ఆర్డర్‌.. ఆర్డర్‌ | order order | Sakshi
Sakshi News home page

ఆర్డర్‌.. ఆర్డర్‌

Published Tue, Nov 29 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

ఆర్డర్‌.. ఆర్డర్‌

ఆర్డర్‌.. ఆర్డర్‌

 బీసీ రిజర్వేషన్లపై భేటీ కానున్న మంజునాథ కమిషన్‌ 
 వాదనలు వినిపించేందుకు సిద్ధమైన కాపులు, బీసీలు
 తమ వారికి బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటున్న కాపు సంఘాలు
 ససేమిరా వద్దుంటున్న బీసీ సంఘాలు
 భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ కమిషన్‌ మంగళవారం ఏలూరు చేరుకుంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే విషయమై ఇరువర్గాల వాదనలను వినేందుకు కమిషన్‌ చైర్మన్‌ మంజునాథ, సభ్యులు బుధవారం ఉదయం జెడ్పీ సమావేశ మందిరంలో అందుబాటులో ఉంటారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అన్ని వర్గాల ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 1న క్షేత్రస్థాయిలో పర్యటించిన ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. వివిధ జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం వెళ్లిన మంజునాథ కమిషన్‌ ఎదుట కాపు, బీసీ సంఘాల వారు బల ప్రదర్శనకు దిగటంతో రసాభాస చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు జెడ్పీ సమావేశ మందిరం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
పోటాపోటీగా జన సమీకరణలు
కాపులకు గతంలో ఉన్న బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని, బీసీలకు నష్టం కలగకుండా ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతున్న కాపు సంఘాల నాయకులు ఇవే అంశాలను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు సమాయత్తమయ్యారు. జిల్లాలోని కాపులంతా కమిషన్‌ఎదుట హారజై వాదనలు వినిపించాలని కాపు సంఘాల నేతలు జిల్లా వ్యాప్తంగా విస్త్రత ప్రచారం చేశారు. కాపు జాతి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడి ఉన్న విషయాన్ని వివరించాలని, గతంలో ఽకాపులకు ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరించాలనే వాదన గట్టిగా వినిపించాలని సూచనలు ఇచ్చారు. బీసీలకు అన్యాయం జరగకుండా అదనపు రిజర్వేషన్లు ఇవ్వాలని కాపు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపులు పడుతున్న ఇబ్బందులు, వెనుకబాటుతనంపై పూర్తి వివరాలతో వాదనలు వినిపించేందుకు నేతలు సన్నద్ధమయ్యారు. తాము కొత్తగా రిజర్వేషన్‌ కోరడం లేదని, స్వాతంత్రం రాకముందే ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు, తూర్పు కాపులు బీసీ జాబితాలో ఉండేవారి గుర్తు చేస్తున్నారు. రిజర్వేషన్‌ వల్ల మిగిలిన వెనుకబడిన కులాలు చాలా ముందుకు వచ్చాయని, కాపులు మాత్రం వెనుకబడిపోయారని కాపు నేతలు లెక్కలతో సహా చెబుతున్నారు.
 
బీసీ సంఘాల ’చలో ఏలూరు’
మరోవైపు బీసీ సంఘాల పెద్దలు తమ వాదనలు కమిటీ వినేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని కమిషన్‌ను కోరుతున్నారు. కమిటీ ముందుకు అన్నివర్గాలు ఒకేసారి రావడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి తమకు విడివిడిగా సమయం కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలుపొందడం కోసం 2014 ఎన్నికల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని వాగ్దానమిచ్చి బీసీలకు ద్రోహం చేశారని, రెండున్నరేళ్లు గడిచినా ఆయన హామీ నెరవేర్చలేదంటూ కాపులు హింసాయుతంగా ఆందోళన చేస్తే భయపడి రూ.వెయ్యి కోట్లతో కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని బీసీ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విజయవాడలో మొదటిసారి మంజునాథ కమిషన్‌ పర్యటించినప్పుడు జిల్లా నుంచి భారీస్థాయిలో బీసీలు తరలివెళ్లి తమ వాదన వినిపించారు. ఈసారి కూడా తమ వాదనను గట్టిగా వినిపించేందుకు సన్నద్ధం అవుతున్నారు. కాపుల రిజర్వేషన్‌ కోసం ముద్రగడ పద్మనాభం చేయతలపెట్టిన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, కాపులపై నిఘా పెట్టడంతో కాపులు మరోవైపు ప్రభుత్వ తీరుపై రగులుతున్నారు. ఈ నేపథ్యంలో మంజునాథ కమిషన్‌ ఏలూరు రాగా, ఎవరికి వారు తమ వాదనల్ని బలంగా వినిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement