బోగస్.. బోగస్..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ, అధికార పక్షం కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది. తమ వ్యతిరేక పార్టీకి దన్నుగా నిలుస్తున్న ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగింపజేసి.. ఇతర నియోజకవర్గాల్లో తమకు మద్దతు తెలిపే వారిని జాబితాలో చేర్పించేందుకు రెండు పార్టీల నేతలు కుట్ర పన్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి బోగస్ ఓటర్లను జాబితాల్లో చేర్చారు. వివరాల్లోకి వెళితే.. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 42.30 లక్షలు. ఏడాదికి అనంతపురం జిల్లాలో 78 వేల మంది జన్మిస్తున్నారు.
జననమరణ రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే.. ఏడాదికి సగటున 50 వేల మేర జనాభా పెరుగుతున్నట్లు అంచనా. ఈ లెక్కన ఈ రెండేళ్లలో మరో లక్ష మేర జనాభా పెరిగిందని అనుకున్నా.. ప్రస్తుతం జిల్లా జనాభా 43.30 లక్షలకు మించదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జనాభాలో 61.9 శాతం మేర ఓటర్లు ఉండవచ్చు. అంటే.. ఈ జిల్లాలో 26.80 లక్షల మంది ఓటర్లు ఉండవచ్చు. కానీ.. తాజా ఓటర్ల జాబితా ప్రకారం 27.35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే.. 55 వేల మంది ఓటర్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కానీ.. ఇప్పటికీ లక్షల సంఖ్యలో అర్హులైన వారి పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. ఒకే వ్యక్తి పేరు ఒక్కో నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లోనూ.. రెండు మూడు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. జిల్లాలో 2.03 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
రెవెన్యూ అధికారులకు బెదిరింపులు
బోగస్ ఓటర్లను తొలగించి.. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు నవంబర్ 18న ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించారు. జనవరి 16న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. దాదాపు ఇదే జాబితాతో 2014లో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది పసిగట్టిన అధికార, విపక్ష నేతలు కుమ్మక్కయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలపై ప్రజ్యాతిరేకత పెల్లుబుకుతోంది. ఎన్నికలను ఎదుర్కోవడానికే కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రజావ్యతిరేకతను ఎదుర్కొని ఎన్నికల విజయం సాధించేందుకు ఆదిలోనే దొడ్డిదారిని ఎంచుకున్నారు. తమ కనుసన్నల్లోనే ఓటర్ల జాబితాను తయారు చేయాలంటూ రెవెన్యూ అధికారులను అధికార, విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారు. తమ వ్యతిరేక పార్టీకి మద్దతుగా నిలిచే ఓటర్లపై తమ నియోజకవర్గాల్లో వారు నివాసం ఉండటం లేదని ఫిర్యాదు చేసి.. వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా ఒత్తిడి తెస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో తమకు మద్దతుగా నిలిచే వారి పేర్లను మాత్రం తమ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో చేర్చేలా ఒత్తిడి తెస్తున్నారు. దీని వల్ల ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లు చేరుతున్నాయి. ఉరవకొండలో 11 వేలు, రాప్తాడులో పది వేలు, శింగనమలలో తొమ్మిది వేలు, హిందూపురంలో 19 వేలు, పెనుకొండలో 19 వేలు, కళ్యాణదుర్గంలో 23 వేలు, తాడిపత్రిలో ఆరు వేల బోగస్ ఓటర్లు ఉన్నట్లు సాక్షాత్తూ కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గంలో ఓ రెవెన్యూ అధికారి దన్నుతో మరో ఐదు వేల బోగస్ ఓట్లను చేర్పించడానికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్సీ విప్ వై.శివరామిరెడ్డిలు ప్రయత్నిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో విడపనకల్లు మండలం పొలికి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచే 140 మంది ఆ గ్రామంలో నివసించడం లేదని రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం అందించి.. తొలగింపజేసేందుకు ఆ ఇద్దరు నేతలు చక్రం తిప్పుతున్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పావగడ, బళ్లారి, అనంతపురం ప్రాంతాల్లో నివసిస్తోన్న టీడీపీ మద్దతుదారులైన ఓటర్ల పేర్లను రాప్తాడు నియోజకవర్గం ఓటర్ల జాబితాలో చేర్పించడానికి టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో పది వేల మంది బోగస్ ఓటర్లు ఉండటం గమనార్హం.
రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్‌లు ప్రాతినిధ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో బోగస్ ఓటర్లున్నారు. ఇప్పుడు ఒక్కో నియోజకవర్గంలో పది వేల మంది ఓటర్ల పేర్లను చేర్పించాలని అధికారులపై మంత్రులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
తప్పులతడకగా ఓటర్ల జాబితా
ఓటర్ల జాబితా తప్పులతడకగా తయారైనట్లు పలు సందర్భాల్లో నిరూపితమైంది. రెండేళ్ల క్రితం జరిగిన అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికల్లోనూ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఇది స్పష్టమైంది. అనంతపురం నియోజకవర్గంలో 40వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకూ పది డివిజన్ల పరిధిలో 15 వేలకుపైగా ఓట్లను జాబితా నుంచి తొలగించారు. వీరందరూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే కావడం గమనార్హం.
ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా వారందరికీ ఓటు హక్కు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో ఓటర్ల జాబితాను చక్కదిద్దేందుకు ఆదివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇకపోతే ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా.. జాబితాలో వారి పేర్లు ఉండటం లేదు. ఇది తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓటరు కార్డు ఉన్నా.. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన దుస్థితి ప్రజలకు ఉత్పన్నమవుతోండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.