వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సామాజిక, రాజకీయ, ఆత్మగౌరవ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచిన పోరుఖిల్లా... తాజాగా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు సన్నద్ధమవుతోంది. వెనుకబడిన వర్గాలకు సమానత్వం, సాధికారతే లక్ష్యంగా డిక్లరేషన్ చేసేందుకు ఓరుగల్లు కేంద్రంగా నిలవనుంది. మహాత్మా జ్యోతిరావు పూలే అకాడమీ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాస్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ (ఏబీసీడీఈ) వరంగల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి సమావేశానికి ఆతిథ్యమిచ్చేందుకు ముస్తాబవుతోంది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో జరిగే సమావేశంలో మెజార్టీ జనాభా ఉన్న బీసీలు ఆరున్నర దశాబ్దాలుగా ఎలా మోసపోతున్నారు... అభివృద్ధి ఫలాల్లో వాటా... రాజ్యాధికారంలో భాగం... వృత్తుల విధ్వంసం, ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార కులాలకు చెందిన వారు విద్యకు, ఉపాధికి దూరమవుతున్న తీరు... వంటి అంశాలపై మేధావులు, ప్రముఖులు చర్చించనున్నారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో బీసీలు తమ హక్కులు, సమానత్వ సాధనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. అంతేకాకుండా పలు అంశాలపై సదస్సులు, చర్చాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఈ మేరకు వివిధ యూనివర్సిటీలు, న్యాయవ్యవస్థ, అధికార రంగంలో ఉన్న మేధావులు, బీసీ సంఘాల నాయకులు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఏబీసీడీఈ అధ్యక్షుడు, ప్రొఫెసర్ మురళీమనోహర్ తెలిపారు.
బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ ఎంఎన్ రావు సమావేశాన్ని ప్రారంభించనున్నారని, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బీసీ నేతలు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు పొన్నం, మధుయాష్కీ, రాపోలు ఆనందభాస్కర్, దేవేందర్‌గౌడ్, సుధారాణి, కేశవరావు, ఈటెల రాజేందర్, వినయ్, దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు బీసీ సామాజిక సంఘాల నేతలు ఉ.సాంబశివరాం, వై. కోటేశ్వర్‌రావు తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాలోన్లి పరిశోధకులకు సైతం ఆహ్వానం పలికినట్లు వెల్లడించారు. సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు శుక్రవారం పరిశీలించారు.
బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం
బీసీలకు అన్ని రంగాల్లో జరిగిన అన్యాయంపై ఈ సమావేశంలో చర్చిస్తాం. ఇప్పటివరకు అధికారం, వనరులు, పెట్టుబడి, ఉత్పత్తి, చివరకు పంపిణీ కూడా ఒక వర్గానికే జరిగింది. అగ్రకులాల వారికి అనుకూలంగా విధానాలు మార్చుకున్నారు. 50 శాతంగా ఉన్న బీసీ జనాభాకు జరుగుతున్న అన్యాయంపై చర్చిస్తాం. విద్య, ఉద్యోగ, ఆరోగ్యం, వైద్యం, సేవా రంగాలు, వలసలు.. ఇలా అన్ని అంశాలపై ప్రణాళికలకు రూపకల్పన చేస్తాం. బీసీలకు పోరాట కార్యక్రమాన్ని అందజేసేందుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నా.
- ప్రొఫెసర్ మురళీమనోహర్, ఏబీసీడీఈ అధ్యక్షుడు
బీసీ డిక్లరేషన్
Published Sat, Sep 14 2013 5:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement