ఏమిటీ దుర్భరస్థితి ? | BC Welfare Minister Shankar narayana Visits Girls Residential Hostel In Tadikonda | Sakshi
Sakshi News home page

ఏమిటీ దుర్భరస్థితి ?

Published Thu, Aug 1 2019 10:55 AM | Last Updated on Thu, Aug 1 2019 10:55 AM

BC Welfare Minister Shankar narayana Visits Girls Residential Hostel In Tadikonda - Sakshi

విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకుంటున్న  మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే శ్రీదేవి 

సాక్షి, తాడికొండ(గుంటూరు) : స్థానిక బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర నారాయణ.. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో కలిసి పరిశీలించారు. 105 మంది విద్యార్థులకుగాను 20 మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిలో 10 మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయి ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలు ఉండే వసతి గృహంలో ఇలాంటి దుర్భర పరిస్థితి ఏంటని వార్డెన్‌ను ప్రశ్నించారు. ‘కనీస మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత లేదా..  విద్యార్థినులు ఇలాంటి వాటిలో ఎలా కాలకృత్యాలు తీర్చుకుంటార’ని ప్రశ్నించారు. మరమ్మతుల కోసం ఇటీవల అంచనాలు రూపొందించామని బీసీ సంక్షేమ శాఖ డీడీ చినబాబు తెలిపారు. అనంతరం విద్యార్థినులను పిలిచి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా ? లేదా ? పాలు, గుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు. చికెన్‌ వారంలో ఎన్ని సార్లు అందుతుంది. నాణ్యత ఉంటుందా ? లేదా ? అని ప్రశ్నించారు. అటెండెన్స్‌ రిజిస్టర్‌ను పరిశీలించిన అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. 

కష్టపడి చదవండి
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ తానూ హాస్టల్‌లో చదివానని, కష్టపడి చదవాలని సూచించారు. అక్కడ నుంచి స్టోర్‌ రూమ్‌లో సరుకులను మంత్రి పరిశీలించారు. అనంతరం వండిన అన్నం, కూరలను రుచి చూశారు. బెడ్‌లు ఒక దానిపై ఒకటి రెండు స్టేర్‌లుగా ఉండటంతో పైన పడుకున్న వారికి ఫ్యాన్‌లు తగులుతున్నాయని విద్యార్థులు చెప్పగా.. సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. తిరిగి వారం రోజుల్లో ఇదే రోజు వసతి గృహాన్ని తనిఖీ చేస్తానని, ఏమైనా సమస్యలు ఉంటే ఒప్పుకోనని హెచ్చరించారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వసతి గృహాల ఉన్న స్థితిని గుర్తించి ఉన్నత స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ  అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందని తెలిపారు. బీసీలంటే బ్యాక్‌ బోన్‌ కులాలు అనే విషయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రుజువు చేస్తున్నారని చెప్పారు. వారి వెంట తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు మండల పార్టీ అధ్యక్షులు తియ్యగూర బ్రహ్మారెడ్డి, బత్లు కిషోర్, కందుల సిద్ధయ్య, మాజీ ఎంపీపీలు బండ్ల పున్నారావు, కొమ్మినేని రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి మల్లంపాటి రా«ఘవరెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement