుట వాదనలు వినిపించారు. ఎవరికి వారు సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నామంటూ కమిషన్‌కు గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర బీసీ కమిషన్ బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. వెనుకబడిన తరగతుల జాబితాలో మార్పులు, చేర్పులపై వివిధ కులాల వారినుంచి వినతులు స్వీకరించింది. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, కమిషన్ చైర్మన్, సభ్యులు బీసీ నాయకుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్నవారి నుంచి గ్రూపుల మార్పునకు సంబంధించి అభిప్రాయాలు సేకరించారు.
ముందుగా యాదవ, సగర, కృష్ణబలిజ, కొప్పుల వెలమ, పోలినాటి వెలమ, వడ్డీ, గవర, చాటాడ, శ్రీవైష్ణవ కులస్తులు తమను గ్రూపు బీసీ ఏ గ్రూపులోకి మార్చాలని కోరారు. గ్రూపు బీలో ఉన్న కరికాల భక్తులు, కైకోలన్లు తమను గ్రూపు ఏలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఎస్.యానాదయ్య మాట్లాడుతూ తాము సామాజికంగా వెనుకబడి ఉన్నామన్నారు. జిల్లా సగర సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడిశెట్టి గోపీరావు తమ కులం పేరును ఉప్పర నుంచి సగరగా మార్పు చేయాలని కోరారు. యాదవ సంక్షేమ సంఘ నాయకుడు కె.సూర్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ తమ గ్రూపు మార్పు చేసి ఆర్థికంగా చేయూత అందించాలని కోరారు. వీటిపై అభ్యంతరాలు తెలుసుకున్న చైర్మన్ అనంతరం కాపులు బీసీ జాబితాలో ఎందుకు చేర్చాలని కోరుతున్నారనే అంశంపై ఆ సామాజిక వర్గం నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
కాపు నాయకులు ఏమన్నారంటే..
కాపు నాయకులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ మాట్లాడుతూ కాపులుగా పేరు గొప్పగా ఉన్నప్పటికీ విద్యాపరంగాను, ఆర్థికంగాను కాపులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని కోరారు. జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక పరంగా కాపులు వెనుకబాటులో ఉన్నారన్నారని కమిషన్‌కు తెలిపారు. సరైన వృత్తులు లేకపోవడం వల్ల కాపు మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బోడ నవీన్ మాట్లాడుతూ కాపులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కురెళ్ల రాంప్రసాద్ మాట్లాడుతూ కాపుల్లో అత్యధికులు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారని, ఆ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దృష్టా‍్య కాపులు పేదరికంలో మగ్గుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర హస్తకళల చైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ కాపులు వెనుకబాటునుంచి బయటపడాలంటే బీసీ జాబితాలో చేర్చాలని కోరారు. కాపుల తరఫున ఆరేటి ప్రకాష్, న్యాయవాది నరహరశెట్టి శ్రీహరి తదితరులు వాదనలు వినిపించారు.
బీసీ నాయకులు ఏమన్నారంటే..
కాపులు అన్నిఽవిధాలుగా అభివృద్ది చెందారని, సామాజికంగా వారు ఎటువంటి అసమానతలను ఎదుర్కొనలేదని, సామాజికంగా వెనకబడని వారిని బీసీలలో చేర్చడం సరికాదని బీసీల తరఫున న్యాయవాది రంగారావు వాదన వినిపించారు. కృష్ణదేవరాయుల వారసులుగా ఏ రంగంలో చూసినా కాపులదే ఆధిపత్యం ఉందన్నారు. బీసీ నాయకుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేరిస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కడియాల సూర్యనారాయణ మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేరిస్తే తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. దళిత మహాసభ నాయకుడు చింతపల్లి గురుప్రసాద్ మాట్లాడుతూ అందరూ బీసీల జాబితాలో చేరతామంటే తమకు ఓసీ జాబితా కేటాయించి భూములను జాతీయం చేసి పేదలకు పంపిణీ చేయాలన్నారు.
రాష్ట్ర గంగిరెద్దుల కులస్తుల సమాఖ్య అధ్యక్షుడు యడ్లపల్లి చినమోరయ్య మాట్లాడుతూ తమను అభివృద్ధి చేయాలని, తమ బతుకులకు వెలుగునివ్వాలని కోరారు. బీసీ సబ్‌ప్లాన్ సాధన పోరాట వేదిక జిల్లా కమిటీ కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ అన్నిరంగాల్లో అగ్రభాగాన ఉన్న కాపులను బీసీ జాబితాలో చేర్చవద్దన్నారు. బీసీ జాబితాలో వివిధ కులాలకు చెందిన నాయకులు, కాపు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వీరినుంచి వినతులు స్వీకరించిన బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ముగించింది.