backward caste
-
ఏపీలో బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదని, అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బిహార్ మాజీ సీఎం బీపీ మండల్ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ మండల్ చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఆ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించడం శుభపరిణామమని చెప్పారు. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీసీలతో మహాధర్నా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్ కమిషన్ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు సహా.. కులాల వారీగా జనాభా ఎంత ఉందో స్పష్టత వచ్చేలా జనగణన చేయాలన్నారు. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఆ దిశగానే వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారన్నారు. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానంతో ఫీజులు పెరిగి పోవడం వల్ల కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలు చదువుకోవడంకష్టమేనన్నారు. జనాభా లెక్కలు తేల్చకుండా కేంద్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసిందని విమర్శించారు. చదవండి: కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు: రేవంత్ రెడ్డి -
Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు
సాక్షి, హైదరాబాద్: బీసీ వర్గాలలోని కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కులవృత్తులు చేసుకునేవారు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకునేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది. గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈనెల 20 వరకు https://tsobmmsbc.cgg. gov. in వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వీటిని ఆయా జిల్లాల యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 9న మంచిర్యాలలో ప్రారంభించనున్నారు. అదేరోజు నుంచి లబ్దిదారులుగా ఎంపికైన వారికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో అందించనున్నారు. వెనుకబడిన వర్గాలలో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి వచి్చన పథకమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అని గంగుల అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు పాల్గొన్నారు. బీసీల్లోని ఎన్ని వర్గాలకు? వెనుకబడిన వర్గాలలో కులాలను బట్టి చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వపరంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశం. బీసీ కులాల్లో లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులదే తుది నిర్ణయం. బీసీ వర్గాలలో కుల, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఓ అధికారి తెలిపారు. చదవండి: మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక ఇవీ అర్హతా నిబంధనలు ►ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ►ఈ పథకం కింద లబి్ధపొందగోరే వారు గ్రామాల్లో అయితే లక్షన్నర మేరకు, పట్టణాల్లో రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితిని కలిగి ఉండాలి. ►దరఖాస్తు చేసుకునే వారి వయసు 18–55 ఏళ్ల మధ్య ఉండాలి. ►గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కింద రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు అనర్హులు. -
బహుజన కులాల మద్దతుతోనే...
తొంభై ఎనిమిది ఏండ్ల కింద 1924 సంవత్సరంలో ఒకే వృత్తి, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయం కలిగిన ఒకే కులం వారు ‘‘అఖిల భారత యాదవ మహాసభ’’గా ఏర్పడ్డారు. దేశంలోని ఇతర అణగారిన కులాలతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో ముందు భాగాన నిలిచారు. అనేక మంది వీరులను ఆ సమరానికి వారు అందిం చారు. యాదవ మహాసభ కృషి ఫలితం గానే బ్రిటిష్ పాలకులు 1931వ సంవత్సరంలో కుల గణన చేప ట్టాల్సి వచ్చిందన్నది నేడు గుర్తించాల్సిన విషయం. దాని ఫలితం గానే అట్టడుగు శ్రామిక కులాలవారు ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కలెక్టర్లుగా, న్యాయమూర్తులుగా ఎదిగి వచ్చారు. ముఖ్యంగా ఉత్తర భారతం నుంచి మొదలైన ఈ కల్చర్ అణగారిన కులాలను రాజకీయ బాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఫ్రెంచి విద్యావేత్త క్రిస్టాఫ్ జెప్ఫెర్లో మాటల్లో చెప్పాలంటే... ఇది అణగారిన కులాల్లో ఇంకా సమగ్ర స్వరూపాన్ని సంతరించుకోవాల్సిన ఒక నిశ్శబ్ద విప్లవం. నిజానికి అట్టడుగు కులాలు అధికారం పొందే స్థాయికి ఎదగడం అనేది సూటిగా సాగేది కాదు. అంతర్లీన క్రియాశీల ప్రక్రియ. ఆ రకంగా వచ్చిన అట్టడుగు కులాల చైతన్యం దుర్భేద్యమైన కాంగ్రెస్, ఇతర వారసత్వ రాజకీయాల కంచుకోటలను బద్దలు కొట్టింది. ఫలితంగానే వివిధ రాష్ట్రాల్లో అట్టడుగు కులాలు, అణగారిన జాతులు రాజ్యాధికారంలోకి రాగలిగాయి. ఇది స్వతంత్ర భారతంలో మరింత అభివృద్ధి అయిందని చెప్పవచ్చు. అయితే ఇదే సందర్భంలో ‘‘కుల సంఘాలు కుల నిర్మూలన కోసం పని చేయకుండా తమ స్వేచ్ఛను కోల్పోయి రాజకీయ పార్టీల వాడకానికి గురవుతున్నాయి.’’ ఏ అగ్రకులాధిపత్య, వారసత్వ రాజకీయాలను కూకటివేళ్ళతో పెకలించారో అలాంటి జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కోసమే, కులాలను సంఘటితం చేసే పనిముట్లుగా కుల సంఘాలు మారాయని చరిత్రకారుల విమర్శ కూడా ఉంది. సరిగ్గా ఇక్కడే కుల సంఘాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అణగారిన కులాలు అధికారం అందిపుచ్చుకోవడానికి ఆధిపత్య కులాలూ, పాలక వర్గాలూ అంత ఈజీగా అనుమతించవు. కాబట్టి ఆ పనిని చాప కింద నీరులా చేయాలి. రాజకీయ రంగం లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అణగారిన కులాల క్రియాశీలత మరింత పెంచుకోవాలి. అంటే శ్రామిక కులాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఒక ఉన్నత ఆశయంగా అర్థం చేసుకోవాలి. అది ఈ దేశంలో ఫూలే వెలుగులో ఛత్రపతి సాహూ మహరాజ్ లోతుగా అర్థం చేసుకున్నాడు. కనుకనే సమాజ మార్పుకు చదువే కీలకం అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన కుల వివక్ష మీద పోరాడటంతో పాటు కొల్హాపూర్ పట్టణంలో 1901లో జైన హాస్టల్, విక్టోరియా మరాఠ హాస్టల్, 1906లో ముస్లిం హాస్టల్, 1907లో వీరశైవ లింగాయత్ హాస్టల్, 1908లో అంటరాని వారికి, మరాఠాలకి హాస్టల్; దర్జీ, నేతన్నలకు 1921లో నాందేవ్ హాస్టల్, మరాఠాలకి హాస్టల్, విశ్వకర్మలకు సోనార్ హాస్టల్ నెలకొల్పి ఆయా కులాల నుంచి ఆ కాలంలోనే అట్టడుగు కులాలను ఎలైట్ సెక్షన్స్‌గా ఎదిగే విధంగా తోడ్పడ్డాడు. ఆ కోణంలోనే ఉత్తర భారతదేశంలో ‘యాదవ మహాసభ’ కృషి చేసింది. సాహూ మహరాజ్ నేతృత్వంలో జరిగిన కృషి ఫలితాలను తొందరగానే గ్రహించిన ఆధిపత్య కులాల వారైన రెడ్డి, కమ్మ, వెలమలూ... మరికొన్ని వెనకబడిన కులాల వారూ తెలుగు నేలపై సంఘాలుగా సంఘటితమై తమ తమ కులాల అభివృద్ధికి నడుం బిగించారు. హైదరాబాద్‌లో 1909 సంవత్సరంలో ‘యాదవ మహాజన సంఘం’, 1919లో ‘రెడ్డి సంఘం’, 1920లో ‘గౌడ సంఘం’, 1930లో ‘కమ్మ సంఘం’, నిజాం చివరి కాలంలో ‘వెలమ సంఘం’ ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా రెడ్డి సంఘం వారు ప్రత్యేకమైన ప్రణాళికతో పని చేశారు. ఆ జాతి విద్యా, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధికి రెడ్డి కుల స్థితిమంతులు విశేష కృషి చేశారు. ‘రెడ్డి హాస్టల్’ లాంటి వసతి గృహాన్ని ఏర్పాటు చేసి విద్యావంతుల్ని తయారుచేసి అధికారం అందుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఇది అందరికీ ఆదర్శం. (క్లిక్: దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!) ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు స్థితి మంతులుగా పెద్ద సంఖ్యలో ఉనప్పటికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వలన తమ హక్కులు పొందడంలో, రాజ్యాధికారం సాధించడంలో వెనుక బడిపోయారన్నది కాదనలేని సత్యం. కనుక వివిధ కుల సంఘాల వారు పై అనుభవాల్లోంచి లోతైన గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ కులానికి ఆ కులం ఎదిగే క్రమంలో మిగతా బహుజన కులాల మద్దతు కూడా తీసుకుంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. (క్లిక్: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) - చలకాని వెంకట్ యాదవ్ వ్యాసకర్త హైకోర్ట్ న్యాయవాది -
మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా?
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీల పట్ట బాబు చూపిస్తున్న కపట ప్రేమను విజయసాయిరెడ్డి ఎండగట్టారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించిన ఆయన..‘చంద్రబాబు.. బీసీలు నీ కంటికి మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా? అధికారం ఉన్నప్పుడు బీసీలను ఆమడ దూరంలో పెట్టిన నీవు.. ఇప్పుడు భూస్థాపితమైన పార్టీని మోయమని చెప్పడం ఏం న్యాయం? అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు నీవు చేసిన అన్యాయం ఇంకా సరిపోలేదనా? లేక భారానికి, అధికారానికి తేడా వాళ్ళకు తెలియదనా?’ అని ప్రశ్నించారు. (పురందేశ్వరిపై విమర్శనాస్త్రాలు...) అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు. వైఎస్సార్ చేయుత కింద లబ్ధి పొందిన మహిళల చేత 11,270 రిటైల్ అవుట్లెట్లు ప్రారభించినట్లు తెలిపారు. మొదటి దశలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో అమూల్ సహకారంతో త్వరలో పాల సేకరణ కేంద్రాలు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా లబ్ధి దారులు స్వయం ఉపాధి పొందనున్నట్లు పేర్కొన్నారు. (‘పంటల బీమాపై రైతులదే తుది నిర్ణయం’) -
బీసీ జాబితాలో మరో 30 కులాలు
సాక్షి, అంబర్‌పేట: వెనుకబడిన కులాల జాబితాలో మరో 30 కులాలను చేర్చేందుకు సమాయత్తమయ్యామని, కొత్తగా చేరే కులాలకు చెందిన వారికి ఏవైనా ఆక్షేపణలు ఉంటే జూలై 5లోపు తుది గడువుగా నిర్ణయించామని హైదరాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విమలాదేవి వెల్లడించారు. గురువారం అంబర్‌పేట గోల్నాకలోని బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టంలోని 9(1)వ విభాగం ద్వారా ఈ నెల 15న నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిన బీసీ జాబితాలోకి చేర్చే కులాల పేర్లను ఆమె వెల్లడించారు. కాకిపడగల, మందెచ్చెల సన్నాయోళ్లు/బత్తిన, మాసయ్యలు/ పటంవారు, సాధనశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవులవారు, గౌడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, సారోళ్లు, అరవ కోమటి, ఆహీర్ యాదవులు, గౌవిలి తదితర ముప్పై కులాలు వెనుకబడిన తరగతుల కులాల జాబితాలోకి చేరనున్నాయని ఆమె తెలిపారు. పైన పేర్కొన్న కులాలకు చెందిన వారు ఏవైనా ఆక్షేపణలు, అభ్యంతరాలతో పాటు సలహాలు, సూచనలు ఉంటే ఈ నెల 28 నుంచి జూలై 5 వరకు (సెలవు రోజులు మినహాయించి) హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయంలో అఫిడవిట్‌తో పాటు తగిన ఆధారాలతో తెలియపరచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు మురళి, వరలక్ష్మి, సుధాకర్, రాధాకిషోరి పాల్గొన్నారు. -
బీసీ డిక్లరేషన్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సామాజిక, రాజకీయ, ఆత్మగౌరవ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచిన పోరుఖిల్లా... తాజాగా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు సన్నద్ధమవుతోంది. వెనుకబడిన వర్గాలకు సమానత్వం, సాధికారతే లక్ష్యంగా డిక్లరేషన్ చేసేందుకు ఓరుగల్లు కేంద్రంగా నిలవనుంది. మహాత్మా జ్యోతిరావు పూలే అకాడమీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ (ఏబీసీడీఈ) వరంగల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి సమావేశానికి ఆతిథ్యమిచ్చేందుకు ముస్తాబవుతోంది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో జరిగే సమావేశంలో మెజార్టీ జనాభా ఉన్న బీసీలు ఆరున్నర దశాబ్దాలుగా ఎలా మోసపోతున్నారు... అభివృద్ధి ఫలాల్లో వాటా... రాజ్యాధికారంలో భాగం... వృత్తుల విధ్వంసం, ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార కులాలకు చెందిన వారు విద్యకు, ఉపాధికి దూరమవుతున్న తీరు... వంటి అంశాలపై మేధావులు, ప్రముఖులు చర్చించనున్నారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో బీసీలు తమ హక్కులు, సమానత్వ సాధనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. అంతేకాకుండా పలు అంశాలపై సదస్సులు, చర్చాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఈ మేరకు వివిధ యూనివర్సిటీలు, న్యాయవ్యవస్థ, అధికార రంగంలో ఉన్న మేధావులు, బీసీ సంఘాల నాయకులు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఏబీసీడీఈ అధ్యక్షుడు, ప్రొఫెసర్ మురళీమనోహర్ తెలిపారు. బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ ఎంఎన్ రావు సమావేశాన్ని ప్రారంభించనున్నారని, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బీసీ నేతలు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు పొన్నం, మధుయాష్కీ, రాపోలు ఆనందభాస్కర్, దేవేందర్‌గౌడ్, సుధారాణి, కేశవరావు, ఈటెల రాజేందర్, వినయ్, దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు బీసీ సామాజిక సంఘాల నేతలు ఉ.సాంబశివరాం, వై. కోటేశ్వర్రావు తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాలోన్లి పరిశోధకులకు సైతం ఆహ్వానం పలికినట్లు వెల్లడించారు. సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం బీసీలకు అన్ని రంగాల్లో జరిగిన అన్యాయంపై ఈ సమావేశంలో చర్చిస్తాం. ఇప్పటివరకు అధికారం, వనరులు, పెట్టుబడి, ఉత్పత్తి, చివరకు పంపిణీ కూడా ఒక వర్గానికే జరిగింది. అగ్రకులాల వారికి అనుకూలంగా విధానాలు మార్చుకున్నారు. 50 శాతంగా ఉన్న బీసీ జనాభాకు జరుగుతున్న అన్యాయంపై చర్చిస్తాం. విద్య, ఉద్యోగ, ఆరోగ్యం, వైద్యం, సేవా రంగాలు, వలసలు.. ఇలా అన్ని అంశాలపై ప్రణాళికలకు రూపకల్పన చేస్తాం. బీసీలకు పోరాట కార్యక్రమాన్ని అందజేసేందుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నా. - ప్రొఫెసర్ మురళీమనోహర్, ఏబీసీడీఈ అధ్యక్షుడు