ఐకమత్యంతోనే బీసీల అభివృద్ధి | BC Leader R Krishnaiah In nizamabad district | Sakshi
Sakshi News home page

ఐకమత్యంతోనే బీసీల అభివృద్ధి

Published Sat, Jan 25 2014 6:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

BC Leader R Krishnaiah In nizamabad district

జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: ఐకమత్యంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, భావి తరాల భవిష్యత్తు కోసం సంఘటితం కావాలని  రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రీయ కళ్యాణ మండపంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బీసీల సమర భేరికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  చట్ట సభల్లో బీసీల వాణి వినిపించే వారు లేకే ఈ దుస్థితి నెలకొందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు. వడ్డించే వాడు మన వాడు లేకపోవడం వల్లే బీసీలు సామాజికంగా వెనుకబడ్డారని అన్నారు. బీసీల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
 
 అగ్ర వర్ణాలకు వణుకు పుడుతోంది..
 - ఎంపీ మధుయాష్కీగౌడ్
 బీసీల్లో చైతన్యం చూసి అగ్ర  వర్ణాల్లో వణుకు పుడుతోందని  ఎంపీ మధుయాష్కీ అన్నారు.  ఈ చైతన్యం రాజ్యాధికారం సాధించే వరకు కొనసాగించాలని సూచించారు. బీసీ నాయకులు చట్ట సభలకు వెళ్లి అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తుతున్నారని, స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. బానిసలుగా బతుకుతున్న కారణంగానే ఈ దుస్థితి నెలకొందన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కృష్ణయ్యకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని, ఇందుకు సభలో తీర్మానం చేయాలని సూచించారు. ఇందుకు కేంద్ర స్థాయిలో తన ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు ఫిబ్రవరి సమావేశాల్లో తప్పకుండా ఆమోదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  
 
 అంకిత భావం లేకపోవడమే కారణం
 - ఎమ్మెల్సీ వీజీ గౌడ్
 చట్ట సభలకు ఎన్నికైన బీసీ నాయకుల్లో అంకిత భావం లేకపోవడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. దేశంలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. బీసీలకు డిక్లెరేషన్ ప్రకటించిన పార్టీలనే గెలిపించాలని, ఇందుకు అన్ని పార్టీలపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
 
 తెలంగాణ ఉద్యమంలో బడుగులే సమిధలు
 - టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
  రాజారాం యాదవ్
 తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే ఆత్మ బలిదానాలు చేసి ఉద్యమానికి సమిధలయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజారాం యాదవ్ అన్నారు. కేసీఆర్ ఉద్యమానికి ముందే ఓయూలో తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టామని  చెప్పారు. రాబోయే తెలంగాణలో బీసీల వాటా దక్కాలని, ఇందుకు పోరాటం చేయాలని అన్నారు. బీసీల అనైక్యతే బలహీనత అని, సంఘటితం కావాలని కోరారు.
 
 ఎన్నాళ్లైనా బానిస బతుకులే...
 - బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్
 రాజ్యాధికారం అగ్ర వర్ణాల చేతిలో ఉంటే ఇంకా ఎన్నాళ్లయినా బానిస బతుకులేనని బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. స్వాభిమానంతో ఓటు వేసి బీసీలనే గెలిపించాలని సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ప్రకటించిందని, గెలిపించాలని కోరారు.
 
 పార్టీలు పట్టించుకోవడంలేదు
 - బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
 జాజుల శ్రీనివాస్ గౌడ్
 అగ్ర వర్గాలకు చెందిన నాయకులు పార్టీలను పట్టించుకోవడం లేదని, ఏ పార్టీకి చెందిన వారైనా తమ వర్గం వారికి అండగా నిలుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాజాలు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ బీసీలు మాత్రమే పార్టీలు అంటూ అంటున్నారని అన్నారు.  బీసీలు 65 ఏళ్లుగా పార్టీల పేరుతో మోసపోతున్నారని, ఇక మీదటైనా సంఘటితం కావాలని సూచించారు. లేనిపక్షంలో మరో శతాబ్దమైనా బీసీల బతుకుల్లో మార్పు రాదన్నారు.
 
 సభలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర కన్వీనర్ ఎ భాస్కర్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్‌లు కంచెట్టి గంగాధర్, త్రివేణి గంగాధర్, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా కృష్ణ పండిత్ గౌడ్, చిల్క కిష్టయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రావు, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర నాయకుడు భూమన్న యాదవ్, జిల్లా సర్పంచ్ గోర్త రాజేందర్, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఖాందేశ్ శ్రీనివాస్, తదితరులు ప్రసంగించారు.  ఆదిలాబాద్, మెదక్ అధ్యక్షుడు కిష్ణు, కల్లారి హరికృష్ణ, ఎంసీ లింగన్న, బీసీ సంఘాల నాయకులు చక్రవర్తి, వీర్ కుమార్, పుల్గం మోహన్, పద్మలత, వినోద్ కుమార్, జగదీశ్వర్, అశోక్, విద్యార్థి నాయకుడు యెండల ప్రదీప్ కుమార్, తదితరులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, జిల్లా నలుమూలల నుంచి బీసీ నాయకులు, సర్పంచ్‌లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీసీలు పాల్గొన్నారు.
 
 కృష్ణయ్యను సన్మానించిన  సంతోష్ రెడ్డి
 బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యను మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. సమర భేరి సభకు విచ్చేసి సంతోష్ రెడ్డి అందరినీ ఆశ్చర్య పరిచారు. నేరుగా సభపైకి వెళ్లి కృష్ణయ్యను ఆలింగనం చేసుకుని సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement