స్వాతంత్య్రానికి పూర్వమే అటవీ హత్యలు | Before independence, the murders of the forest officers | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రానికి పూర్వమే అటవీ హత్యలు

Published Tue, Dec 17 2013 5:51 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM

Before independence, the murders of the forest officers

సాక్షి ప్రతినిధి, కడప: అటవీ హత్యలు ఈనాటివి కావు. స్వాతంత్య్రం రాకముందు కూడా ఇలాంటి హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. అడవులను కాపాడుకోవాలనే దృక్పథాన్ని విడనాడి ప్రకృతి సంపద ద్వారా అక్రమార్జన చేయడానికి కొందరు అలవాటుపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిత్తూరు జిల్లాలో అటవీ సిబ్బందిని స్మగ్లర్లు కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. అలాంటి ఘటన 1939లోనే వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. స్మగ్లర్లతో పాటు క్రూరమృగాల నుంచి తప్పించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలన్న అటవీ సిబ్బంది విన్నపాన్ని పాలకులు 8
 దశాబ్దాలుగా పెడచెవిన పెడుతున్నారు.

 1939లోనే మూడు హత్యలు...
 చిట్వేలి మండలం తిమ్మయ్యగారిపల్లెలో 1939 మార్చి 17న ముగ్గురు అటవీ సిబ్బంది హత్యకు గురయ్యారు. అటవీ సంపదను తెగనరకవద్దని అన్నందుకే వీరు ప్రాణాలు కోల్పోయారు.  తిమ్మయ్యగారిపల్లెకు చెందిన కేశవులు, సోమయ్య, పెంచలు అనే ముగ్గురు అక్కడి ఫారెస్టు సంరక్షకులుగా ఉండేవారు.  వంట చెరకు, ఇంటి సామగ్రి కోసం అడవిని స్థానికులు నిత్యం ధ్వంసం చేస్తుండేవారు. కటారి పాపయ్య అనే వ్యక్తి అడవిని కొల్లగొడుతుండటంతో కేశవులు పరుషంగా మాట్లాడారు. దీంతో కోపోద్రిక్తుడైన కటారి పాపయ్య ముగ్గురిని హత్యచేసి మృతదేహాలను అడవిలో పారేశాడు. ఈ కేసుకు సంబంధించి కటారిపాపయ్యకు మరణశిక్ష విధించగా తన పలుకుబడితో యావజ్జీవ శిక్షకు పరిమితం చేసుకున్నాడు. అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అప్పటి సిబ్బంది గుర్తుగా స్మారకస్థూపం ఏర్పాటైంది. ఆ నాటి నుంచి ఆ ప్రాంతాన్ని కేశవుల బండ అని  పిలుస్తున్నారు.
 పునరావృతం  అవుతున్న  ఘటనలు....
 అక్రమార్జనకు ఎర్రచందనం ఆర్థిక వనరుగా మారడంతో తరుచూ అటవీ యంత్రాంగ ంపై దాడులు జరుగుతున్నాయి. జిల్లాలో 2010లో పుల్లలమడుగు బీట్‌లో అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు కాల్పులు జరిపారు. సుండుపల్లె సమీపంలో అటవీ సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు చేశారు. కడప సమీపంలోని పాలకొండల్లో ఓబులేసు అనే బీట్ ఆఫీసర్‌పై దాడి చేశారు. మైదుకూరు సెక్షన్ పరిధిలో వరుస దాడులు జరిగాయి. అంతరించిపోతున్న ఎర్రచందనాన్ని రక్షించాలంటే అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరమని  ఉన్నతాధికారులు పలుమార్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కడప, చిత్తూరు, కర్నూలు అటవీ సిబ్బందికి 400 తుపాకులు అవసరమని నివేదికలు సమర్పించారు. ఆ నివేదికలు బుట్టదాఖలయ్యాయి.  దీంతో ఎర్రచ ందనం స్మగ్లర్లకు ఇష్టారాజ్యమైంది. అనతి కాలంలోనే కోటీశ్వర్లుగా చ లామణి అవుతుండటంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు.  పాలకుల అండతోనే..
 ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో  ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లుగా ఉంది. అధికారంలో ఉన్న పాలకుల అండదండలతో స్మగ్లర్లు చెలరేగిపోతున్నట్లు పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి.  చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన గజ్జల శ్రీనివాసులరెడ్డిపై వైఎస్సార్ జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు ఏడు కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డితో శ్రీనివాసులరెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవాడు. ‘గజ్జ గల్లు- అడవి ఘెల్లు’ అంటూ గత ఏడాది సాక్షి కథనం కూడా  ప్రచురించింది.
గజ్జల శ్రీనివాసులరెడ్డి అలియాస్ శ్రీనురెడ్డి కొన్నేళ్ల క్రితం కోర్టులో లొంగిపోయాడు. అప్పట్లో అటవీ యంత్రాంగం శ్రీనురెడ్డిపై పీడీ యాక్టు అమలు చేసింది. కొంత కాలం జైలు జీవితం గడిపిన శ్రీనురెడ్డి చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా బయటికొచ్చాడు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా శ్రీను రెడ్డి పత్రికలలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇలాంటి స్మగ్లర్లను అడ్డుకునే సాహసం ఎవరు చేస్తారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ హత్యలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలకు ఇటువంటి ఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయని పలువురు బాహటంగానే  పేర్కొంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement