BC youth
-
బీసీ యువతకు రాయితీ రుణాలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాల్లోని నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాలను అమలు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. 2017–18లో ఇప్పటివరకు బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్లు ఎలాంటి రాయితీ పథకాలు అమలు చేయలేదు. మరో రెండున్నర నెలల్లో ఏడాది ముగియనుండటంతోపాటు వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు కేటాయించిన రూ.2 వేల కోట్ల బడ్జెట్ వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ శాఖ సర్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్ ప్రకారం పథకాల అమలులో భాగంగా అర్హుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది. మండలం యూనిట్‌గా పథకాల అమలు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు.. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పే యువతకు రాయితీతో కూడిన రుణ సహకారం అందిస్తున్నాయి. రూ.లక్షలోపు రుణం తీసుకున్న లబ్ధిదారులకు గరిష్టంగా రూ.80 వేల రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీలిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియంతా మండల స్థాయిలో ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు. ప్రతీ గ్రామంలో లబ్ధిదారులుండాలనే ఉద్దేశంతో గ్రామల వారీగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం వాటిని వడపోసి మండల స్థాయిలో జాబితా తయారు చేస్తారు. తర్వాత జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో జిల్లా జాబితా రూపొందించి రాష్ట్ర కార్యాలయానికి సమర్పిస్తారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రణాళిక రూపొందించారు. భారీ బడ్జెట్.. 2017–18లో బీసీలకు రాయితీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు, రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించింది. మిగతా ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్ పరిధిలో మరో రూ.500 కోట్ల మేర ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ఎంపిక జాబితా రూపొందించేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంపిక చేపడితే కేటాయించిన బడ్జెట్‌ను తర్వాత విడుదల చేసినా కోటాలో నష్టం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. -
బీసీ యువతకు 102 కోట్ల రాయితీ రుణాలు
వారం రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం: మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: బీసీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద 2017–18 వార్షిక సంవ త్సరంలో ఇచ్చే రుణాలపై రూ.102 కోట్ల రాయితీ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. వారం రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తుందని, ఈ ప్రక్రియ ముగిసిన వెం టనే క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేపడ తామన్నారు. గురువారం బీసీ సంక్షేమ భవన్లో ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 119 గురు కుల పాఠశాలలు ప్రారం భిస్తున్నట్లు తెలిపారు. గురుకులాలు అన్ని సౌకర్యా లతో శాశ్వత భవనాల్లో నిర్మించేందుకు స్థలాలను గుర్తించామని, విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. గతంలో హాస్టల్ విద్యార్థులకు నెలకు 4 సార్లు మాంసాహారాన్ని అందించగా, ప్రస్తుతం 7 సార్లు ఇస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. బీసీ విదేశీ విద్యా నిధి పథకం కింద త్వరలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుందని, అధికారులు సకాలంలో నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్, అదనపు కార్యదర్శి సైదా, కమిషనర్ అరుణ, జేడీలు అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు తదితరులు పాల్గొన్నారు.