‘వేడెక్కనున్న’ బీరు! | Beers, foreign alcohol price hike | Sakshi
Sakshi News home page

‘వేడెక్కనున్న’ బీరు!

Published Tue, Apr 7 2015 1:28 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

‘వేడెక్కనున్న’ బీరు! - Sakshi

‘వేడెక్కనున్న’ బీరు!

  • బీర్లు, విదేశీ మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధం
  •  బేవరేజెస్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్
  •  ఆదాయం పేరుతోధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
  •  రెండు రోజుల్లో ఉత్తర్వులు!
  •  బీర్లు, విదేశీ మద్యాన్ని రిటైల్ షాపులకు నిలిపివేసిన టీఎస్‌బీసీఎల్
  • సాక్షి, హైదరాబాద్: ఎండాకాలంలో చల్లని బీరుతో సేద తీరుదామనుకునే మద్యం ప్రియులకు ప్రభుత్వం మరింత వేడి పుట్టించేందుకు సిద్ధమవుతోంది. ఆదాయం పెంచుకోవడంతోపాటు, బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలకు లాభం చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. బీర్ల ధరలు పెంచాలని నాలుగేళ్లుగా బేవరేజెస్ కంపెనీలు ఎక్సైజ్ శాఖపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు కంపెనీలకు లాభం చేకూరుస్తూనే.. ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ధరలు పెంచాలని నిర్ణయించింది. అదే సమయంలో విదేశీ మద్యం ధరలను భారీగా పెంచడం ద్వారా మరింత ఆదాయంపై కూడా దృష్టి సారించింది.

    ఈ మేరకు ప్రభుత్వం నుంచి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్)కు ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన ఆ శాఖ తెలంగాణలోని 17 మద్యం డిపోలకు బీర్లు, విదేశీ మద్యం స్టాక్‌ను రిటైలర్లకు సరఫరా చేయకూడదని మెయిల్ ద్వారా ఆదేశాలు పంపినట్లు సమాచారం. ధరలు పెంచు తూ రెండు మూడ్రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనున్నందున స్టాక్ విడుదల చేయవద్దని ఆదేశాలు అందినట్లు ఒక డిపో మేనేజర్ ‘సాక్షి’కి ధ్రువీకరించారు. ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వుల కాపీ ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ వద్ద పెండింగ్‌లో ఉందని విశ్వసనీయ సమాచారం.

    కిరణ్ హయాంలో ఒత్తిళ్లు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహిత బంధువు ద్వారాబీర్ల ధరలను పెంచాలని బేవరేజెస్  కంపెనీలు ఒత్తిళ్లు తెచ్చాయి. అయితే ఇతర రాష్ట్రాల్లోని బీర్ల ధరలతో పోలిస్తే రాష్ట్రంలో రేట్లు ఎక్కువగా ఉండడం, మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటుందన్న విమర్శలకు జడిసి ఆయన ప్రతిపాదనలను పక్కన పెట్టారు. రాష్ట్రం విడిపోయాక రెండు నెలల క్రితమే ఏపీ ప్రభుత్వం బీర్ల ధరలను పెంచడంతో కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంపైఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

    కేంద్రం కూడా మద్యం ధరలను పెంచాలని బడ్జెట్‌లో నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం రెవెన్యూ పెంపు పేరుతో బీర్ల ధరలు పెంచేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రీమియం బీరు ఎంఆర్‌పీ ధర రూ. 85 ఉండగా, దానిని రూ. 5 పెంచి రూ. 90కి, స్ట్రాంగ్ బీర్ల ధరలను రూ. 95 నుంచి రూ. 105కి పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక కనీసంగా రూ. 1,500 పైగా ఒక సీసా ధర ఉన్న విదేశీ మద్యం ధరలను సీసాకు బ్రాండ్‌ను బట్టి రూ. 100 పైగా పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.

    గడిచిన ఆర్థిక సంవత్సరం(2014-15)లో సుమారు 260 లక్షల కేసుల బీర్లు (ఒక్కో కేసులో 12 బీర్లు) విక్రయించినట్లు సమాచారం.  ఈ లెక్కన బీర్ల ధరలు పెరగడం వల్ల సంవత్సరానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు అదనపు రెవెన్యూ సమకూరుతుందని అంచనా. ఎక్కువగా బీర్ల వినియోగం జరిగే వేసవిలోనే వాటి ధరలు పెంచడంతో జూన్ నాటికే భారీ ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే విదేశీ మద్యం ధరలను సీసాకు రూ. 100కు పైగా పెంచినా భారీ మొత్తంలో ఎక్సైజ్ శాఖకు రెవెన్యూ సమకూరనుంది. రెవెన్యూ టార్గెట్లను అందుకోవడంలో ముందున్న ఎక్సైజ్ శాఖ ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న లక్ష్యం రూ. 10,500 కోట్లు ఇప్పటికే చేరుకుంది.
     
     పెంపు ఇలా! (రూ. లలో)
     ప్రీమియం బీరు-    5
     స్ట్రాంగ్ బీరు -    10
     విదేశీ మద్యం-    100

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement