బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం సిటీ: జిల్లా బీసీ సంక్షేమాధికారి కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఏసీబీ సీఐలు ఆజాద్, లకో్ష్మజీల ఆధ్వర్యంలో వచ్చిన ప్రత్యేక బృందం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. గత బీసీ సంక్షేమాధికారి ఆర్.వి.నాగరాణి హయాంలో జరిగిన పలు అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై ఈ విచారణ నిర్వహించారు. ఆమె పనిచేసిన 2011 జూన్ నుంచి 2014 జనవరి మధ్య కాలంలో నిధుల కేటాయింపులు, వాటి వినియోగం, సిబ్బంది పదోన్నతులు, వసతి గృహాల కు సామగ్రి కేటాయింపులు తదితర కీలక రికార్డులును స్వాధీనం చేసుకున్నారు. తమ వద్ద ఉన్న వివరాలను రికార్డుల్లో ఉన్న వివరాలతో సరి చూశారు.
అనుమానాలున్న పలు ఫైళ్లను తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా
ప్రస్తుత బీసీ వెల్ఫేర్ అధికారి లజపతిరావును కూడా విచారించి పలు వివరాలు సేకరించారు. ఇదే కార్యాలయంలో నాగరాణి హయాంలో పని చేసిన ఓ ఉద్యోగి గురించి అధికారులు ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలిసింది. శనివారం రమ్మని ఆ ఉద్యోగిని పిలిపించినప్పటికీ ఆయన హాజరుకాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా నాగరాణి వ్యవహారంపై 2012లోనే పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై 2013 జనవరిలో ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ అలోక్‌కుమార్ విచారణ జరిపారు. ఇప్పుడు కూడా నాగరాణి హయాంలోని వ్యవహారాలపైనే విచారణ జరిపామని సీఐలు ఆజాద్, లక్ష్మోజీలు చెప్పారు. అప్పటి రికార్డులను తనిఖీ చేశామన్నారు. నిధులు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునే పనిలో ఉన్నామని వారు వివరించారు.