ఆర్టీసీ ఇంద్ర బస్సు
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని ఏసీ బస్సుల్లో నల్లులు రాజ్యమేలుతున్నాయి. సరైన నిర్వహణ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని డిపోల్లో నెలల తరబడి బస్సు సీట్ల పరిస్థితిని, వాటిలో తిష్టవేసిన నల్లుల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇచ్చే బ్లాంకెట్లను ఎప్పటికప్పుడు మార్చకపోవడంతో వాటిలోనూ నల్లులు తిష్ట వేస్తున్నాయి. సీట్ల కింద నుంచే కాకుండా ఒళ్లంతా పాకుతూ రాత్రి వేళ అవస్థలు పెడుతున్నాయి.
సోమవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖపట్నం బయలుదేరిన 9372 సర్వీసు నంబరు గల ఇంద్ర బస్సు (విజయవాడ డిపో)లో ప్రయాణికులు నల్లుల బారిన పడ్డారు. బస్సులో అన్ని సీట్లలోనూ నల్లులు తమ ప్రతాపాన్ని చూపాయి. తొలుత వీటిని దోమలుగా భావించి సర్దుబాటు చేసుకున్నారు. బస్సు ఏలూరు దాటాక అంతా నిద్రకు ఉపక్రమించడంతో నల్లులు రక్తం తాగడం మొదలెట్టాయి. ఈ సమస్యపై ప్రయాణికులు డ్రైవర్ కాసులుకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు విజయవాడ చేరుకున్నాక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు ఇంద్ర బస్సు డ్రైవర్ టి.వి.కాసులు పేర్కొన్నారు. రాత్రంతా తాము నల్లులతో పడ్డ అవస్థలను ప్రయాణికులు ‘సాక్షి’కి వివరించారు. ఏసీ ప్రయాణానికి భారీగా టికెట్ సొమ్ము వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడడం లేదంటూ మండిపడ్డారు.
ఎవరూ నిద్రపోలేదు..
మేమెక్కిన ఇంద్ర బస్సులో 35 మందికి పైగా ఉన్నాం. నల్లులు విపరీతంగా కుట్టడంతో చేతులు, ఒళ్లు దద్దుర్లెక్కాయి. లైట్లు వేసుకుని చూస్తే ఒక్కొ సీట్లో వందల కొద్ది నల్లులున్నాయి. ఇలా అన్ని సీట్లలోనూ నల్లులు కనిపించాయి. అవి పెద్ద సైజులో ఉండడంతో మూడు, నాలుగు నెలలుగా నిర్వహణ లేదని అర్థమైంది. పిల్లలతో పాటు బస్సులో ఉన్న వారంతా రాత్రంతా జాగారం చేశాం. విశాఖ ఎప్పుడొస్తుందని ఎదురుచూశాం.– వెంకటేశ్వరరావు,ప్రయాణికుడు, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment