సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాల్లోని నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాలను అమలు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. 2017–18లో ఇప్పటివరకు బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్లు ఎలాంటి రాయితీ పథకాలు అమలు చేయలేదు. మరో రెండున్నర నెలల్లో ఏడాది ముగియనుండటంతోపాటు వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు కేటాయించిన రూ.2 వేల కోట్ల బడ్జెట్ వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ శాఖ సర్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్ ప్రకారం పథకాల అమలులో భాగంగా అర్హుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది.
మండలం యూనిట్‌గా పథకాల అమలు
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు.. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పే యువతకు రాయితీతో కూడిన రుణ సహకారం అందిస్తున్నాయి. రూ.లక్షలోపు రుణం తీసుకున్న లబ్ధిదారులకు గరిష్టంగా రూ.80 వేల రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీలిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియంతా మండల స్థాయిలో ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు. ప్రతీ గ్రామంలో లబ్ధిదారులుండాలనే ఉద్దేశంతో గ్రామల వారీగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం వాటిని వడపోసి మండల స్థాయిలో జాబితా తయారు చేస్తారు. తర్వాత జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో జిల్లా జాబితా రూపొందించి రాష్ట్ర కార్యాలయానికి సమర్పిస్తారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రణాళిక రూపొందించారు.
భారీ బడ్జెట్..
2017–18లో బీసీలకు రాయితీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు, రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించింది. మిగతా ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్ పరిధిలో మరో రూ.500 కోట్ల మేర ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ఎంపిక జాబితా రూపొందించేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంపిక చేపడితే కేటాయించిన బడ్జెట్‌ను తర్వాత విడుదల చేసినా కోటాలో నష్టం ఉండదని అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment