తొంభై ఎనిమిది ఏండ్ల కింద 1924 సంవత్సరంలో ఒకే వృత్తి, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయం కలిగిన ఒకే కులం వారు ‘‘అఖిల భారత యాదవ మహాసభ’’గా ఏర్పడ్డారు. దేశంలోని ఇతర అణగారిన కులాలతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో ముందు భాగాన నిలిచారు. అనేక మంది వీరులను ఆ సమరానికి వారు అందిం చారు. యాదవ మహాసభ కృషి ఫలితం గానే బ్రిటిష్ పాలకులు 1931వ సంవత్సరంలో కుల గణన చేప ట్టాల్సి వచ్చిందన్నది నేడు గుర్తించాల్సిన విషయం. దాని ఫలితం గానే అట్టడుగు శ్రామిక కులాలవారు ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కలెక్టర్లుగా, న్యాయమూర్తులుగా ఎదిగి వచ్చారు. ముఖ్యంగా ఉత్తర భారతం నుంచి మొదలైన ఈ కల్చర్ అణగారిన కులాలను రాజకీయ బాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఫ్రెంచి విద్యావేత్త క్రిస్టాఫ్ జెప్ఫెర్లో మాటల్లో చెప్పాలంటే... ఇది అణగారిన కులాల్లో ఇంకా సమగ్ర స్వరూపాన్ని సంతరించుకోవాల్సిన ఒక నిశ్శబ్ద విప్లవం.
నిజానికి అట్టడుగు కులాలు అధికారం పొందే స్థాయికి ఎదగడం అనేది సూటిగా సాగేది కాదు. అంతర్లీన క్రియాశీల ప్రక్రియ. ఆ రకంగా వచ్చిన అట్టడుగు కులాల చైతన్యం దుర్భేద్యమైన కాంగ్రెస్, ఇతర వారసత్వ రాజకీయాల కంచుకోటలను బద్దలు కొట్టింది. ఫలితంగానే వివిధ రాష్ట్రాల్లో అట్టడుగు కులాలు, అణగారిన జాతులు రాజ్యాధికారంలోకి రాగలిగాయి. ఇది స్వతంత్ర భారతంలో మరింత అభివృద్ధి అయిందని చెప్పవచ్చు. అయితే ఇదే సందర్భంలో ‘‘కుల సంఘాలు కుల నిర్మూలన కోసం పని చేయకుండా తమ స్వేచ్ఛను కోల్పోయి రాజకీయ పార్టీల వాడకానికి గురవుతున్నాయి.’’ ఏ అగ్రకులాధిపత్య, వారసత్వ రాజకీయాలను కూకటివేళ్ళతో పెకలించారో అలాంటి జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కోసమే, కులాలను సంఘటితం చేసే పనిముట్లుగా కుల సంఘాలు మారాయని చరిత్రకారుల విమర్శ కూడా ఉంది. సరిగ్గా ఇక్కడే కుల సంఘాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
అణగారిన కులాలు అధికారం అందిపుచ్చుకోవడానికి ఆధిపత్య కులాలూ, పాలక వర్గాలూ అంత ఈజీగా అనుమతించవు. కాబట్టి ఆ పనిని చాప కింద నీరులా చేయాలి. రాజకీయ రంగం లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అణగారిన కులాల క్రియాశీలత మరింత పెంచుకోవాలి. అంటే శ్రామిక కులాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఒక ఉన్నత ఆశయంగా అర్థం చేసుకోవాలి. అది ఈ దేశంలో ఫూలే వెలుగులో ఛత్రపతి సాహూ మహరాజ్ లోతుగా అర్థం చేసుకున్నాడు. కనుకనే సమాజ మార్పుకు చదువే కీలకం అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన కుల వివక్ష మీద పోరాడటంతో పాటు కొల్హాపూర్ పట్టణంలో 1901లో జైన హాస్టల్, విక్టోరియా మరాఠ హాస్టల్, 1906లో ముస్లిం హాస్టల్, 1907లో వీరశైవ లింగాయత్ హాస్టల్, 1908లో అంటరాని వారికి, మరాఠాలకి హాస్టల్; దర్జీ, నేతన్నలకు 1921లో నాందేవ్ హాస్టల్, మరాఠాలకి హాస్టల్, విశ్వకర్మలకు సోనార్ హాస్టల్ నెలకొల్పి ఆయా కులాల నుంచి ఆ కాలంలోనే అట్టడుగు కులాలను ఎలైట్ సెక్షన్స్‌గా ఎదిగే విధంగా తోడ్పడ్డాడు. ఆ కోణంలోనే ఉత్తర భారతదేశంలో ‘యాదవ మహాసభ’ కృషి చేసింది.
సాహూ మహరాజ్ నేతృత్వంలో జరిగిన కృషి ఫలితాలను తొందరగానే గ్రహించిన ఆధిపత్య కులాల వారైన రెడ్డి, కమ్మ, వెలమలూ... మరికొన్ని వెనకబడిన కులాల వారూ తెలుగు నేలపై సంఘాలుగా సంఘటితమై తమ తమ కులాల అభివృద్ధికి నడుం బిగించారు. హైదరాబాద్‌లో 1909 సంవత్సరంలో ‘యాదవ మహాజన సంఘం’, 1919లో ‘రెడ్డి సంఘం’, 1920లో ‘గౌడ సంఘం’, 1930లో ‘కమ్మ సంఘం’, నిజాం చివరి కాలంలో ‘వెలమ సంఘం’ ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా రెడ్డి సంఘం వారు ప్రత్యేకమైన ప్రణాళికతో పని చేశారు. ఆ జాతి విద్యా, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధికి రెడ్డి కుల స్థితిమంతులు విశేష కృషి చేశారు. ‘రెడ్డి హాస్టల్’ లాంటి వసతి గృహాన్ని ఏర్పాటు చేసి విద్యావంతుల్ని తయారుచేసి అధికారం అందుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఇది అందరికీ ఆదర్శం. (క్లిక్: దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!)
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు స్థితి మంతులుగా పెద్ద సంఖ్యలో ఉనప్పటికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వలన తమ హక్కులు పొందడంలో, రాజ్యాధికారం సాధించడంలో వెనుక బడిపోయారన్నది కాదనలేని సత్యం. కనుక వివిధ కుల సంఘాల వారు పై అనుభవాల్లోంచి లోతైన గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ కులానికి ఆ కులం ఎదిగే క్రమంలో మిగతా బహుజన కులాల మద్దతు కూడా తీసుకుంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. (క్లిక్: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?)
- చలకాని వెంకట్ యాదవ్
వ్యాసకర్త హైకోర్ట్ న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment