సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో మొదటి నుంచి కరీంనగర్ జిల్లాలోనే బీజేపీ కాస్త బలంగా ఉంది. పార్టీకి బలమైన నాయకులతో పాటు చెప్పుకోదగ్గ స్థాయిలో క్యాడర్ ఉంది. ఇక్కడ టీడీపీ ప్రభావం బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పొత్తు వల్ల శ్రేణుల్లో నిరాశా నిస్పృహలు ఏర్పడతాయని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు.
నరేంద్రమోడీ హెదరాబాద్‌లో నిర్వహించిన నవభారత యువభేరీ సభ నుంచే టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సభలో మోడీ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తడం, పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని చంద్రబాబు దాటవేయడం చర్చనీయాంశమయ్యింది. జాతీయస్థాయిలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు ముందే మిత్రులను పెంచుకోవాలని మోడీ భావించడం వల్ల స్నేహహస్తం సాచారన్న ప్రచారం జరిగింది.
అప్పటినుంచే తెలంగాణ ప్రాంత నాయకులు పొత్తు వల్ల వచ్చే లాభనష్టాల గురించి అంచనా వేయడం ప్రారంభించారు. ఏ రకంగా చూసినా పొత్తు కమలానికి మేలు చేయదని, ఇరువైపులా విశ్వసనీయతను కోల్పోతున్న టీడీపీకి తామే కొత్తగా జీవం పోసినట్టవుతుందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ బాగా దెబ్బతిన్నదనీ, గతంలో తనవల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిలిచిపోయిందని చంద్రబాబు బస్సుయాత్రలో చెప్పుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో పూర్తిగా ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందని అగ్రనేతలకు వివరించే యోచనలో ఉన్నారు. విభజనకు చంద్రబాబే కారణమన్న ప్రచారాన్ని సీమాంధ్ర ప్రజల్లోకి మిగతా పార్టీలు బలంగా తీసుకెళ్తున్నాయని, దీంతో అటు పక్కా టీడీపీ వల్ల ఒనగూరే మేలు ఉండదని అంటున్నారు.
టీడీపీ కన్నా మెరుగే..
జిల్లాలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి టీడీపీ కన్నా మెరుగ్గా ఉందని కమలనాథులు చెబుతున్నారు. గతంలో టీడీపీతో పొత్తు అనంతరం క్రమంగా కమలం వాడిపోతూవచ్చింది. పార్టీ నేతల మధ్య విబేధాలు, ఆధిపత్య పోరాటం పార్టీని బలహీనపరిచాయి.
జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులున్నా పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడపలేకపోవడం ఇబ్బందిగా మారింది. ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోవడంతో శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జాతీయ రాజకీయాల్లో మోడీకి పెరుగుతున్న ప్రాచుర్యం ఈ ప్రాంతంలో బీజేపీ పట్ల రాజకీయ నాయకులు మొగ్గుచూపేందుకు కారణమయ్యింది. మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావచ్చునన్న ప్రచారం సానుకూల వాతావరణాన్ని పెంచింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకోవడం, జేఏసీలో క్రియాశీలంగా వ్యవహరించడంతో పార్టీకి తిరిగి గుర్తింపు వచ్చింది. జిల్లాలో కూడా పార్టీ క్యాడర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఫలితంగా ఇటీవల జరిగిన సహకార, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. మిగతా పార్టీల నుంచి కూడా ఈ మధ్యకాలంలో పలువురు నాయకులు వలసవచ్చారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ టికెట్టు కోసం పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత సీమాంధ్ర ఉద్యమం ప్రారంభం కావడంలో రాజకీయ సమీకరణాలు మారాయి. తెలంగాణ ప్రకటన ద్వారా కాంగ్రెస్ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో తెలంగాణ పక్షాన మరింత గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మరోసారి టీడీపీ వల్ల రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతినక తప్పదని బీజేపీ శ్రేణులు భయపడుతున్నారు.
పొత్తు కీడే..
Published Fri, Sep 13 2013 4:57 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement