భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఒంగోలు టౌన్: రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. వాగులు, వంకలు పొంగుతున్నందున ప్రజలు రాకపోకలు సాగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనిచేసేచోట తహశీల్దార్లు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రెండు రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ శుక్రవారం అన్ని మండలాల తహ శీల్దార్లు, ఇతర అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భారీ వర్షాలు, వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారాన్ని జిల్లా కేంద్రానికి పంపించాలని ఆదేశించారు.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు రెవెన్యూ అధికారులతోపాటు అన్ని శాఖల అధికారులను డిప్యూట్ చేసుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో జేసీబీ ద్వారా వర్షపు నీరు పోయేలా డైవర్షన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ సమాచారాన్ని అందించాలని ఆదేశించారు.
అర్హత కలిగిన పింఛన్లు తొలగిస్తే అధికారులపై వేటు:
జిల్లాలో అర్హత కలిగిన వారి పింఛన్లు తొలగిస్తే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామ కమిటీల ద్వారా తొలగించిన పింఛన్లలో అర్హులుంటే విచారించి జిల్లా కమిటీకి ఈనెల 15వ తేదీలోపు పంపించాలని ఆదేశించారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుల్లో వయస్సు తక్కువగా చూపడం వల్ల తొలగించిన పింఛన్‌దారులకు ఈనెల 15నుంచి 20వ తేదీలోపు ప్రత్యేకంగా ఏరియా ఆసుపత్రుల్లో తేదీలను ప్రకటిస్తామని, ఆ తేదీల్లో పింఛన్‌దారులు వెళ్లి వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకొని అధికారులకు అందించాలని సూచించారు. అర్హులైన పింఛన్‌దారులను తొలగిస్తే సంబంధిత ఎంపీడీవోలపై వేటు వేస్తామని హెచ్చరించారు.
ఎపిక్, ఓటరు గుర్తింపు కార్డులతో అనుసంధానం:
రుణమాఫీకి సంబంధించి రైతులకు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు లేకుంటే ఎపిక్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తీసుకొని ఈనెల 15వ తేదీలోపు బ్యాంకుల్లో అనుసంధానం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, ఒంగోలు ఆర్‌డీఓ కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.