సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు నియామకం తెలుగుతమ్ముళ్లలో అసంతృప్తి రాజేస్తోంది. అయితే పార్టీ అధికారంలో ఉన్నందున ఎందుకైనా మంచిదని ఎవరూ పెదవి విప్పడం లేదు. లేదంటే ఇప్పటికే రచ్చరచ్చ అయ్యేదే. అధిష్టానం నిర్ణయమైనా లేక జిల్లాలో ఒకరిద్దరు ముఖ్య నేతలు కలిసికట్టుగా చేసిన తంత్రం ఫలితమైనా పార్టీ పగ్గాలు పర్వతకు అప్పగించడంపై బీసీల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పదవుల పందేరాన్ని పరిశీలిస్తే ఆ వర్గంలో అసంతృప్తి రగులుకోవడంలో ఎంత మాత్రం అనుచితం కాదని పార్టీ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. వరుసగా ఒకే వర్గానికి పదవులు కట్టబెడుతూ చివరకు జిల్లా పగ్గాలు కూడా అదే వర్గానికి అప్పగించి బీసీలకు, పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్వత నియామకం అధిష్టానం తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదంటున్నారు. జిల్లాలో పార్టీని తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని ఒకరిద్దరు పెద్ద తలకాయలు ఇందుకు కారణమంటున్నారు.
నిరీక్షణకు ఫలితం నిరాశే..
పార్టీ అధికారంలోకి వచ్చాక వరుసగా చేసిన నియామకాలన్నింటిలో ఒకే సామాజికవర్గానికి పెద్దపీట వేశారని ఇతర వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఒకటి కాకపోతే మరొకటి, అదీ కూడా కాకపోతే ఇంకో పదవి ఇస్తారని ఎదురుచూసి, చూసి.. చివరకు జిల్లా పగ్గాలు కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపించారని పార్టీనే నమ్ముకుని పయనిస్తున్న బీసీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ జిల్లా పగా్గాలు ఏ వర్గానికి ఇవ్వాలనే చర్చ పార్టీలో మొదలైనప్పటి నుంచి రెండు బలమైన సామాజికవర్గాల పేర్లు వినిపించాయి. నిమ్మకాయల చినరాజప్పకు పెద్దాపురం సీటు ఇచ్చినా, గెలిచాక ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇచ్చినా పార్టీ వర్గాలు స్వాగతించాయి. రికార్డు స్థాయిలో జిల్లా పగ్గాలు చేపట్టడం, మృదుస్వభావి కావడమే ఇందుకు కారణం. రాజప్పకు జోడుపదవులు ఇచ్చిన అధిష్టానం అదే బాటలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, రాజమండ్రి మేయర్, పార్టీ పొలిట్ బ్యూరో..ఇలా పదవులన్నీ ఒకే వర్గానికి కట్టబెడుతూ చివరకు జిల్లా పార్టీ పగ్గాలు కూడా అదే వర్గానికి ఎలా అప్పగించేశారని బీసీలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికలప్పుడు కనీసం వైస్ చైర్మన్ అయినా వస్తుందని బీసీలు ఆశించారు. దానిని మరో బలమైన ఉన్నత వర్గానికి కట్టబెట్టడంలో చూపిన చొరవ తమ విషయంలో ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని పార్టీలో బీసీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు.
ఆయనకిస్తే మాకు ఇచ్చినట్టేనా?
తునిలో వరుసగా తిరస్కారానికి గురైన సోదరులిద్దరిలో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి మంత్రి పదవి కట్టబెడితే బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టేనా అని బీసీలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గం ప్రశ్నిస్తోంది. పార్టీ జిల్లాపగ్గాల కోసం ఆ వర్గం నుంచి బలమైన నాయకుడిగా, మంచి వాగ్ధాటి కలిగిన పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్‌ఎస్), పార్టీ కార్యదర్శి పిల్లి సత్తిబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఆర్‌ఎస్‌కు పార్టీ అధికారంలోకి రాకమునుపే చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించారు. అది ఇంకా దక్కలేదు.
ఈలోగా పదవులన్నీ ఒకే వర్గానికి కట్టబెట్టడంతో బీసీలలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఆ వర్గానికే జిల్లా పగ్గాలు అప్పగించాలని పార్టీ ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు గరికిపాటి మోహనరావు, పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ కిమిడి కళా వెంకట్రావు రెండు రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌కు కేటాయించే విషయమై జిల్లా నేతలంతా దాదాపు ఏకాభిప్రాయానికి కూడా వచ్చారని సమాచారం. ఇక ప్రకటించడం ఒకటే మిగిలి ఉందని పార్టీలో ఆ వర్గ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇద్దరు కీలక నేతలు చివరి నిమిషంలో అడ్డుచక్రం వేయడంతో బీసీలకు అధిష్టానం మొండిచేయి చూపించిందని పార్టీలో ఆ వర్గం రగిలిపోతోంది. చిట్టిబాబు అయితే తమ కనుసన్నల్లో నడుస్తారన్న ఏకైక కారణంతో బీసీలకు జిల్లా సారథ్యం దక్కకుండా చేసిన పెద్దల తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సమర్థత, సొంత వ్యక్తిత్వం కలిగిన బీసీ నేతలను పార్టీలో ఎదగనివ్వకుండా పార్టీ పదవులకు దూరం చేసే కుట్రలో భాగమే తాజా ఎంపికని పార్టీలో సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
సారథ్యానికి మేం తగమా?
Published Sun, Nov 2 2014 12:43 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
Advertisement
Advertisement