BC welfare office
-
బీసీ యువతకు రాయితీ రుణాలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాల్లోని నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాలను అమలు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. 2017–18లో ఇప్పటివరకు బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్లు ఎలాంటి రాయితీ పథకాలు అమలు చేయలేదు. మరో రెండున్నర నెలల్లో ఏడాది ముగియనుండటంతోపాటు వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు కేటాయించిన రూ.2 వేల కోట్ల బడ్జెట్ వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ శాఖ సర్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్ ప్రకారం పథకాల అమలులో భాగంగా అర్హుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది. మండలం యూనిట్‌గా పథకాల అమలు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు.. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పే యువతకు రాయితీతో కూడిన రుణ సహకారం అందిస్తున్నాయి. రూ.లక్షలోపు రుణం తీసుకున్న లబ్ధిదారులకు గరిష్టంగా రూ.80 వేల రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీలిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియంతా మండల స్థాయిలో ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు. ప్రతీ గ్రామంలో లబ్ధిదారులుండాలనే ఉద్దేశంతో గ్రామల వారీగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం వాటిని వడపోసి మండల స్థాయిలో జాబితా తయారు చేస్తారు. తర్వాత జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో జిల్లా జాబితా రూపొందించి రాష్ట్ర కార్యాలయానికి సమర్పిస్తారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రణాళిక రూపొందించారు. భారీ బడ్జెట్.. 2017–18లో బీసీలకు రాయితీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు, రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించింది. మిగతా ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్ పరిధిలో మరో రూ.500 కోట్ల మేర ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ఎంపిక జాబితా రూపొందించేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంపిక చేపడితే కేటాయించిన బడ్జెట్‌ను తర్వాత విడుదల చేసినా కోటాలో నష్టం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. -
బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
శ్రీకాకుళం సిటీ : బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖాధికారిగా గతంలో జిల్లాలో పని చేసిన బి.రవిచంద్రపై పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ(సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, అమరావతి) ఎస్వీవీ ప్రసాదరావు నేతృత్వంలో సోదాలు జరిగాయి. ఏసీబీ డీజీ మాలకొండయ్య ఆదేశాల మేరకు సోదాలు చేపట్టినట్టు డీఎస్పీ మీడియాకు తెలిపారు. రవిచంద్ర కర్నూలులో తొలుత పని చేసిన కాలంలో పలు ఆరోపణలను ఎదుర్కొన్నట్టు చెప్పారు విద్యార్థుల దుస్తుల కుట్టు, సిబ్బంది పదోన్నతుల్లో నిబంధనలను అతిక్రమించడం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుంచి స్కాలర్‌షిప్పుల పేరిట లంచాలు వసూలు చేయడం, అకౌంటెంట్, లైబ్రేరియన్ పోస్టుల్లో సొంత వారిని నియమించడం, వాల్మీకి జయంతికి హాస్టల్‌కు రూ.50వేలు మంజూరు చేయగా అందులో రూ.2వేలు లంచంగా తీసుకోవడం, ప్రతి నెలా వసతిగృహ సంక్షేమాధికారుల నుంచి రూ.5వేలు వసూలు చేయడం వంటì ఆరోపణలు రవిచంద్రపై ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో పని చేసిన సమయంలో కూడా ఈయనపై వసతిగృహాల్లో బంకర్బెడ్స్లో అక్రమాలు, సంక్షేమాధికారులు, ఎఫ్‌ఏసీల పేరిట బదిలీలు, అవసరం లేకుండా వార్డెన్లకు మెమోలు జారీ చేస్తూ వారి నుంచి డబ్బులు తీసుకోవడం, కలెక్టర్ ఓ వసతిగృహ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించినా..అది అమలు చేయకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించి తొలుత శ్రీకాకుళం జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో రవిచంద్ర పనిచేసే సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించి రికార్డులను పరిశీలిస్తున్నామని చెప్పారు. తరువాత కర్నూలు జిల్లాలో కూడా విచారణ చేపడతామని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. -
బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం సిటీ: జిల్లా బీసీ సంక్షేమాధికారి కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఏసీబీ సీఐలు ఆజాద్, లకో్ష్మజీల ఆధ్వర్యంలో వచ్చిన ప్రత్యేక బృందం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. గత బీసీ సంక్షేమాధికారి ఆర్.వి.నాగరాణి హయాంలో జరిగిన పలు అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై ఈ విచారణ నిర్వహించారు. ఆమె పనిచేసిన 2011 జూన్ నుంచి 2014 జనవరి మధ్య కాలంలో నిధుల కేటాయింపులు, వాటి వినియోగం, సిబ్బంది పదోన్నతులు, వసతి గృహాల కు సామగ్రి కేటాయింపులు తదితర కీలక రికార్డులును స్వాధీనం చేసుకున్నారు. తమ వద్ద ఉన్న వివరాలను రికార్డుల్లో ఉన్న వివరాలతో సరి చూశారు. అనుమానాలున్న పలు ఫైళ్లను తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రస్తుత బీసీ వెల్ఫేర్ అధికారి లజపతిరావును కూడా విచారించి పలు వివరాలు సేకరించారు. ఇదే కార్యాలయంలో నాగరాణి హయాంలో పని చేసిన ఓ ఉద్యోగి గురించి అధికారులు ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలిసింది. శనివారం రమ్మని ఆ ఉద్యోగిని పిలిపించినప్పటికీ ఆయన హాజరుకాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కాగా నాగరాణి వ్యవహారంపై 2012లోనే పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై 2013 జనవరిలో ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ అలోక్‌కుమార్ విచారణ జరిపారు. ఇప్పుడు కూడా నాగరాణి హయాంలోని వ్యవహారాలపైనే విచారణ జరిపామని సీఐలు ఆజాద్, లక్ష్మోజీలు చెప్పారు. అప్పటి రికార్డులను తనిఖీ చేశామన్నారు. నిధులు, అధికార దుర్వినియోగం ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకునే పనిలో ఉన్నామని వారు వివరించారు.